కేవలం ఒకే ఒక్క నెలలో... బిఎస్ఎన్ఎల్ సీన్ రివర్స్ :
ప్రైవేట్ టెలికాం సంస్థల దెబ్బకు ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఎక్కడ నిలుస్తుంది... ఇక దీని పని అయిపోయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ గోడకు కొట్టిన బంతిలా ఎంత వేగంగా అయితే కిందపడింతో అంతే వేగంగా పైకి లేస్తోంది ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ. తాజాగా ఈ బిఎస్ఎన్ఎల్ దూకుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇటీవల ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలు భారీగా పెంచడంతో కస్టమర్లకు తత్వం బోధపడినట్లుంది... ఎప్పటికయినా ఈ సంస్థలతో తమకు ఆర్థిక భారమేనని భావించారో ఏమో బిఎస్ఎన్ఎల్ లోకి మారుతున్నారు. ఇలా రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) లకు షాక్ ఇస్తూ లక్షలాదిమంది కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ అవతున్నారు.
ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కల ప్రకారం ... కేవలం ఒక్క జూలై నెలలోనే బిఎస్ఎన్ఎల్ 29 లక్షల మంది కస్టమర్లను సంపాదించుకుంది. ఇదే సమయంలో ప్రైవేట్ టెలికాం సంస్థల కస్టమర్లు అమాంతం తగ్గిపోయారు. ట్రాయ్ లెక్కలు బిఎస్ఎన్ఎల్ లో నూతన ఉత్తేజాన్ని నింపుతుండగా జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ సంస్థలను కంగారు పెడుతున్నాయి.