Post Office RD Scheme: భవిష్యత్తు అవసరాల కోసం క్రమం తప్పకుండా పొదుపు చేయాలనుకునే వారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ మంచి అవకాశం. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తూ ఐదేళ్లలో గణనీయమైన మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు.ఈ స్కీమ్ పూర్తి వివరాలు మీకోసం.
ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారు నెలవారీ పొదుపు చేసేందుకు పోస్టాఫీస్ RD ఉపయోగపడుతుంది. ఇందులో ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని ఖాతాలో జమ చేయాలి. ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు. అంటే మొత్తం 60 నెలల పాటు వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ మద్దతు ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకం కావడంతో రిస్క్ లేకుండా క్రమశిక్షణతో డబ్బు దాచుకోవాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. కనీసం నెలకు రూ.100తో ఖాతా ప్రారంభించే అవకాశం ఉంది.
25
నెలకు రూ.10 వేలతో ఐదేళ్లలో ఎంత జమ అవుతుంది?
మీరు నెలకు రూ.10,000 చొప్పున 60 నెలల పాటు జమ చేశారనుకుంటే.. 5 ఏళ్లకు గాను మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.6,00,000 అవుతుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ పథకానికి 6.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఐదేళ్లకు వచ్చే సుమారు రూ.1,13,658 వడ్డీ లభిస్తుంది. దీంతో మెచ్యూరిటీ సమయంలో చేతికి మొత్తం రూ.7,13,658 వస్తుంది. అంటే ఐదేళ్లలో మీరు దాచుకున్న రూ.6 లక్షలకు అదనంగా సుమారు రూ.1.13 లక్షల వడ్డీ ఆదాయం లభిస్తుంది.
35
ప్రస్తుతం ఎంత వడ్డీ లభిస్తోంది?
2026 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అమల్లో ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం పోస్టాఫీస్ ఐదేళ్ల RD పథకంపై వార్షికంగా 6.7 శాతం వడ్డీ అందుతోంది. ఈ వడ్డీని త్రైమాసిక చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. కాబట్టి కొత్తగా ఖాతా ప్రారంభించే ముందు అప్పటికి అమల్లో ఉన్న వడ్డీ రేటును పరిశీలించాలి.
పోస్టాఫీస్ RD ఖాతాను పెద్దలు తమ పేరుతో ప్రారంభించవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మైనర్ల పేరుతో ఖాతా ప్రారంభించే అవకాశం ఉంది. పదేళ్లు నిండిన మైనర్లు నిబంధనల ప్రకారం తమ పేరుతోనే ఖాతా నిర్వహించవచ్చు. ఈ పథకంలో నెలవారీ కనీస డిపాజిట్ రూ.100. ఆ తర్వాత రూ.10 గుణిజాల్లో ఎంత మొత్తమైనా జమ చేయవచ్చు. గరిష్ఠ డిపాజిట్ పరిమితి లేదు.
55
పెట్టుబడి పెట్టే ముందు ఈ నిబంధనలు తెలుసుకోండి
ప్రతి నెలా నిర్ణీత గడువులో వాయిదా చెల్లించాలి. ఆలస్యమైతే ప్రతి రూ.100 డిపాజిట్‌కు నెలకు రూ.1 చొప్పున జరిమానా విధిస్తారు. వరుసగా వాయిదాలు చెల్లించకపోతే ఖాతా నిర్వహణపై నిబంధనలు వర్తిస్తాయి. ఖాతా ప్రారంభించిన మూడేళ్ల తర్వాత ముందస్తుగా మూసివేసే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు సాధారణ RD వడ్డీ రేటు కాకుండా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు వర్తిస్తుంది. RD ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం ఆదాయపు పన్ను నిబంధనలకు లోబడి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత కూడా ఖాతాను పొడిగించుకునే వెసులుబాటు నిబంధనల ప్రకారం ఉంటుంది. మొత్తంగా చూస్తే, ప్రతి నెలా రూ.10 వేల చొప్పున పొదుపు చేయగలిగితే ఐదేళ్లలో రూ.7.13 లక్షలకు పైగా సమకూర్చుకోవచ్చు. క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ భవిష్యత్తు అవసరాల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి పోస్టాఫీస్ RD ఉపయోగకరమైన మార్గం.