
వయసులో వుండగా ఎన్ని కష్టాలైనా భరిస్తాం... కానీ వయసు మీదపడ్డాక ప్రశాంతంగా వుండాలని ప్రతిఒక్కరం కోరుకుంటాం. ఉద్యోగ విరమణ తర్వాత ఎలాంటి చీకూచింత లేకుండా జీవితం సాగిపోతే చాలని అనుకుంటాం. కానీ వృద్దాప్యంలోనూ ఆర్థిక అవసరాలుంటాయి... ఆ వయసులోనూ తగిన ఆదాయం వుంటేనే జీవితం సాఫీగా సాగేది. కాబట్టి వృద్దుల కోసం ప్రత్యేక సేవింగ్ స్కీమ్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.
ఏమిటీ స్కీమ్ :
వృద్దాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బ్రతకాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాంటివారి కోసమే కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ తీసుకువచ్చింది. మీరు జీవితాంతం కష్టపడిన సంపాదనలో కొంతభాగం రిటైర్మెంట్ వయసులో పెట్టుబడిగా పెడితే చాలు... స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. డబ్బులు సురక్షితంగా వుండేలా... మంచి ఆదాయం వచ్చేలా ఈ సీనియర్ సిటిజన్స్ స్కీం వుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్ లో కూడా ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ను అందిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాయోజిత పథకం కాబట్టి మీ డబ్బులు సురక్షితంగా వుంటాయి. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2004 లో ప్రవేశపెట్టింది. ఇది భారత దేశంలోనే అత్యంత లాభదాయక పొదుపు పథకాల్లో ఒకటి.
ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో వడ్డీ రేట్లు అత్యధికంగా వుంటాయి. ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లు వంటి పొదుపు పథకాల ద్వారా అందే వడ్డీతో సమానంగా ఈ స్కీం డిపాజిటర్లకు వడ్డీ లభిస్తుంది. వడ్డీ రేటు 8.2 శాతం వరకు వుంటుంది... అయితే ఈ వడ్డీ రేట్లను మూడు నెలలకోసారి రివ్యూచేస్తారు. ఆ వడ్డీ ప్రకారమే ఇన్వెస్టర్లకు ప్రతి మూడు నెలలకోసారి డబ్బులు వస్తాయి.
ఈ స్కీమ్ లో ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చు :
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ను కొన్ని బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ ద్వారా పొందవచ్చు. అర్హత కలిగిన సీనియర్ సిటిజన్స్ రూ.1000 చెల్లించి ఖాతా తెరవాల్సి వుంటుంది. అత్యధికంగా రూ.30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ఖాతా వ్యక్తిగతంగా లేదంటే ఉమ్మడిగా తెరవవచ్చు... అంటే జీవిత భాగస్వామిని కూడా ఈ స్కీంలో చేర్చవచ్చు.
ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే ఐదేళ్లపాటు లాభాలను పొందవచ్చు. మెచ్యూరిటీ సమయాన్ని ఐదేళ్ల తర్వాత కూడా మరికొంతకాలం పెంచుకోవచ్చు. ఇలా మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. అయితే ఇలా ఒక్కసారి మాత్రమే పొడిగించుకోవచ్చు. అయితే మధ్యలో ఏదయినా అవసరాలు వస్తే ఈ సేవింగ్ ఖాతా నుండి ముందుగానే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈ సేవింగ్ స్కీమ్ లాభాలు :
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ లో పెట్టిన డబ్బులకు వడ్డీరేటు అధికంగా వుంటుంది. ఉదాహరణకు మీరు రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేసారనుకొండి... ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ప్రతి మూడు నెలలకు రూ.61,500 వడ్డీ వస్తుంది. అంటే సంవత్సరంలో నాలుగుసార్లు వచ్చే ఈ మొత్తం రూ.2,46,000 వేలు. అంటే నెలకు రూ.20 వేలకు పైగా వడ్డీ వస్తుందన్నమాట.
అయితే మన పెట్టుబడి డబ్బులు, మారే వడ్డీ రేట్ల ప్రకారం ఈ లెక్కలు మారవచ్చు. కానీ ఎలా చూసుకున్నా ఈ స్కీం ద్వారా సీనియర్ సిటిజన్స్ మంచి లాభాలను పొందవచ్చు. ఈ పథకంలో డబ్బులు ఐదేళ్లపాటు వుంచాలి... కాబట్టి ఈ కాలానికి వడ్డీల రూపంలోనే 12లక్షలకు పైగా వస్తుంది. మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం వుంటుంది... కాబట్టి అలా చేస్తూ రూ.30 లక్షల పెట్టుబడికి ఎనిమిదేళ్లలో దాదాపు 20 లక్షల వడ్డీ వస్తుంది.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఖాతాను పోస్ట్ ఆఫీస్ లేదా భారతదేశంలోని ఏదైనా ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులతో తెరవవచ్చు. రెండింటి ప్రక్రియ ఒకేలా ఉంటుంది. మరింత సమాచారం కోసం మీ సమీపంలోని బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్‌ని సందర్శించండి.