ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ లూనాను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ మోపెడ్‌కు అప్డేటెడ్ వెర్షన్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ లేటెస్ట్ మోపెడ్ వెర్షన్‌కు సంబంధించి కంపెనీ డిజైన్ పేటెంట్‌ను రిజిస్టర్ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరుకుల రవాణా కోసం స్కూటీలను ఉపయోగించే వారికి ఇది బాగా ఉపయోగపడనుంది.
కొత్త కైనెటిక్ ఈ లూనా డిజైన్ పేటెంట్ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్‌తో రానుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ లూనాలో స్క్వేర్ హెడ్‌ల్యాంప్, చిన్న ట్యాబ్ లాంటి ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను అందించనున్నారు. ఎక్స్‌ఎల్ బండ్లను పోలిన విధంగా కాళ్ల ముందు ఖాళీ స్థలాన్ని అందించనున్నారు. ఈ కంపెనీ నుంచి ఇది వరకు వచ్చిన లూనాతో పోల్చితే తాజా డిజైన్‌లో ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా రైడర్ సీటు, హ్యాండిల్‌బార్ మధ్యలో ఉన్న కొత్త స్టోరేజ్ బాక్స్. ఈ బాక్స్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది లేదా అదనపు బ్యాటరీ ప్యాక్‌ను అమర్చేందుకు ఉపయోగపడవచ్చు. ఇది ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ ఓవరాల్ రైడింగ్ రేంజ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ లూనాలో 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీలు నాన్ స్టాప్ దూసుకెళ్తుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న లూనాలో టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్లుగా ఉంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేసేందుకు దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అయితే త్వరలోనే మార్కెట్లోకి రానున్న కొత్త మోడల్‌లో తీసుకొస్తున్న అదనపు బ్యాటరీ ద్వారా రేంజ్ భారీగా పెరగనుందని తెలుస్తోంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 200 కిలోమీటర్లు వెళ్తుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ కొత్త ఇ-లూనాలో బ్యాటరీ ఎలా ఇస్తారన్నదానిపై క్లారిటీ లేదు. ఫిక్డ్స్ బ్యాటరీ ఉంటుందా.? లేదా డిటాచబుల్ బ్యాటరీని ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ కొత్త లూనా లాంచ్‌కి సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే కచ్చితంగా ఈ ఏడాది చివరి లోపు ఈ ఈవీ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.