
మన దేశంలో ఉద్యోగులు, యువత డబ్బు సంపాదించే విధానంలో, పెట్టుబడులు పెట్టే శైలిలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు నెలాఖరున వచ్చే జీతం మీద మాత్రమే ఆధారపడిన భారతీయులు.. ఇప్పుడు దానికి మించిన అదనపు ఆదాయ మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు.
స్టాక్ మార్కెట్ నష్టాలు వెల్లడించడం దగ్గర నుంచి ఫ్రీలాన్సింగ్, బిజినెస్ వరకూ రకరకాల ఆదాయ మార్గాలను ఐటీఆర్‌లలో స్పష్టంగా లెక్కిస్తున్నారు. క్లియర్ టాక్స్ విడుదల చేసిన 'హౌ ఇండియా ఫైల్డ్ ఇన్ 2026' అనే తాజా వార్షిక రిపోర్టులో భారతీయుల పన్ను చెల్లింపుల అలవాట్లకు సంబంధించి 5 ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
ఒకే ఉద్యోగం, ఒకటే జీతం అనే కాలం మారినట్లు పన్ను రిటర్నుల డేటా చెబుతోంది. అసెస్మెంట్ ఇయర్ 2026-27లో స్వయంగా ఐటీఆర్ ఫైల్ చేసిన వారిలో 47.3 శాతం మంది తమ ఉద్యోగం కాకుండా కనీసం మరొక అదనపు మార్గం ద్వారా ఆదాయం పొందుతున్నట్లు పేర్కొన్నారు. AY 2022-23లో ఇది కేవలం 9.5 శాతంగా మాత్రమే ఉండేది.
అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇతర మార్గాల ద్వారా సంపాదిస్తున్న పన్ను చెల్లింపుదారుల వాటా 3.5 శాతం నుంచి ఏకంగా 24.4 శాతానికి పెరిగింది. రెగ్యులర్ ఉద్యోగంతో పాటు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు, సైడ్ బిజినెస్ లేదా క్రిప్టోకరెన్సీ ద్వారా భారతీయులు అదనపు రాబడి పొందుతున్నారు.
25 ఏళ్ల లోపు వయసున్న యంగ్ టాక్స్ పేయర్స్ తమ జీతానికే పరిమితం కాకుండా వైవిధ్యమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. AY 2026-27లో 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో ఏకంగా 75 శాతం మంది కాంప్లెక్స్ పన్ను రిటర్న్ లు ఫైల్ చేశారు. క్రిందటి అసెస్మెంట్ ఇయర్లో ఈ సంఖ్య 60 శాతంగా ఉండేది.
ముఖ్యంగా ఐటీఆర్-3 ఫైల్ చేసిన యంగ్ పీపుల్ శాతం 28 శాతం నుండి 44 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఐటీఆర్ -1 ఫైలింగ్ శాతం 41 శాతం నుండి 25 శాతానికి పడిపోయింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఫ్రీలాన్సింగ్, చిన్న తరహా వ్యాపారాల వైపు యువత ఎక్కువగా మొగ్గు చూపుతుండటమే దీనికి ప్రధాన కారణం.
వార్షిక ఆదాయం తక్కువగా ఉన్నంత మాత్రాన ఐటీఆర్ ఫైలింగ్ సులభంగా ఉంటుందని చెప్పలేము. గ్రోస్ ఆదాయం రూ. 1 లక్ష కంటే తక్కువగా నమోదైన పన్ను చెల్లింపుదారులలో 73 శాతం మంది కాంప్లెక్స్ ఐటీఆర్లనే ఫైల్ చేసినట్లు క్లియర్ టాక్స్ రిపోర్ట్ స్పష్టం చేసింది. రూ. 50 లక్షల వరకు ఉన్న ఏ ఇతర ఆదాయ వర్గం కంటే ఇది చాలా ఎక్కువ.
రూ. 1 లక్ష నుండి 2.5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారిలో 69 శాతం, రూ. 2.5 లక్షల నుండి 5 లక్షల మధ్య ఉన్న వారిలో 60 శాతం మంది కాంప్లెక్స్ రిటర్న్ లు దాఖలు చేశారు. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు, ఫ్రీలాన్స్ సంపాదన వల్ల ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ రిటర్నుల ప్రక్రియ క్లిష్టంగా మారుతోంది.
పెద్ద వయస్కులతో పోలిస్తే యంగ్ ఇన్వెస్టర్లే క్యాపిటల్ నష్టాలను ఎక్కువగా ఐటీఆర్‌లో రిపోర్ట్ చేస్తున్నారు. AY 2026-27లో క్యాపిటల్ గెయిన్స్ లేదా నష్టాలను వెల్లడించిన 25 ఏళ్ల లోపు పన్ను చెల్లింపుదారులలో 37 శాతం మంది నష్టాలు వచ్చాయని తెలిపారు. అన్ని వయో సమూహాలలో ఇదే అత్యధికం.
వయస్సు పెరిగే కొద్దీ ఈ నష్టాల శాతం తగ్గుతూ వచ్చింది. 25-30 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 29 శాతం, 60 ఏళ్లు దాటిన వారిలో 21 శాతం మాత్రమే నష్టాలు చూపించారు.
అలాగే రూ. 1 లక్ష కంటే తక్కువ రాబడి ఉన్న వారిలో 35 శాతం మంది నష్టాలు చూపించగా, రూ. 50 లక్షలకు పైగా సంపాదించే వారిలో ఇది 19 శాతంగా ఉంది. నష్టాలు వచ్చినా యువత మార్కెట్లలో పెట్టుబడులు కొనసాగిస్తోంది. క్లియర్ టాక్స్ ఎక్స్పర్ట్ సేవలు పొందిన కొత్త ఫైలర్లలో 82 శాతం మంది కాంప్లెక్స్ రిటర్న్‌లనే ఎంచుకున్నారు.
ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా భారతీయులు పెట్టుబడులు పెట్టడం ఆపడం లేదు. AY 2026-27లో 60 ఏళ్లు దాటిన వారిలో 40 శాతం మంది క్యాపిటల్ గెయిన్స్ పొందుతున్నట్లు ఐటీఆర్‌లలో చూపించారు. 40-50 ఏళ్ల వయస్సు ఉన్న వారిలో ఇది 35 శాతంగా మాత్రమే ఉంది.
అయితే రాబడి విషయంలో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. 40-50 ఏళ్ల వారిలో 44 శాతం మంది రూ. 20 లక్షలకు పైగా ఆదాయాన్ని రిపోర్ట్ చేయగా, 60 ఏళ్లు దాటిన వారిలో ఈ సంఖ్య కేవలం 9 శాతంగానే ఉంది. అంతేకాకుండా, 60 ఏళ్లు పైబడిన వారిలో సగానికి పైగా కాంప్లెక్స్ రిటర్న్‌లు ఫైల్ చేయడం వారి యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ను సూచిస్తోంది.