Ratan Tata: భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇకలేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు.
86 ఏళ్ల రతన్ టాటా.. ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు సోమవారం తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమవారం తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో టాటా పోస్ట్ చేశారు.
అయితే, బుధవారం టాటా ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ముంబైలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చేర్చి వైద్యమందించారు. ఈ క్రమంలో వైద్యం అందుకుంటూ బుధవారం రాత్రి రతన్ టాటా కన్నుమూశారు.
రతన్ టాటా బయోగ్రఫీ
రతన్ టాటా పూర్తి పేరు రతన్ నవల్ టాటా. 1937 డిసెంబరు 28న జన్మించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూపునకు ఛైర్మన్‌గా రతన్ టాటా కొనసాగారు. అనంతరం 2016 అక్టోబరు నుంచి 2017 ఫిబ్రవరి నెల వరకు టాటా గ్రూపునకు ఇంటెరిమ్ ఛైర్మన్‌గా పనిచేశారు. టాటా ఛారిటబుల్ ట్రస్టులకు ఆయన అధిపతిగా కొనసాగారు.
రతన్ టాటా అందుకున్న పురస్కారాలు
రతన్ టాటా 2008లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. అంతకు ముందు 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. ఇండియాలో పారిశ్రామికవేత్తగా రతన్ టాటా ఎంత పేరు సాధించారో.. ఆయన దాతృత్వానికి అంతే గుర్తింపు పొందారు. వ్యాపారంలో విలువలకు టాటా పెట్టింది పేరుగా నిలిచారు.
రతన్ టాటా విద్యాభ్యాసం
టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జమ్ షెడ్జీ టాటాకు రతన్ టాటా మునిమనుమడు. 1937లో జన్మించిన రతన్ టాటా... అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా కార్నెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హార్వర్డ్ బిజినెస్ స్కూళ్లలో విద్యాభ్యాసం చేశారు. 1961లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో చేరారు. 1991లో జేఆర్డీ టాటా పదవీ విరమణ చేశారు. అనంతరం జమ్ షెడ్జీ టాటా వారసుడిగా కంపెనీ భాద్యతలు చేపట్టారు. టాటాను వ్యాపార సామ్రాజ్యాన్ని విలువతో ఎంతగానో విస్తరించారు. టాటా గ్రూప్ సంస్థల్లోని ఆటోస్ టు స్టీల్ సమ్మేళనానికి 1991లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. టెలీ సర్వీసెస్ కంపెనీ టీటీఎంఎల్‌ను 1996లో స్థాపించారు. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రారంభించారు.
రతన్ టాటా మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.