కానీ రానున్న రోజుల్లో పెట్రోల్ - డీజిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయా..? లీటర్ పెట్రోల్ ధర రూ.200కు పెరుగుతాయా..? అనే ప్రశ్నకు అవుననే అంటున్నారు ఇంధన నిపుణులు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేని విధంగా ఆకాశానికి తాకుతుండటంతో ఆందోళన చెందిన సామాన్యులకు దీపావళి (Diwali) సందర్భంగా కేంద్రం తీపి కబురు చెప్పింది. పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఇంధన ధరల భారాన్ని కాస్త దింపింది.
దీంతో పెట్రోల్ ధరలు దిగోచ్చాయి. అయితే ఇంధన ధరల తగ్గింపు ఉపశమనం తాత్కాలికమేనని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేసి వెల్లడించారు నరేంద్ర తనేజా. దేశంలో రానున్న నెలల్లో ఇంధన ధరల పెరుగుదల గురించి నరేంద్ర తనేజా షాకింగ్ విషయాలు తెలిపారు. 2023 నాటికి మరో రూ.100 పెరిగి లీటర్ పెట్రోల్ రూ.200 అవుతుందని అంచనా వేశారు. దేశంలో వినియోగించే చమురులో 86 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది కాబట్టి వీటి ధరలు కేంద్రం నియంత్రనలో ఉండవన్నారు. డిమాండ్-సప్లయిలో సమతుల్యం లేనప్పుడల్లా ధరలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశీయ అవసరాల్లో 86 శాతం చమురును విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్-సప్లయ్‌కి అనుగుణంగా ధరలు మారుతుంటాయి. ధరలు భారీగా పెరగడానికి కరోనా సంక్షోభమే కారణం. డిమాండ్ కి అనుగుణంగా సరఫరా లేకపోతే అనివార్యంగా ధరలు పెరుగుతాయి.
అలాగే చమురు రంగంపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవడం కూడా ఓ కారణం. కేవలం పునరుత్పాదక, హరిత ఇంధనంపైనే ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న కొన్ని నెలల్లో ఇంధన ధరలు మరింత పెరుగుతాయి. 2023 నాటికి లీటర్ ముడి చమురు ధర మరో రూ.100 ఎగబాకే అవకాశం ఉందన్నారు. ఆలాగే పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగులుకు మొగ్గు చూపేల చేస్తుంది.