సాధారణంగా పదవీ విరమణ సమయంలో ఇతరులపై ఆధారపడకుండా తమ ఆర్థిక అవసరాలను చూసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు పలు పెన్షన్ పథకాలు, పలు ప్రయోజనాలను అందజేస్తోంది. ఈ కథనంలో భారతదేశంలో సీనియర్ సిటిజన్లకు అందించే ప్రయోజనాలను మీరు చూడవచ్చు.
అధిక వడ్డీ రేటు
ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ), రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) లాంటి పొదుపు పథకాలు సాధారణ వ్యక్తుల కంటే సీనియర్ సిటిజన్‌లకు ఎక్కువ వడ్డీని ఇస్తారు. ప్రత్యేకించి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్‌లకు సాధారణ ప్రజల కంటే 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు ఎక్కువ వడ్డీని ఇస్తారు. అధిక వడ్డీని అందజేస్తున్నందున సీనియర్ సిటిజన్లు వారి పొదుపు నుంచి మరింత సంపాదించవచ్చు. పదవీ విరమణ సమయంలో అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఈ పథకాలు సహాయపడతాయి.
పన్ను ప్రయోజనాలు
పొదుపు పథకాలతో పాటు సీనియర్ సిటిజన్లకు వివిధ పన్ను రాయితీలు కూడా పొందవచ్చు. ప్రస్తుతం 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న సీనియర్ సిటిజన్లు రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. 80 ఏళ్లు పైబడిన వారు రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే, ఆరోగ్య బీమా ప్రీమియంలు, కొన్ని పథకాల పెట్టుబడి కోసం రూ.50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు.
ఆరోగ్య బీమా
వయసు పైబడ్డాక సీనియర్ సిటిజన్లు వివిధ వ్యాధులతో బాధపడుతుంటారు. వారికి క్రమం తప్పకుండా వైద్య సహాయం అవసరం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల అవసరాలను తీర్చే అనేక ఆరోగ్య బీమా పథకాలు ఉన్నాయి. ఈ ప్లాన్లు వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో సమగ్ర కవరేజీని, ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.
ప్రజా రవాణా
అనేక రాష్ట్రాలు బస్సు లేదా రైలులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రాయితీ ఛార్జీలను కూడా అందిస్తాయి. అంటే ప్రయాణ ఛార్జీలపై 50 శాతం వరకు తగ్గింపుని ఇస్తాయి. ఇది సీనియర్ సిటిజన్లకు రవాణా ఖర్చులపై డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది.
ఆస్తి పన్ను మినహాయింపు
భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలు సీనియర్ సిటిజన్లకు ఆస్తి పన్ను మినహాయింపును అందిస్తున్నాయి. ఈ మినహాయింపు ఆస్తిని కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.