అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో యావత్ ప్రపంచమే ఆందోళనలో ఉంది. అమెరికా స్టాక్ మార్కెట్స్ తో సహా చాలా దేశాల్లోని స్టాక్ మార్కెట్స్ పతనం అవుతున్నాయి. ఇలా వరల్డ్ మార్కెట్ల అస్థిరత 2008, 2020 నాటి మార్కెట్ క్రాష్‌లను గుర్తుచేస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి పతనానికి హెచ్చరిక కాదు... పెట్టుబడిదారులు తిరిగి సర్దుబాటు చేసుకోవడానికి ఒక అవకాశమని ఆర్థిక, మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు దేవేందర్ సింఘాల్ మాట్లాడుతూ... చరిత్రలో మార్కెట్ పతనాలు బలమైన, నిలకడగా ఉండే ర్యాలీలకు మార్గం సుగమం చేశాయని అన్నారు. "మీరు దీర్ఘకాలిక మార్కెట్ ప్రయాణాన్ని చూస్తే అన్ని పతనాలు చివరికి గొప్ప ఎంట్రీ పాయింట్లుగా కనిపిస్తాయి. ఈసారి కూడా అంతే" అని ఆయన అన్నారు.
అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ అనిశ్చితి ప్రభావం ఉన్నప్పటికీ, భారతదేశం ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కంటే మెరుగైన స్థానంలో ఉందని సింఘాల్ పేర్కొన్నారు. ''భారతదేశంపై ఇంకా ఆశాభావం ఉంది. ఇతర మార్కెట్లలో కనిపించిన స్థాయిలో మన పతనం లేదు. రాబోయే వాణిజ్య చర్చలు భారతదేశానికి మరింత అనుకూలమైన పరిస్థితులకు దారితీస్తాయని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు'' అని ఆయన అన్నారు.
వాణిజ్య నిబంధనలు మెరుగుపడితే భారతదేశం ప్రపంచ ఎగుమతి వాటాను పెంచుకుంటుందని.. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో మంచి స్థానం పొందుతుందన్నారు సింఘాల్. అయితే విధానపరమైన అనిశ్చితి, ప్రపంచ ద్రవ్యోల్బణం ఆందోళనలు కొనసాగుతున్నందున రాబోయే రెండు మూడు నెలలు కష్టంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.