గ్లామర్, ఆడంబరంతో కప్పబడిన ఈ ప్రపంచంలో సక్సెస్ అనేది అదృష్టం లేదా ఫెమ్ తో కాదు వ్యక్తి విలువలో ఉంటుంది అనేది సుధా మూర్తి సిద్ధాంతాలలో ఒకటి.
19 ఆగస్టు 1950న జన్మించిన సుధా మూర్తి విద్యావేత్త, రచయిత్రి ఇంకా పరోపకారి. 2006లో సుధా మూర్తిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది ఇంకా 2023లో ఆమెకు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను ప్రదానం చేసింది. సుధా మూర్తి మొత్తం విలువ దాదాపు రూ.700 కోట్లుగా అంచనా. ఆమె ఏటా రూ.300 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.
కానీ ఇతర ధనవంతులలాగ కాకుండా, సుధా మూర్తి చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. గత 24 ఏళ్లలో ఆమె ఒక్క కొత్త చీర కూడా కొనలేదంటే నమ్ముతారా.. ? అవును. సగటు జీతం తీసుకునే స్త్రీలు వారానికి ఒక చీర కొంటారని, అయితే 24 ఏళ్లలో ఇన్ని కోట్ల ఆస్తులున్న ఆమె ఒక్క కొత్త చీర కూడా కొనకపోవడం ఆశ్చర్యంగా ఉంది కదా.
“నేను పవిత్ర స్నానం కోసం కాశీలో ఉన్నాను, మీరు కాశీకి వెళ్లినప్పుడు మీరు ఎక్కువగా ఆనందించేదాన్ని వదులుకోవాలి. అప్పటి నుండి నేను షాపింగ్, ముఖ్యంగా చీరలు మానేశాను. ఇప్పుడు నేను నిత్యావసర వస్తువులు మాత్రమే కొంటాను” అని సుధా మూర్తి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
తన భర్త నారాయణ మూర్తి కూడా తనతో ఏకీభవించారని, ఆయన కూడా సాదాసీదా అభిరుచులు ఉన్న వ్యక్తి అని సుధా మూర్తి చెప్పారు. అయితే సుధ, నారాయణ మూర్తి పుస్తకాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఈ జంట ఇప్పటికి 20 వేలకు పైగా పుస్తకాలను సేకరించడం గమనార్హం.