ఇలా చేస్తే మీ మొబైల్ బ్యాటరీ సూపర్‌గా పనిచేస్తుంది

First Published | Nov 2, 2024, 5:48 PM IST

మనలో చాలా మంది సెల్ ఫోన్ వాడినంత సేపు ఛార్జింగ్ ఎంత ఉందో కూడా చూసుకోకుండా మర్చిపోతుంటాం కదా.. అయితే ఈ టిప్స్ పాటిస్తే ఛార్జింగ్ ఎక్కువ కాలం వస్తుంది. ఛార్జర్, ఫోన్ ఎక్కువ కాలం పనిచేస్తాయి.  ఫోన్ లో ఛార్జింగ్ ఎంత ఉన్నంత వరకు వాడొచ్చు? ఏ సమయంలో ఛార్జింగ్ పెడితే ఎక్కువ సేపు వస్తుంది. ఇలాంటి మంచి టిప్స్ ఇక్కడ ఉన్నాయి. 

ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. చాలా పనులు ఇట్టే అయిపోతున్నాయి. అయితే మొబైల్ నిరంతరం వాడేయడమే కాదు.. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యం.

యూత్ అంతా గేమ్స్, సినిమాలు చూస్తూ ఫోన్‌లను ఎక్కువగా వాడుతున్నారు. పెద్దవాళ్ళు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నారు. అందుకే తరచుగా ఛార్జింగ్ అయిపోతుంటుంది. మనలో చాలా మంది ఛార్జింగ్ అయిపోతున్న విషయం కూడా పట్టించుకోకుండా ఫోన్ వాడేస్తూ ఉంటారు. స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు. 

స్మార్ట్‌ఫోన్‌లను సరిగ్గా వాడితే రెండేళ్ళు వాడొచ్చు. లేదంటే ఆరే నెలల్లోనే పాడైపోతాయి. ఛార్జింగ్ విషయంలో, యాప్ లు వినియోగించే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫోన్ వేడెక్కుతుంది. అలా వేడిక్కినప్పుడు కొన్ని సార్లు ఫోన్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. బ్యాటరీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

ఫోన్ బాగా పనిచేయాలంటే బ్యాటరీ చాలా ముఖ్యం. ఫోన్ కొనే ముందే బ్యాటరీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. బ్యాటరీ క్వాలిటీ, ఛార్జింగ్ వేగం తెలుసుకుని కొనాలి. ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఏమేం విషయాలు తెలుసుకోవాలో ఇక్కడ చూడండి.


ఛార్జ్ చేసేటప్పుడు ఇవి చూసుకోండి..

మనలో చాలా మందికి ఎంత శాతం ఛార్జ్ చేయాలో తెలియదు. చాలామంది 100% వరకు చార్జ్ చేయాలనుకుంటారు. కొందరు 1% వచ్చే వరకు వాడి, తర్వాత చార్జ్ చేస్తారు. ఈ రెండు విషయాలు సరికాదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. 

చాలామంది బ్యాటరీ పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే ఛార్జింగ్ పెడుతుంటారు. ఇలా చేస్తే బ్యాటరీ పాడవుతుంది. బ్యాటరీ బాగుండాలంటే 20% ఛార్జ్ ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.  అదే విధంగా 100% వరకు కాకుండా 80-90% వరకే ఛార్జ్ చేయాలట. ఇలా చేస్తే బ్యాటరీ త్వరగా పాడవదు. అదేవిధంగా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి వదిలేయడం చాలా ప్రమాదకరం. ఇది చాలామంది చేసే తప్పు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తారు. 100 శాతం పూర్తయినా తీయడం మర్చిపోతారు. 

మరికొంతమంది రాత్రి పడుకొనే ముందు ఛార్జింగ్ పెట్టి రాత్రంతా అలాగే వదిలేస్తారు. దీని వల్ల బ్యాటరీ వేడెక్కడం జరుగుతుంది. తరచూ ఇదే చేస్తే బ్యాటరీ పాడైపోతుంది. కొన్ని సందర్బాల్లో షార్ట్ సర్కూట్ అయి పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది.  

ఛార్జింగ్ స్పీడ్ గా ఎక్కడానికి ఫాస్ట్ ఛార్జర్లు వాడుతుంటారు. ఇది అన్ని వేళలా మంచిది కాదు. ఫాస్ట్ ఛార్జర్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల బ్యాటరీ పాడవుతుంది. అవసరమైనపుడు మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించాలి.

ఛార్జింగ్ చేస్తూ ఫోన్ వాడటం వల్ల కూడా ఫోన్ వేడి ఎక్కువ అవుతుంది. అలాగే ఛార్జింగ్ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ఫోన్ ఛార్జింగ్ సమయంలో వినియోగం మానేయడం మంచిది.

వేగంగా ఛార్జ్ కావాలంటే ఎయిర్‌ప్లేన్ మోడ్ లో పెట్టడం లేదా ఫోన్ ఆఫ్ చేయడం మంచిది. ఈ విధంగా బ్యాటరీ ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది.
 

Latest Videos

click me!