Old Clothes Recycling: పాత బట్టలకు కొత్త పాత్రలు ఇస్తామంటూ కొందరు వ్యాపారులు ఇళ్ల చుట్టూ తిరుతుంటారు. అయితే ఆ బట్టలతో వాళ్లు ఏం చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.? దీని వెనుక ఒక పెద్ద వ్యాపార వ్యవస్థ పనిచేస్తోందని మీకు తెలుసా.?
ఇళ్ల నుంచి సేకరించిన పాత బట్టలను వ్యాపారులు నేరుగా పెద్ద గిడ్డంగులు లేదా హోల్‌సేల్ వ్యాపారుల వద్దకు తరలిస్తారు. అక్కడ వాటిని నాణ్యత ఆధారంగా వేర్వేరుగా వర్గీకరిస్తారు. మంచి స్థితిలో ఉన్న బట్టలను శుభ్రం చేసి మళ్లీ అమ్మకానికి సిద్ధం చేస్తారు. బాగా చిరిగిపోయినవి, ఉపయోగించలేని బట్టలను రీసైక్లింగ్ కోసం ప్రత్యేకంగా పంపిస్తారు. ఇలా పాత బట్టలను మళ్లీ వినియోగించడం వల్ల పెద్ద ఎత్తున వ్యాపారం కొనసాగుతోంది.
25
మంచి బట్టలు మళ్లీ మార్కెట్‌లోకి
నాణ్యమైన పాత బట్టలు సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో చాలా తక్కువ ధరలకు విక్రయిస్తారు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు, విద్యార్థులు, కార్మికులు, అవసరమైన వారు ఈ మార్కెట్ల నుంచి తక్కువ ఖర్చుతో బట్టలు కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో విదేశాల నుంచి దిగుమతి చేసిన సెకండ్ హ్యాండ్ దుస్తులు కూడా ఇలాంటి మార్కెట్లలో విక్రయిస్తారు. దీంతో ఒకే దుస్తులను పలుమార్లు ఉపయోగించే అవకాశం ఏర్పడుతుంది.
35
పాడైన బట్టలతో కొత్త ఉత్పత్తులు
ధరించడానికి పనికిరాని పాత బట్టలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వాటి నుంచి నార (ఫైబర్)ను వేరు చేస్తారు. ఆ ఫైబర్‌తో కొత్త దారాన్ని తయారు చేసి అనేక వస్తువులు తయారు చేస్తారు. వాటిలో ముఖ్యంగా కార్పెట్లు, తుడిచే గుడ్డలు (మాప్‌లు), దుప్పట్లు, కుషన్‌లు, పరుపుల నింపే పదార్థం, ప్యాకేజింగ్ మెటీరియల్, ఫర్నిచర్ తయారీకి అవసరమైన పదార్థాలు, వాహనాల సీట్లలో ఉపయోగించే ఫిల్లింగ్ మెటీరియల్, పరిశ్రమల్లో ఉపయోగించే ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేస్తారు. పత్తి, ఉన్ని వంటి సహజ నారతో తయారైన బట్టలను సులభంగా రీసైక్లింగ్ చేయవచ్చు. పాలిస్టర్ వంటి మిశ్రమ వస్త్రాలకు ప్రత్యేక సాంకేతిక ప్రక్రియను ఉపయోగిస్తారు.
ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా కోట్ల టన్నుల వస్త్రాలు చెత్తగా మారుతున్నాయి. దీంతో పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది. పాత బట్టలను మళ్లీ ఉపయోగించడం, రీసైక్లింగ్ చేయడం వల్ల కొత్త బట్టల తయారీకి అవసరమైన నీరు, విద్యుత్, సహజ వనరుల వినియోగం తగ్గుతుంది. అలాగే కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వస్త్ర రీసైక్లింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.
55
లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం
పాత బట్టల సేకరణ కేవలం చిన్న వ్యాపారం మాత్రమే కాదు. ఇది లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న పెద్ద పరిశ్రమగా మారింది. ఇంటి ఇంటికి వెళ్లి బట్టలు సేకరించే వారు, వాటిని వర్గీకరించే కార్మికులు, సెకండ్ హ్యాండ్ మార్కెట్ వ్యాపారులు, రీసైక్లింగ్ ఫ్యాక్టరీలు, కార్పెట్ తయారీ సంస్థలు, ఇతర పరిశ్రమలు ఈ వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్నాయి. అందుకే మీరు పాత్రలకు బదులుగా ఇచ్చే పాత బట్టలు చెత్తలో పడిపోవు. వాటిలో చాలా వరకు మళ్లీ ఉపయోగంలోకి వస్తాయి లేదా కొత్త ఉత్పత్తులుగా మారి మరోసారి మన జీవితాల్లో భాగమవుతాయి.