KCC: 4 శాతం వ‌డ్డీకే రుణం.. ఎవ‌రు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే.?

Published : Jul 20, 2025, 11:04 AM IST

ప్ర‌స్తుతం ర‌క‌ర‌కాల ఆర్థిక సంస్థ‌లు రుణాలు అందిస్తున్నాయి. అయితే వీటిలో వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే కేవ‌లం 4 శాతం వ‌డ్డీకే రుణం పొందే అవ‌కాశం ఉంద‌ని మీకు తెలుసా.? ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
రైతుల కోసం

రైతుల అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం (KCC) తీసుకొచ్చింది. ఈ ప‌థ‌కం ద్వారా రైతులు రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాన్ని పొందొచ్చు. ఈ రుణం వార్షికంగా కేవలం 4 శాతం వడ్డీతో లభిస్తుంది. ఇందులో ప్రభుత్వం 2 శాతం వడ్డీ మాఫీతో పాటు, సమయానికి రుణం తిరిగి చెల్లిస్తే 3 శాతం ప్రోత్సాహక బోనస్‌ను అందిస్తోంది. 

ఫలితంగా రైతులు గరిష్టంగా 4 శాతం వడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ వడ్డీ రేటుతో లభించే వ్యవసాయ రుణంగా చెప్పొచ్చు.

25
KCC అంటే ఏంటి? రైతులకు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది.?

కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని 1998లో ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం రైతులకు వ్యవసాయ పనులు, పశుపోషణ, తదితర వ్యవసాయ సంబంధిత అవసరాలకు తక్కువ వడ్డీ రుణాన్ని అందించడం. ఈ కార్డుతో రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు వంటి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. 

వ‌డ్డీ వ్యాపారుల జోలికి వెళ్ల‌కుండా రైతులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేర్చేలా ఇది పనిచేస్తోంది. ఇది డెబిట్ కార్డులా పనిచేస్తూ ATMల నుంచి నగదు విత్‌డ్రా చేయగలిగే సౌలభ్యం కూడా కల్పిస్తుంది. ప్రస్తుతం దేశంలో 7.75 కోట్లకు పైగా యాక్టివ్ KCC ఖాతాలున్నాయి.

35
ఎంతవరకు రుణం పొందవచ్చు? అర్హతలేంటి?

రుణ పరిమితి రైతు భూమి విస్తీర్ణం, పంట ఖర్చు, బీమా, యంత్రాల నిర్వహణ ఖర్చులపై ఆధారపడి నిర్ణ‌యిస్తారు. . ప్రతి ఏడాది ఈ పరిమితి 10 శాతం చొప్పున పెరుగుతూ ఐదేళ్లు కొనసాగుతుంది. ప్రస్తుతం కేంద్రం గరిష్ట రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. 

ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. రూ.2 లక్షల వరకు రైతులు రుణం తీసుకోవ‌డానికి భూమి లేదా వస్తువు పూచీకత్తుగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ మొత్తాన్ని మించితే పూచీకత్తు అవసరమవుతుంది. పంట అవసరాల కోసం, ట్రాక్టర్ లేదా నీటిపారుదల వ్యవస్థల వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రుణాన్ని తీసుకోవ‌చ్చు.

45
KCC కార్డ్ ఎలా ఉపయోగించవచ్చు?

ఈ కార్డ్ డిజిటల్ డెబిట్ కార్డు లాగా పని చేస్తుంది. రైతులు దీనివల్ల ATM, బ్యాంక్ మిత్ర కేంద్రాలు, మొబైల్ యాప్స్ లేదా రైతు భరోసా కేంద్రాల వద్ద పీఓఎస్‌ యంత్రాల ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా నేరుగా కొనుగోళ్లు చేయవచ్చు. ఆధార్, బయోమెట్రిక్ ఆధారంగా కార్డు లింక్ చేయడం వల్ల లావాదేవీలు సురక్షితంగా, వేగంగా జరుగుతాయి. రైతులు కస్టమర్ ID ఆధారంగా బ్యాలెన్స్ చెక్ చేయగలగడం, టాప్‌అప్ చేయడం వంటి సౌకర్యాలు పొందవచ్చు.

55
మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు

KCC రుణం తీసుకునే రైతులకు.. ప్రీమియం తక్కువగా ఉన్న పంట బీమా, అర్హత ఉన్న ఇతర పథకాలతో లింకింగ్ చేసే అవకాశం కూడా ఉంది. వృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యవస్థలో ఈ కార్డ్ రైతులను ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ వైపు తీసుకెళ్తోంది. మరిన్ని బ్యాంకులు, NBFCలతో భాగస్వామ్యంతో ఈ పథకాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్డ్ ఉండటం వల్ల రైతులు అత్యవసర సమయంలోనూ సులభంగా ఆర్థిక సాయాన్ని పొందగలుగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories