బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ, క్యాష్‌లెస్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అన్ని క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. ఇక ఈ కామర్స్ సంస్థలు సైతం కొన్ని క్రెడిట్ కార్డులపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తుండడంతో చాలా మంది ఒకటికి మించి క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే ఏదో ఒక సమయంలో మనలో ప్రతీ ఒక్కరూ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడంలో ఇబ్బందులు పడే ఉంటారు. అయితే మీ దగ్గర రెండు క్రెడిట్ కార్డులు ఉంటే. ఒక కార్డుతో మరో కార్డు బిల్లును చెల్లించవచ్చని తెలుసా.? అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడంలో ఏమాత్రం జాప్యం చేసినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క రోజు ఆలస్యమైనా బ్యాంకులు భారీ మొత్తంలో వడ్డీ వసూలు చేస్తుంటాయి. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్‌పై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే బిల్ పేమెంట్ సమయానికి కచ్చితంగా పేమెంట్ చేయాలని ఆర్థిక నిపుణులు సైతం చూస్తుంటారు. మరి మీ చేతిలో డబ్బులు లేకపోయినా ఇంకో క్రెడిట్ కార్డుతో బిల్లు చెల్లించడానికి మూడు విధానాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డిజిటల్ వ్యాలెట్స్..
ప్రస్తుతం కొన్ని డిజిటల్ వ్యాలెట్స్‌లో క్రెడిట్ కార్డుతో మనీలో లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇందుకోసం కొంత మొత్తంలో ఛార్జీలను వసూలు చేస్తాయి. టీ వ్యాలెట్ వంటి యాప్స్‌లో మీ క్రెడిట్ కార్డుతో ముందుగా డబ్బులు యాడ్ చేసుకోవాలి. అనంతరం వ్యాలెట్‌కు క్రెడిట్ కార్డును లింక్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. లేదంటే ఆ అమౌంట్‌ను మీ బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుని కూడా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు.
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్..
ఒక క్రెడిట్ కార్డులో ఉన్న బిల్ అమౌంట్‌ను మరో క్రెడిట్ కార్డుకు ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇందులో కూడా కొంత మొత్తంలో ఛార్జీలను వసూలు చేస్తారు. ఇది బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది. ఇలా కూడా మీ క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించుకోవచ్చు.
ఏటీఎం ద్వారా..
మనం ఉపయోగించే క్రెడిట్ కార్డు లిమిట్‌లో కొంత మొత్తాన్ని ఏటీంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నగదును నేరుగా ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న మొత్తంపై విత్‌డ్రా ఛార్జీలు పడతాయని గుర్తుపెట్టుకోవాలి. కాగా ఇలా విత్‌డ్రా చేసిన మొత్తాన్ని మీ సేవింగ్స్ అకౌంట్‌లో వేసుకొని క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించుకోవచ్చు.
గమనిక: ఈ విధానాలను కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించుకోవాలి. వీలైనంత వరకు క్రెడిట్ కార్డు బిల్లను మీకు వచ్చే ఆదాయంతోనే చెల్లించే ప్రయత్నం చేయాలి. అనవసరంగా ఛార్జీలు చెల్లించే కంటే మీ దగ్గర ఉన్న మొత్తంతో బిల్లు చెల్లించి మళ్లీ క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవడం ఉత్తమం.