Online shopping New Rules: ఆన్‌లైన్ షాపింగ్ కొత్త రూల్స్.. ఈ 7 చెక్స్ తప్పనిసరి

Published : Sep 24, 2026, 02:41 PM IST

Online shopping New Rules: ఆన్‌లైన్ షాపింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల భద్రత కోసం కొత్త ఈ కామర్స్ రూల్స్ 2026 తీసుకొచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
18
ఆన్‌లైన్ షాపింగ్: కస్టమర్లకు బంపర్ గుడ్ న్యూస్

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఒక్క క్లిక్‌తో కావాల్సిన వస్తువు ఇంటికి వచ్చేస్తోంది. బట్టల దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే ప్రతీ చిన్న వస్తువు వరకు అంతా ఆన్‌లైన్ షాపింగే. అయితే ఈ హడావుడిలో మనం ఒక విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఆన్‌లైన్‌లో ఏ వస్తువు కొన్నా మన పేరు, ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్, లాగిన్ ఐడీలు, చివరకు బ్యాంక్ డీటైల్స్ వరకు ప్రతీదీ డిజిటల్ రూపంలో స్టోర్ అయిపోతాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలను అరికట్టడానికి, కస్టమర్లకు మెరుగైన భద్రత అందించడానికి కేంద్ర ప్రభుత్వం "కన్స్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్, 2026"ను రూపకల్పన చేసింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 2027 నుంచి అమలులోకి రానున్నాయి.

ధరల నిర్ధారణ, సెల్లర్ల వివరాలు, సెర్చ్ రిజల్ట్స్, ప్రకటనలు, డార్క్ ప్యాటర్న్స్, కస్టమర్ డేటా భద్రత, ఫిర్యాదుల పరిష్కారం వంటి విషయాల్లో ఈ రూల్స్ ఎంతో పారదర్శకతను తీసుకొస్తాయి. అయితే, నిబంధనలు ఎంతున్నా సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు పూర్తిగా తగ్గిపోవు. అందుకే ఆన్‌లైన్‌లో బై నౌ బటన్ నొక్కే ముందు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన 7 ముఖ్యమైన నిబంధనలను ఇక్కడ తెలుసుకుందాం.

28
అస్సలు బ్లైండ్‌గా నమ్మకండి.. సెల్లర్ ఎవరు అనేది ముఖ్యం

కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ తన వెబ్‌సైట్‌లో సెల్లర్ పూర్తి వివరాలను స్పష్టంగా చూపించాలి. అందులో వారి బిజినెస్ డీటైల్స్, అడ్రస్, కస్టమర్ కేర్ నంబర్, ప్రొడక్ట్ రేటింగ్స్ తప్పనిసరిగా ఉండాలి. కేవలం కలర్‌ఫుల్ ఫోటోలు లేదా ప్రొడక్ట్ రివ్యూలు చూసి కళ్లమూసుకుని ఆర్డర్ పెట్టేయకండి. ముఖ్యంగా కాస్ట్లీ గ్యాడ్జెట్లు, బ్రాండెడ్ వస్తువులు కొనేటప్పుడు సెల్లర్ వివరాలను పక్కాగా చెక్ చేసుకోండి. ప్రొడక్ట్ పేజీ చూడటానికి నిజమైన దానిలా కనిపిస్తున్నంత మాత్రాన, ఆ సెల్లర్ అసలైనవాడే అని గ్యారెంటీ లేదు.

38
పేమెంట్ పేజీ తెరిచాకా జాగ్రత్త.. ఆ రీడైరెక్ట్స్ నమ్మొద్దు

మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ డీటైల్స్ లేదా యూపీఐ పిన్ నంబర్ ఎంటర్ చేసే ముందు మీరు సరియైన పేమెంట్ పేజీలోనే ఉన్నారా లేదా అనేది చెక్ చేయండి. మీరు ఉపయోగిస్తున్న షాపింగ్ ప్లాట్‌ఫామ్ లేదా అధికారికంగా అనుమతి పొందిన పేమెంట్ గేట్‌వేకి మాత్రమే ఆ పేజీ చెంది ఉండాలి. పేమెంట్ చేసేటప్పుడు సడన్‌గా వేరే ఏదైనా కొత్త వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అయితే వెంటనే ట్రాన్సాక్షన్ ఆపేయండి. అంతేకాకుండా, మీ ఓటీపీ, యూపీఐ పిన్, కార్డ్ పిన్ లేదా పాస్‌వర్డ్‌లను సెల్లర్‌తో కానీ లేదా సపోర్ట్ టీమ్ అని చెప్పే ఎవరితోనూ షేర్ చేయకూడదు.

48
గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో వచ్చింది కదా అని గుడ్డిగా కొనకండి

సెర్చ్ రిజల్ట్స్‌ను మానిప్యులేట్ చేసి కస్టమర్లను పక్కదోవ పట్టించకుండా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ కొత్త రూల్స్ కఠిన ఆంక్షలు విధించాయి. సెర్చ్ ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలను ప్లాట్‌ఫామ్‌లు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అయితే కస్టమర్లు కూడా సొంతంగా చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రొడక్ట్ ఫీచర్లు, సెల్లర్ రివ్యూలు స్వయంగా పరిశీలించాలి. ఒకవేళ ఏ సెల్లర్ అయినా ప్లాట్‌ఫామ్ బయటకు వచ్చి వేరే మార్గంలో డబ్బులు పంపమని అడిగితే, దాన్ని ఒక డేంజర్ సిగ్నల్‌గా భావించి వెంటనే ఆ డీల్ నుంచి బయటకు వచ్చేయండి.

