విస్తారా - ఎయిర్ ఇండియా విలీనం: టాటా గ్రూప్ స్టెప్ అదుర్స్

First Published | Aug 30, 2024, 3:27 PM IST

అంతర్జాతీయంగా నంబర్‌ వన్‌ స్థానాన్ని సాధించాలన్నలక్ష్యంతో సాగుతున్న ఎయిర్‌ ఇండియా బలోపేతమవుతోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ విమాన యాన సంస్థం ఇటీవలే టాటా కంపెనీ చేతిలోకి వెళ్లింది. ఎయిర్ ఇండియాను బలోపేతం చేసే క్రమంలో భాగంగా టాటా కంపెనీ దానిలో భాగమైన విస్తారా ఎయిర్‌లైన్స్‌ను అఫీషియల్‌గా ఎయిర్‌ ఇండియాలో విలీనం చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. మరిన్ని వివరాలు పరిశీలిద్దాం.

భారత విమానయాన రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(FDI)కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్(SIA), టాటా గ్రూప్‌ సంయుక్త భాగస్వామ్యంలో ఉన్న విస్తారా ఎయిర్ లైన్స్‌ను ప్రస్తుత టాటా గ్రూప్‌ పర్యవేక్షణలో ఉన్న ఎయిర్ ఇండియాలోకి విలీనం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

అసలు ఏంటీ విస్తారా..
విస్తారా ఎయిర్‌లైన్‌ సంస్థ డిల్లీ సమీపంలోని గుర్గావ్‌లో ఉన్న ఒక భారతీయ విమానయాన సంస్థ. దీన్ని టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ కలిపి నిర్వహిస్తున్నాయి. 2015 జనవరి 9న ఢిల్లీ నుండి ముంబై మధ్య మొదటి విమానాన్ని విస్తారా నడిపింది. ఒక్క సంవత్సరంలోనే 20 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి పేరు గడించింది. మే 2019 నాటికి దేశీయ క్యారియర్ మార్కెట్లో 4.7% వాటాను సొంతం చేసుకుంది. ఇది దేశంలో 6వ అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థగా నిలిచింది. ఎయిర్బస్ A320, బోయింగ్ 737-800NG వంటి 70 విమానాలు ఈ సంస్థ చేతిలో ఉన్నాయి. 
దేశంలోకి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ 
టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ కలిపి విస్తారాను నిర్వహిస్తున్నాయి. ఇందులో 49% వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలిగి ఉంది. అంటే ఇప్పుడు రూ. 2,059 కోట్ల పెట్టుబడితో కొత్తగా విలీనమైన ఎయిర్ ఇండియా గ్రూప్‌లోకి  సింగపూర్ ఎయిర్‌లైన్స్ వస్తోందన్న మాట. అంటే ఇది ఎయిర్‌ ఇండియాలో 25.1% వాటాను పొందనుంది. భారత ప్రభుత్వం ఎఫ్‌డిఐకి ఆమోదం తెలపడంతో  ఇది సాధ్యమవుతోంది.  

Latest Videos


నవంబర్‌ 12కు విలీనం పూర్తి..
సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, టాటా సన్స్ 2024 చివరి నాటికి విలీనాన్ని పూర్తి చేయడానికి అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే విలీన ప్రక్రియ మొదలైందని నవంబర్‌ 12న అఫీషియల్‌గా ప్రకటన విడుదల అవుతుందని విస్తారా నిర్వహణ ప్రతినిధులు ప్రకటించారు. ఈ విషయాన్ని వారి ఉద్యోగులకు పంపిన మెయిల్‌ ద్వారా వివరాలు వెల్లడించారు. 

ఇకపై టిక్కెట్లన్నీ ఎయిర్‌ ఇండియాలోనే..
కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌డిఐకి ఆమోదం తెలపడంతో ఎయిర్ ఇండియాలో విస్తారా విలీన ప్రక్రియ సులభంగా జరుగుతోంది. ప్రస్తుతానికి ప్రయాణికులు విస్తారా ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చునని, త్వరలో విలీనం పూర్తయిన తర్వాత ఎయిర్‌ ఇండియా ద్వారా బుకింగ్‌ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని విస్తారా ప్రతినిధులు ప్రకటించారు. 

కొనసాగుతున్న ఉద్యోగుల బదిలీ..
విస్తారా ఇప్పటికే తన ప్రయాణికులకు విలీన ప్రక్రియ గురించి తెలియజేయడం ప్రారంభించింది. తరచూ ప్రయాణించే ప్రయాణికుల వివరాలు, వారికి అందిస్తున్న సేవల గురించి ఇప్పటికే ఎయిర్ ఇండియాకు బదిలీ చేసింది. విస్తారా ఉద్యోగులు ఎయిర్‌ ఇండియాలోకి బదిలీ కావడం ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. గుర్గావ్‌లోని ఎయిర్ ఇండియా కొత్త ప్రధాన కార్యాలయం నుండి అనేక మంది విస్తారా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

ప్రయాణికుల్లో అనుమానాలు..
టిక్కెట్ల బుకింగ్‌లో అవాంతరాలపై ప్రయాణికుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. విలీన తేదీ తర్వాత షెడ్యూల్ చేయబడిన విమానాలలో బిజినెస్, ప్రీమియం, ఎకానమీ క్లాస్ వంటి విస్తారా ప్రీమియం క్యాబిన్‌లలో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఎయిర్‌ ఇండియా ఎలా సర్దుబాటు చేస్తుందన్న అనుమానాలున్నాయి. రెండు క్లాష్ అయ్యే అవకాశాలున్నాయని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అలా జరగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని విస్తారా ప్రతినిధులు చెబుతున్నారు. 

విలీనం వాయిదాపై చర్చ..
విస్తారా విలీనాన్ని వాయిదా వేయడంపై ఎయిర్ ఇండియా మేనేజ్‌మెంట్‌లో అంతర్గత చర్చలు జరిగినట్లు సమాచారం. విలీనానికి ముందే ఎయిర్ ఇండియా విమానాలను మొదట అప్‌గ్రేడ్ చేయాలన్నది మొదటి కారణం కాగా, విలీనం తర్వాత విస్తారా ఉద్యోగులకు ఎయిర్‌ ఇండియాలో పదోన్నతులు, ఎయిర్ ఇండియా అధికారులకు కీలక పదవుల కేటాయింపు గురించి చర్చ జరిగింది. అయితే ఇవన్నీ సజావుగానే సాగడంతో ప్రణాళికాబద్ధంగా విలీనాన్ని కొనసాగించాలనే నిర్ణయం వెలువడినట్లు సమాచారం. 

ఎయిర్‌ ఇండియా కోరిక నెరవేరుతుందా..
అంతర్జాతీయంగా నంబర్‌ వన్‌ స్థానాన్ని సాధించాలన్నలక్ష్యంతో సాగుతున్న ఎయిర్‌ ఇండియా తనలో భాగమైన విస్తారాను విలీనం చేయడం ద్వారా పోటీ సంస్థలకు గట్టి సంకేతాన్నిచ్చింది. ఇప్పటికే విలీనం వార్త భారతీయ విమానయాన మార్కెట్‌లో గణనీయమైన మార్పును సూచిస్తోంది. వివిధ మార్కెట్ విభాగాలలో ఎయిర్ ఇండియా గ్రూప్ పోటీతత్వాన్ని బలోపేతం చేస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు. 
 

click me!