Trainలో స్లీపర్ క్లాస్ టిక్కెట్ తీసుకొని AC కోచ్‌లో ప్రయాణం చేయొచ్చని తెలుసా?

First Published | Oct 31, 2024, 1:06 PM IST

ట్రైన్ లో టిక్కెట్ దొరకడమే కష్టం కదా.. అలాంటిది స్లీపర్ క్లాస్ టిక్కెట్ తో ఏసీ కంపార్ట్ మెంట్ లో ప్రయాణం చేయొచ్చని మీకు తెలుసా? IRCTC కొత్తగా ఈ ఆప్షన్ తీసుకొచ్చింది. దీన్ని ఆటో టిక్కెట్ అప్‌గ్రేడ్ అంటారు. దీన్ని ఉపయోగించుకుంటే మీ ప్రయాణం హ్యాపీగా, హాయిగా సాగుతుంది. ఈ సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి. 

ట్రైన్ లో ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకుంటాం కదా.. రిజర్వేషన్ దొరకకపోతే జనరల్ టిక్కెట్ తీసుకొని స్లీపర్ క్లాస్ ఎక్కి టీసీని బెర్త్ లు ఖాళీగా ఉన్నాయో లేదో అడుగుతాం. టీసీ చెక్ చేసి ఖాళీలు ఉంటే బెర్త్ ఇస్తారు. లేదా ఫైన్ వేస్తారు. నెక్ట్స్ స్టేషన్ లో దింపేస్తారు. 

అయితే మీరు స్లీపర్ టిక్కెట్ బుక్ చేసుకున్నా కావాలనుకుంటే థర్డ్ ACలో బెర్త్ తీసుకొని ప్రయాణించొచ్చు. అలాగే థర్డ్ ACకి టిక్కెట్ బుక్ చేసుకున్నా మీకు కావాలంటే సెకండ్ ACలో ప్రయాణించొచ్చు. ఇలా ప్రయాణ సదుపాయాలు మార్చుకోవడానికి IRCTC అవకాశం కల్పిస్తోంది. భారతీయ రైల్వే ఇస్తున్న ఈ ఆఫర్‌తో ప్రయాణికులు చాలా సంతోషిస్తున్నారు. మరో మంచి విషయం ఏమిటంటే స్లీపర్ బుకింగ్ ధరకే మీరు థర్డ్ ACలో ప్రయాణం చేయొచ్చు. 

స్లీపర్ బుకింగ్‌తో థర్డ్ AC ప్రయాణం

స్లీపర్ క్లాస్ టిక్కెట్స్ తీసుకొని ఏసీ బోగీలో ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఆటో టిక్కెట్ అప్‌గ్రేడ్ అంటారు. ఈ సర్వీస్ ను మీరు పొందాలంటే టిక్కెట్ బుక్ చేసుకొనేటప్పుడే ఆ ఆప్షన్ ఉపయోగించుకోవాలి. 

భారతీయ రైల్వే ఆటో అప్‌గ్రేడ్ (IRCTC Auto Upgrade) పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. ఇది రైలులో ఏ సీటు ఖాళీగా లేకుండా చూస్తుంది. నిజానికి చాలా రైళ్లలో AC కోచ్‌ల వంటి అప్పర్ క్లాస్ బోగీలలో బెర్త్‌లు తరచుగా ఖాళీగా ఉంటాయి. దీనివల్ల రైల్వే శాఖకి చాలా నష్టం వస్తోంది.

Latest Videos


ఈ నష్టాన్ని నివారించడానికి అప్పర్ క్లాస్ బోగీల వసతులను ప్రయాణికులకు తెలియజేయడానికి రైల్వే ఈ ఆటో అప్‌గ్రేడ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. దిగువ క్లాస్‌లోని ప్రయాణికుడిని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా అప్పర్ క్లాస్‌లో బెర్త్ లు ఖాళీ లేకుండా చేస్తారు. రైల్వే ఈ ఆటో అప్‌గ్రేడ్ పథకం కింద అప్పర్ క్లాస్‌లో ఏదైనా బెర్త్ ఖాళీగా ఉంటే దిగువ క్లాస్ ప్రయాణికులను అప్‌గ్రేడ్ చేసి ఆ క్లాస్‌లో బెర్త్ ఇస్తారు.

ఉదాహరణకు ఒక రైలులో AC ఫస్ట్‌ కోచ్ లో నాలుగు సీట్లు ఖాళీగా ఉంటే సెకండ్ AC ప్రయాణికుల టికెట్లను అప్‌గ్రేడ్ చేసి ఫస్ట్ ACలోకి  పంపుతారు. అలాగే సెకండ్ ACలో సీట్లు ఖాళీగా ఉంటే థర్డ్ AC ప్రయాణికులను అప్‌గ్రేడ్ చేసి సెకండ్ ACలో సీట్లు ఇస్తారు.

అలాగే థర్డ్ ACలో ఖాళీగా ఉన్న కొన్ని సీట్లు వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు దొరుకుతాయి. ఇంకా ఎక్కువ సీట్లు ఖాళీగా ఉంటే స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు థర్డ్ ACలో బెర్త్‌లు ఇస్తారు.

దీనివల్ల రైలులో ఏ రిజర్వేషన్ బోగీలోనూ ఏ బెర్త్ ఖాళీగా ఉండదు. రైల్వే నష్టం తగ్గడమే కాకుండా ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ వసతి పొందడానికి ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆప్షన్ ఎంచుకోవాలి.   

IRCTC వెబ్‌సైట్‌లో టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడు Auto Upgrade అనే ఆప్షన్‌ని ఎన్నుకోమని మెసేజ్ వస్తుంది. ఇందులో yes లేదా no అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి. మీరు కనుక yes ఆప్షన్ ఎంచుకుంటే స్లీపర్ కోచ్‌లో బుక్ చేసుకున్న ప్రయాణికులకు AC కోచ్‌లో టికెట్ దొరుకుతుంది. 

ఆటో అప్‌గ్రేడ్ సౌకర్యాన్ని మీరు పొందినప్పుడు మీకు కనుక బోగీ క్లాస్ మారినప్పటికీ PNRలో ఎలాంటి మార్పు ఉండదని గుర్తుంచుకోండి. అంటే టిక్కెట్ కి సంబంధించిన ఏ సమాచారం తెలుసుకోవడానికి అదే PNRని ఉపయోగించాలి. ఇది కాకుండా అప్‌గ్రేడ్ తర్వాత టికెట్ రద్దు చేస్తే అప్‌గ్రేడ్ అయిన క్లాస్‌కి కాకుండా IRCTC రూల్స్ ప్రకారం పాత ఛార్జీ మాత్రమే తిరిగి ఇస్తారు. అందువల్ల అదనపు ఖర్చు లేకుండా ఏసీ బోగీల్లో ప్రయాణించే అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. 

click me!