ఓ పదేళ్ల క్రితం వరకు మోసం చేయడం అంటే డబ్బు తీసుకొని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టడం. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వను. ఏం చేసుకుంటావో నీ ఇష్టం అంటూ మోసగాళ్లు బరితెగించి చెప్పేసే వాళ్లు. ఇప్పుడలా కాదు. మన అకౌంట్ లో డబ్బులు ఎప్పుడు ఎంత కట్ అవుతున్నాయో అర్థం కాకుండా ఉంది. అకౌంట్ లో 100, 200 తగ్గితే అవసరానికి ఖర్చుపెట్టి ఉంటాం లే అని సర్దుకుపోతుంటాం కదా.. కాని 100, 200 లను కూడా డిజిటల్ స్కామర్లు మోసం చేసి దొంగిలస్తున్నారు.
సాధారణంగా మన అకౌంట్ లో వేలల్లో డబ్బులు తగ్గాయనుకోండి వెంటనే అనుమానం వచ్చి చెక్ చేసుకుంటాం. కాని వందల్లో తగ్గితే ఖర్చులకు వాడేశామని అనుకుంటాం. ఇక్కడే డిజిటల్ మోసగాళ్లు తెలివితేటలుగా ఎక్కువ మంది దగ్గర తక్కువ డబ్బులు దోచేస్తున్నారు. ఈ విషయం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తేనే తప్ప బయట పడదు. ఇలాంటి మోసాల్లో భాగమే క్యూఆర్ కోడ్ మోసాలు.
క్యూఆర్ కోడ్ (Quick Response Code) ఆధారిత మోసాలు కూడా సొసైటీలో పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు డిజిటల్ పేమెంట్ వ్యవస్థలోకి కూడా చొరబడిపోతున్నారు. క్యూఆర్ కోడ్ మోసాల్లోనూ చాలా రకాలున్నాయి.
1. నకిలీ క్యూఆర్ కోడ్: క్యూఆర్ కోడ్ తయారీలోనే మోసగాళ్లు చొరబడిపోతారు. నకిలీ క్యూఆర్ కోడ్లను సృష్టించి వాటిని వ్యాపార సంస్థలకు ఇస్తారు. ఈ విషయం తెలియక జరిగిన పేమెంట్స్ నుంచి వచ్చిన డబ్బంతా మోసగాళ్లు తమ అకౌంట్స్ లోకి మార్చుకుంటారు.
2. క్యూఆర్ కోడ్ మార్పిడి: చాలా షాపుల్లో క్యూఆర్ కోడ్ లను బయట అతికించి ఉంచుతారు. వినియోగదారులకు వాటిని స్కాన్ చేయమని చెబుతారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఉన్న అసలు క్యూఆర్ కోడ్లను మార్చి నకిలీ కోడ్ అతికిస్తారు. ఇది తెలియక వినియోగదారులు, దుకాణ యజమానులు ఇద్దరూ డబ్బులు నష్టపోతారు.
3. పేమెంట్ చేసినట్టు నటించడం: దుకాణంలో వస్తువులు కొని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లుగా నటిస్తారు. కాని చేయరు. అప్పటికే పేమెంట్ చేసినట్టు ఉన్న మెసేజ్ చూపించి కొందరు మోసం చేస్తుంటారు.
4. మాల్వేర్ బొమ్మలు: నకిలీ కోడ్లను స్కాన్ చేస్తే మీ ఫోన్‌లో మాల్వేర్ లేదా ఫిషింగ్ లింకులు ఇన్‌స్టాల్ అవుతాయి. దీంతో మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించి వాటి ద్వారా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారు.
ఇది కూడా చదవండి: తెలియని నంబరు నుంచి మిస్డ్ కాల్ వస్తే కాల్ బ్యాక్ చేయకండి: ఇదో పెద్ద స్కామ్
ఇలాంటి క్యూఆర్ కోడ్ మోసాలు కేవలం దుకాణాలకే పరిమితం కాలేదు. పెట్రోల్ పంపులను కూడా లక్ష్యంగా చేసుకుని కూడా చేస్తున్నారు. బిర్యానీ పాయింట్లు, టీ దుకాణాలు, జ్యూస్ సెంటర్లు ఇలా చిన్న చిన్న షాపుల్లో ఎక్కువగా క్యూఆర్ కోడ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు.
ఈ క్యూఆర్ కోడ్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు డీటైల్స్ ధృవీకరించుకోండి.
కోడ్ స్కాన్ చేసిన తర్వాత కనిపించే లింక్ URLను పరిశీలించండి. అనుమానంగా ఉంటే పేమెంట్ చేయకండి.
డిజిటల్ పేమెంట్ కోసం Google Pay, PhonePe, Paytm వంటి సురక్షిత యాప్‌లను ఉపయోగించండి.