58
ఆ ప్రొడక్ట్ యాడ్ ఏమో గమనించారా? స్పన్సర్‌షిప్ డీటైల్స్ చూడండి

అమెండెడ్ నిబంధనల ప్రకారం స్పాన్సర్డ్ లిస్టింగ్‌లను అంటే యాడ్స్‌ను స్పష్టంగా ప్రదర్శించాలి. షాపింగ్ సెర్చ్‌లో ఒక ప్రొడక్ట్ అందరికంటే పైన కనిపించినంత మాత్రాన అది బెస్ట్ ప్రొడక్ట్ అని అనుకోకూడదు. స్పాన్సర్డ్ ప్రొడక్ట్ అనేది కేవలం ఒక ప్రకటన మాత్రమే. అది ఆ ప్రొడక్ట్ లేదా సెల్లర్ నమ్మకమైనవాడు అనడానికి గ్యారెంటీ కాదు. కాబట్టి ప్రొడక్ట్ పక్కన 'Sponsored' అని ఉందో లేదో చూసి, సెల్లర్ వివరాలు చెక్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.

68
డార్క్ ప్యాటర్న్స్ ఉచ్చులో పడకండి.. సడన్ పాప్‌అప్‌లతో అలర్ట్

కస్టమర్లకు తెలియకుండానే వారి చేత అదనపు ఛార్జీలు చెల్లించేలా చేయడం, నచ్చని సర్వీసులను ప్యాక్ చేయడం వంటి మోసపూరిత పద్ధతులను 'డార్క్ ప్యాటర్న్స్' అంటారు. 2023లో తెచ్చిన డార్క్ ప్యాటర్న్స్ నియంత్రణ మార్గదర్శకాలను ఈ-కామర్స్ సంస్థలు కచ్చితంగా పాటించాలని కొత్త రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ఏటా ఈ విషయంలో సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోవడంతో పాటు కాంప్లైయెన్స్ సర్టిఫికెట్‌ను కూడా ప్రదర్శించాలి. సైబర్ భద్రత పరంగా చూస్తే.. "పేమెంట్ ఫెయిల్ అయింది, మళ్లీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి" అంటూ అకస్మాత్తుగా వచ్చే పాప్‌అప్‌లు, సందేహాస్పద రీడైరెక్ట్‌ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

78
మీ డేటా ఏం అడుగుతున్నారు? అనవసర వివరాలు ఇవ్వొద్దు

ఆన్‌లైన్ షాపింగ్‌కి కొన్ని ప్రాథమిక వివరాలు అవసరమే. కానీ, రిజిస్ట్రేషన్ లేదా చెకౌట్ సమయంలో అడిగే ప్రతి సమాచారం ఆ కొనుగోలుకి అవసరం లేకపోవచ్చు. 2026 సవరణల ప్రకారం, కస్టమర్ల డేటాను వాడుకునే ముందు వారి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఖాతా తెరిచేటప్పుడు ఎలాంటి సమాచారం అడుగుతున్నారో పరిశీలించి, అనవసరమైన వ్యక్తిగత వివరాలను ఇవ్వకండి. అలాగే ప్రతీ షాపింగ్ సైట్‌కి వేర్వేరుగా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం మంచిది.

88
ప్రతీ లావాదేవీ డిజిటల్ రికార్డ్ మీ దగ్గర ఉంచుకోండి

పేమెంట్ పూర్తయినంత మాత్రాన పని అయిపోలేదు. ప్రొడక్ట్ ఇన్వాయిస్, ఆర్డర్ కన్ఫర్మేషన్, పేమెంట్ రసీదు, సెల్లర్‌తో జరిగిన సంభాషణలను భద్రపరుచుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా వివాదం తలెత్తితే ఇవి ఆధారాలుగా ఉపయోగపడతాయి. కొత్త రూల్స్ ప్రకారం ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. గ్రీవెన్స్ ఆఫీసర్లు కస్టమర్ ఫిర్యాదు అందిన 48 గంటల్లోగా స్పందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందించే 'నేషనల్ కస్టమర్ హెల్ప్‌లైన్' నెట్‌వర్క్‌లో కూడా ఈ-కామర్స్ కంపెనీలు భాగమవుతున్నాయి. కాగా, 2025లో నేషనల్ కస్టమర్ హెల్ప్‌లైన్‌కు మొత్తం 17,71,622 ఫిర్యాదులు రాగా, అందులో దాదాపు 29 శాతం కేవలం ఈ-కామర్స్ రంగం నుంచే రావడం గమనార్హం.

మొత్తానికి, ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త నిబంధనలు డిజిటల్ షాపింగ్‌ను సురక్షితంగా మారుస్తున్నప్పటికీ, వినియోగదారుల సొంత జాగ్రత్తలను ఏ రూల్స్ కూడా రీప్లేస్ చేయలేవు. ఒక వస్తువు కొనేముందు కేవలం కొద్ది సెకన్ల పాటు సెల్లర్, పేమెంట్ యుఆర్ఎల్, యాడ్స్, రీడైరెక్ట్‌లను చెక్ చేయడం వల్ల మీ కష్టార్జితం సైబర్ నేరగాళ్లపాలు కాకుండా కాపాడుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories