Indian railway
ప్రతీ రోజూ లక్షలాది మంది ప్రయాణించే ఇండియన్ రైల్వే ఆదాయం కూడా భారీగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రైల్వేలు ప్రయాణీకుల ద్వారా కంటే సరుకు రవాణా ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నాయి. టికెట్ల ద్వారా ఇండియన్ రైల్వేకు ఎంత ఆదాయం వస్తుందో ఎప్పుడడైనా ఆలోచించారా.? అలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
ఓ అంచనా ప్రకారం.. భారతీయ రైల్వేలలో ప్రతిరోజూ దాదాపు 2.5 కోట్ల మంది ప్రయాణిస్తారు. ఈ ప్రయాణీకుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, రైల్వేలు ప్రతిరోజూ వేలాది రైళ్లను నడుపుతున్నాయి. ఎప్పటికప్పుడు, రైల్వేలు తన నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేస్తాయి. ఇందులో ప్రీమియం రైళ్లను నడుపుతుంది. వందే భారత్ దీనికి అతిపెద్ద ఉదాహరణ. ఈ రైళ్ల ద్వారా రైల్వేలకు భారీ ఆదాయం వస్తుంది. 2021-22 సంవత్సరంలో విడుదలైన వాణిజ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, రైల్వేలు రోజుకు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఇందులో ఎక్కువ భాగం రైల్వే ప్రయాణీకుల టిక్కెట్ల నుంచి వస్తుంది. అయితే సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయం కూడా ఇందులో ఉంటుంది.
రైళ్లను నడిపించేందుకు ఇండియన్ రైల్వే ప్రతీ రోజూ లక్షల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఇందులో రైలు ఇంధనం, సిబ్బంది జీతం, నిర్వహణ, మౌలిక సదుపాయాలు వంటి ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చును భరించడానికి, రైల్వేలు ప్రయాణీకుల టిక్కెట్ల నుండి డబ్బు సంపాదిస్తాయి. సేవా ఛార్జీలు, మౌలిక సదుపాయాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు వంటి ఖర్చులన్నింటినీ ప్రయాణికుల టికెట్ల మీదనే వసూలు చేస్తారు.
టికెట్ ద్వారా వచ్చే ఆదాయం రైలు రకం, దూరంపై ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అంచనాల ప్రకారం, రైల్వేలు సాధారణ మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైలు నుండి ఒక్కొక్కరికి రూ.40 నుంచి రూ.50 సంపాదిస్తాయి. అదే సమయంలో, రాజధాని, శతాబ్ది లేదా వందే భారత్ వంటి ప్రీమియం రైలు వంటి వాటిలో లాభం పెరుగుతుంది. ఇలాంటి రైళ్లలో ప్రయాణించే వారి నుంచి ఇండియన్ రైల్వే ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ. 100 నుంచి రూ.500 వరకు సంపాదిస్తుంది.
ఇక భారతీయ రైల్వేకు వచ్చే భారీ ఆదాయంలో కొంత భాగం టికెట్ రద్దు ద్వారా కూడా వస్తుంది. నిజానికి, చాలా మంది రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న తర్వాత అనుకోని కారణాలతో తమ టిక్కెట్లను రద్దు చేసుకుంటారు. రైల్వే నిబంధనల ప్రకారం, RAC లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ రద్దు చేసుకుంటే, రీఫండ్ మొత్తంలో రూ.60 తగ్గిస్తారు. మరోవైపు, రైలు బయలుదేరే షెడ్యూల్‌కు 48 గంటల ముందు కన్ఫర్మ్ టికెట్ రద్దు చేసుకుంటే, ఫస్ట్ ఏసీలో రూ.240, సెకండ్ ఏసీలో రూ.200, థర్డ్ ఏసీలో రూ.180, స్లీపర్ క్లాస్‌లో రూ.120, సెకండ్ క్లాస్‌లో రూ.60 జరిమానా విధిస్తారు. ఇవన్నీ రైల్వే ఆదాయంగానే చెప్పొచ్చు.