ఆటలోనే కాదు సంపాదనలోనూ తోపులు.. అత్యధిక బ్రాండ్ వ్యాల్యూ కలిగిన Top- 6 ఇండియన్ క్రీడాకారులు వీరే

First Published | Aug 3, 2024, 10:06 AM IST

క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న భారతీయ క్రీడాకారులు తమ బ్రాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. తమ ప్రతిభతో ఫాలోవర్లను పెంచుకోవడంతో పాటు బ్రాండ్ విలువను కూడా పెంచుకుంటున్నారు. క్రోల్స్ రిపోర్ట్ ప్రకారం అత్యధిక బ్రాండ్ వ్యాల్యూ కలిగిన టాప్- 6 భారతీయ క్రీడాకారులు ఎవరంటే...? 

టాలెంట్ ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు అనేక మంది భారతీయ క్రీడాకారులు. పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చి.. తమ కఠోర శ్రమతో అంతర్జాతీయ క్రీడా లోకంలో తమదైన ముద్ర వేశారు. ఇలా క్రీడల్లో రాణించడం ద్వారా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే, పలువురు క్రీడాకారులకు కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. 

ఇలా ఆటలో రాణించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న క్రీడాకారులు.. ఫామ్‌లో ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునేలా అడుగులు వేస్తున్నారు. తమకున్న క్రేజ్‌ను వ్యాపారంగా మలుచుకుంటున్నారు. అనేక సొంత వ్యాపారాలతో పాటు పలు ప్రముఖ బ్రాండ్లకు యాడ్స్‌లోనూ నటిస్తున్నారు. ఇలా తమకున్న క్రేజ్‌ని ఉపయోగించుకొని బ్రాండ్‌ వ్యాల్యూని కూడా ఎప్పటికప్పుడు పెంచుకుంటున్నారు.

Latest Videos


క్రోల్స్‌ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్- 2023ను తాజాగా విడుదల చేసింది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, మార్కెట్ ప్రభావం ఆధారంగా టాప్‌ బ్రాండ్‌ వ్యాల్యూ కలిగిన భారతీయ క్రీడాకారుల జాబితాను వెల్లడించింది. క్రీడలతో పాటు బ్రాండింగ్‌లోనూ రాణిస్తూ ఈ జాబితాలో టాప్‌ 6లో ఉన్న క్రీడాకారులు వీరే..  

6. నీరజ్ చోప్రా

సుబేదార్‌ నీరజ్ చోప్రా.. చరిత్రాత్మక 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకం సాధించిన తర్వాత అందరి దృష్టినీ ఆయన ఆకర్షించారు. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ తర్వాత నీరజ్‌ చోప్రాకు విపరీతంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. అలాగే, అతని బ్రాండ్‌ విలువ కూడా పెరిగిపోయింది. టోక్యో ఒలింపిక్స్ అచీవ్‌మెంట్, డౌన్-టు-ఎర్త్ వ్యక్తిత్వం నీరజ్‌ చోప్రాని భారత్‌లో దిగ్గజ బ్రాండ్‌లైన STAGE, అండర్ ఆర్మర్ లాంటి వాటికి అగ్ర ఎంపికగా మార్చాయి. అతని బ్రాండ్ విలువ 29.6 మిలియన్ డాలర్లుగా ఉంది. 

5. హార్దిక్ పాండ్యా

టీమిండియా ఆల్ రౌండర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా. ట్రెండ్‌కి తగ్గట్టు ఉండటంతో పాటు ఆడంబరమైన స్టైల్‌తో యువతకు ఎప్పుడూ దగ్గరగా ఉంటాడు. క్రికెట్‌తో పాటు తన జీవితంలో ఎన్ని వివాదాలున్నాయో.. అతణ్ని అభిమానించేవారూ అంతమంది ఉన్నారు. 38.4 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ కలిగిన హార్దిక్ పాండ్యా... అతని స్టైల్‌, ఆల్ రౌండ్ క్రికెట్ సామర్ధ్యాలతో యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకునే బ్రాండ్‌లలో ఫేవరెట్‌గా మారారు. యు, టాకో బెల్ కంపెనీలకు హార్దిక ప్రచారం చేస్తున్నారు. 

4. రోహిత్ శర్మ

రోహిత్‌ శర్మ.. అతని అభిమానులు ముద్దుగా హిట్‌ మ్యాన్‌గా పిలుచుకుంటారు. టీమిండియా క్రికెట్‌ జట్టుకు సారథ్యం వహిస్తూ కీలక విజయాలను సాకారం చేసిన కెప్టెన్‌ రోహిత్‌.. స్థిరమైన బ్రాండ్‌ వ్యాల్యూ కలిగి ఉన్నారు. 41 మిలియన్ డాలర్ల బ్రాండ్‌ విలువ కలిగి ఉన్న రోహిత్‌ శర్మ... 30 ప్రముఖ బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్నారు.

3. సచిన్ టెండూల్కర్

‘గాడ్ ఆఫ్ క్రికెట్’ (క్రికెట్ దేవుడు) అని పేరుపొందిన భారతీయ దిగ్గజ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం, దాతృత్వం సచిన్ బ్రాండ్ విలువను అంతకంతకు పెంచుతోంది. కాగా, సచిన్ బ్రాండ్ విలువ 91.3 మిలియన్ డాలర్లుగా ఉంది. 

2. ఎంఎస్ ధోని

ప్రశాంతమైన ప్రవర్తన, స్ట్రాటజిక్ మైండ్‌గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ప్రజాదరణ పొందుతున్నారు. ఇప్పటికీ క్రికెట్‌ అభిమానుల గుండెల్లో ఆయనకు సుస్థిరమైన స్థానం ఉంది. 95.8 మిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువ కలిగిన ధోని... క్రికెట్ లెగసీతో పాటు Jio Cinema, Panerai లాంటి బ్రాండ్లతో ముందుకు సాగుతున్నారు. 
 

1. విరాట్ కోహ్లి

డైనమిక్ పర్సనాలిటీతో పాటు క్రికెట్‌లో స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్న విరాట్‌ కోహ్లీ... ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కోహ్లీకి భారీగా ఫాలోయింగ్ ఉంది. ఈ అభియాన సైన్యమే అతణ్ని అత్యంత విలువైన భారతీయ క్రీడాకారుడిగా మార్చేసింది. ప్రస్తుతం కోహ్లీ బ్రాండ్‌ విలువ 227.9 మిలియన్‌ డాలర్లతో ఇండియాన్‌ క్రీడాకారులెవరూ అందుకోలేనంత ఎత్తున ఉంది.

click me!