
రైల్వేల్లో RAC టికెట్ తీసుకున్న ప్రయాణికులు పూర్తి టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. కానీ వారికి ప్రత్యేకంగా ఒక బెర్త్ కేటాయించరు. ఇద్దరు ప్రయాణికులకు ఒకే సైడ్ లోయర్ బెర్త్‌ను కేటాయిస్తారు. పగటిపూట ఇద్దరూ కూర్చునేలా సీటుగా ఉపయోగించుకోవాలి. రాత్రి సమయంలో అదే బెర్త్‌పై ఇద్దరూ సర్దుకుని నిద్రపోవాల్సి ఉంటుంది.
పూర్తి ఛార్జీ చెల్లించినప్పటికీ ప్రత్యేకంగా పడుకునే సౌకర్యం లభించకపోవడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా ఒకే బెర్త్‌పై మహిళ, పురుష ప్రయాణికులకు కేటాయింపు జరిగినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ బెర్త్ కేటాయించడం టికెట్ తనిఖీ చేసే సిబ్బందికి (TTE) కూడా కష్టంగా మారుతోంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని RAC విధానాన్ని తొలగించే అంశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
RAC టికెట్ ఉన్న ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీ వసూలు చేయడంపై పార్లమెంటరీ కమిటీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రత్యేక బెర్త్ ఇవ్వకుండా ఇద్దరికి ఒకే బెర్త్‌ను కేటాయిస్తున్నప్పుడు పూర్తి టికెట్ ధర వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఈ విధానాన్ని మరోసారి సమీక్షించాలని రైల్వే శాఖకు సూచించింది. పూర్తి బెర్త్ సౌకర్యం పొందని ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీ వసూలు చేయాలా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులతో RAC విధానంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటే ప్రస్తుత విధానంలో మార్పులు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
RAC అంటే రిజర్వేషన్ అగెనెస్ట్ క్యాన్సలేషన్. తెలుగులో చెప్పాలంటే.. టికెట్ రద్దు అయితే బెర్త్ కేటాయింపు పొందే అవకాశం ఉన్న రిజర్వేషన్ విధానం. ఇది కన్ఫర్మ్ టికెట్, వెయిటింగ్ లిస్ట్ మధ్యలో ఉంటుంది. కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికి ప్రత్యేక బెర్త్ కేటాయిస్తారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి టికెట్ కన్ఫర్మ్ కాకపోతే రిజర్వేషన్ బోగీలో ప్రయాణించే అవకాశం సాధారణంగా ఉండదు. కానీ RAC టికెట్ ఉన్నవారు మాత్రం రిజర్వేషన్ బోగీలో ప్రయాణించవచ్చు.
ఈ విధానంలో ఇద్దరు ప్రయాణికులకు ఒకే సైడ్ లోయర్ బెర్త్ కేటాయిస్తారు. పగటిపూట దానిని సీటుగా ఉపయోగించుకుంటారు. రాత్రి ఇద్దరూ అదే బెర్త్‌ను పంచుకోవాల్సి ఉంటుంది. అయితే కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికుడు తన టికెట్‌ను రద్దు చేసుకుంటే ఖాళీ అయిన బెర్త్‌ను RAC ప్రయాణికుడికి కేటాయించే అవకాశం ఉంటుంది. దీంతో RAC టికెట్ కన్ఫర్మ్ బెర్త్‌గా మారుతుంది. అయితే ఇది టికెట్ల రద్దు, బెర్త్‌ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
గతంలో రైల్వే రిజర్వేషన్ల ప్రక్రియ ఎక్కువగా మాన్యువల్ పద్ధతిలోనే జరిగేది. ప్రయాణికులు చివరి నిమిషంలో టికెట్లు రద్దు చేసుకున్నప్పుడు ఖాళీ అయ్యే బెర్త్‌లను వెంటనే గుర్తించి ఇతరులకు కేటాయించడం అంత సులభంగా ఉండేది కాదు. అలాంటి సమయంలో ఖాళీగా ఉండిపోయే బెర్త్‌లను ఉపయోగించుకోవడంతో పాటు ఎక్కువ మంది ప్రయాణికులకు రైళ్లలో ప్రయాణించే అవకాశం కల్పించేందుకు RAC విధానాన్ని తీసుకొచ్చారు.
ఆ తర్వాత కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దీంతో టికెట్ రద్దులు, ఖాళీ బెర్త్‌ల వివరాలను సులభంగా గుర్తించి ఇతరులకు కేటాయించే అవకాశం ఏర్పడింది. అయినప్పటికీ అప్పటి నుంచి కొనసాగుతున్న RAC విధానం ఇప్పటికీ రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో భాగంగా ఉంది.
RAC విధానాన్ని రద్దు చేసే అంశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రయాణికులకు పూర్తి స్థాయిలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం, పూర్తి ఛార్జీ చెల్లించిన వారికి తగిన సౌకర్యాలు కల్పించడం ఈ చర్చలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఒకవేళ RAC విధానాన్ని రద్దు చేస్తే ప్రయాణికుల టికెట్ కేటాయింపు ప్రక్రియలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై రైల్వే శాఖ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఇది పరిశీలన దశలోనే ఉంది. కాబట్టి ఇకపై రైళ్లలో RAC టికెట్లు ఉండవని ఇప్పుడే నిర్ధారించలేం. రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రస్తుత రిజర్వేషన్ విధానమే కొనసాగుతుంది.