ఎయిర్ ఇండియాను ఎందుకు విక్రయించాల్సి వచ్చింది.. హోమ్‌కమింగ్ అని ఎందుకు పిలుస్తారు?

First Published Oct 8, 2021, 8:33 PM IST

గత కొన్ని సంవత్సరాలుగా ఎయిరిండియాను విక్రయించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఎట్టకేలకు నేడు పూర్తయింది. ఎయిర్ ఇండియా ఈ రోజు టాటా సన్స్ చేతుల్లోకి వచ్చింది. అయితే ఇందుకు టాటా సన్స్ ఈ విమానయాన సంస్థను దక్కించుకునేందుకు అత్యధికంగా బిడ్డింగ్ చేసినట్లు ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డిఐపిఎఎమ్) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే తెలిపారు. 

 సమాచారం ప్రకారం టాటా సన్స్ రూ .18,000 కోట్లకు  బిడ్ వేసింది, స్పైస్ జెట్ అజయ్ సింగ్ రూ.15,000 కోట్లకు బిడ్ చేశారు. దీనితో ఎయిర్ ఇండియా 68 సంవత్సరాల తర్వాత తిరిగి సొంత గూటికి  చేరింది.  

ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజం (AISAM) ప్యానెల్ ఎయిర్ ఇండియా ఆర్థిక బిడ్‌పై నిర్ణయం తీసుకుంది. ఈ ప్యానెల్‌లో హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,  ఇతర  మంత్రులు, అధికారులు ఉన్నారు. 

airindia

ప్రభుత్వం ఎయిర్ ఇండియాను ఎందుకు విక్రయించాలనుకుంది ?
ప్రస్తుతం ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో నడుస్తోంది. 2018-19లో కంపెనీ రూ .4,424 కోట్ల నిర్వహణ నష్టాన్ని చూడగా,  2017-18లో కంపెనీ రూ .1245 కోట్ల నిర్వహణ నష్టాన్ని చవిచూసింది. ఇలాంటి పరిస్థితిలో నిరంతర నష్టాల కారణంగా కంపెనీ భారీగా అప్పుల పాలైంది. ఈ కారణంగా దినిని విక్రయించాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతకు ముందు కూడా ప్రభుత్వం దీనిని విక్రయించడానికి ప్రయత్నించింది.

ఎయిర్ ఇండియాని హోమ్‌కమింగ్ అని ఎందుకు పిలుస్తారు?
ఈ ఎయిర్‌లైన్‌  68 సంవత్సరాల తర్వాత  మళ్ళీ సొంత గూటికి  చేరింది. టాటా గ్రూప్ 1932 అక్టోబర్‌లో టాటా ఎయిర్‌లైన్స్ పేరుతో ఎయిర్ ఇండియాను ప్రారంభించింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి విమానయాన సంస్థ అవసరం ఏర్పడింది. దీంతో భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీని తరువాత 1953 లో భారత ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని ఆమోదించింది.  తరువాత కంపెనీలో మెజారిటీ వాటాను టాటా గ్రూప్ నుండి కొనుగోలు చేసింది. చివరికి దీనిని ప్రభుత్వ రంగ సంస్థగా మార్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్ ఇండియా 68 సంవత్సరాల తర్వాత మళ్ళీ టాటా గ్రూప్‌ చేతికి తిరిగి వచ్చింది.

ఉద్యోగుల పరిస్థితి ఏంటి ?
ఆగస్టు 2021 నాటికి ఎయిర్ ఇండియాలో 16,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 9617 మంది శాశ్వత ఉద్యోగులు, వీరు గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలను పొందుతారు. ఎయిర్ ఇండియా విక్రయంతో ఎయిర్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీ మొదలైన బాధ్యతలు కూడా టాటా సన్స్‌కు బదిలీ చేయబడుతుంది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత ఉద్యోగుల పిఎఫ్‌లో డిపాజిట్ చేసిన మొత్తం ప్రైవేట్ కంపెనీ ట్రస్ట్‌కి వెళుతుందని, దీనివల్ల తమకు నష్టాన్ని కలిగిస్తుందని ఎయిర్ ఇండియా సిబ్బంది ఆందోళన చెందారు. అయితే ప్రస్తుతం ఉన్న ఎయిర్ ఇండియా సిబ్బందికి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసే ప్రక్రియ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మాదిరిగానే ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది.  

ఎయిర్ ఇండియాపై ఉన్న అప్పులు ఏమవుతాయి? 
2009-10 నుండి ప్రభుత్వం ఎయిర్ ఇండియాకు 1.10 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించిందని తుహిన్ కాంత్ పాండే చెప్పారు. ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ 100 శాతం వాటాకి టాటా సన్స్ 15 వేల కోట్ల రుణాన్ని భరిస్తుంది. దీని తరువాత కూడా ఎయిర్‌లైన్‌పై మొత్తం అప్పు రూ.42262 కోట్లు ఉంటుంది, దీనిని  ఏ‌ఐ‌ఏ‌హెచ్‌ఎల్ కి బదిలీ చేయబడుతుంది.

ఒప్పందంలో ఇంకా ఏం చేర్చబడింది ?
ఒప్పందం ప్రకారం ముంబైలోని ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయం, ఢిల్లీలోని ఎయిర్‌లైన్స్ హౌస్ కూడా చేర్చబడింది. ముంబై కార్యాలయం మార్కెట్ విలువ రూ .1500 కోట్లకు పైగా ఉంటుంది. ఈ డీల్‌లో ప్రభుత్వానికి రూ .2,700 కోట్ల నగదు లభిస్తుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకి 4,400 దేశీయ విమానాలు, విదేశాలలో 1800 ల్యాండింగ్ అండ్ పార్కింగ్ స్లాట్‌లను నియంత్రిస్తుంది. 

ఎయిర్ ఇండియాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి?
31 మార్చి 2020 నాటికి ఎయిర్ ఇండియా  మొత్తం స్థిర ఆస్తులు దాదాపు రూ .45,863.27 కోట్లు. ఇందులో ఎయిర్ ఇండియా ల్యాండ్, బిల్డింగ్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లీట్, ఇంజిన్‌లు ఉన్నాయి.
 

click me!