Money Recovery: మనం మన స్నేహితులకు లేదా బంధువులకు నమ్మకంతో అప్పులు ఇస్తుంటాం. కానీ వారు తిరిగి ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఆ అప్పుగా ఇచ్చిన డబ్బును చట్టబద్ధంగా ఎలా వసూలు చేసుకోవాలో న్యాయ నిపుణులు పలు సలహాలు ఇచ్చారు.
సాధారణంగా ఆర్థిక అవసరాల కోసం మనకు తెలిసిన వారు అప్పు అడుగుతుంటారు. నమ్మకంతో మనం ఇచ్చే ఆ డబ్బులు కొన్నిసార్లు తిరిగి రావు. అడిగినప్పుడు తప్పించుకోవడం లేదా ఎదురు తిరగడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టం మీకు ఎలా తోడ్పడుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
25
ముందస్తు జాగ్రత్తలు
ఏదైనా అప్పు ఇచ్చేటప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పు ఇచ్చే వ్యక్తి ఎంతటి సన్నిహితుడైనా ప్రామిసరీ నోట్ రాసుకోవడం ఉత్తమం. ఒకవేళ నోటు రాసుకోవడానికి సంకోచిస్తే, కనీసం డిజిటల్ లావాదేవీల(GPay, PhonePe, Net Banking) ద్వారా డబ్బు పంపాలి. దీనివల్ల బ్యాంక్ స్టేట్‌మెంట్ ఒక తిరుగులేని సాక్ష్యంగా మారుతుంది.
35
చట్టపరమైన చర్యలు
డబ్బు తీసుకున్న వ్యక్తి నిర్ణీత సమయంలో తిరిగి ఇవ్వకపోతే, మొదటగా ఒక న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపాలి. నోటీసు అందిన 15 రోజుల్లోగా స్పందించాలని అందులో పేర్కొనాలి. ఆ తర్వాత కూడా డబ్బు చెల్లించకపోతే, సివిల్ కోర్టులో 'మనీ రికవరీ సూట్' దాఖలు చేయవచ్చు. దీనికి అప్పు ఇచ్చిన తేదీ నుండి లేదా అగ్రిమెంట్ గడువు ముగిసిన తేదీ నుండి మూడు సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది.
ఒకవేళ అవతలి వ్యక్తి ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే, సెక్షన్ 138 ఎన్ఐ (NI) యాక్ట్ కింద కేసు నమోదు చేయవచ్చు. ఇది క్వాసీ-క్రిమినల్ కేసు కిందకు వస్తుంది. చెక్ బౌన్స్ అయిన 30 రోజులలోపు నోటీసు పంపాలి, ఆపై 45 నుండి 75 రోజుల లోపు కేసు దాఖలు చేయాలి.
55
వడ్డీ, సాక్ష్యాలు
వ్యక్తిగత అవసరాల కోసం ఇచ్చిన అప్పుపై కోర్టు సాధారణంగా 6 శాతం నుంచి 12 శాతం వరకు వడ్డీని నిర్ణయిస్తుంది. అదే వ్యాపార అవసరాలకైతే 18 శాతం నుంచి 23 శాతం వరకు కూడా ఉండవచ్చు. ఒకవేళ ఎటువంటి కాగితాలు లేకుండా కేవలం నగదు ఇచ్చినట్లయితే, ఆ సమయంలో ఉన్న సాక్షులు, వాట్సాప్ చాట్లు, ఫోన్ రికార్డింగ్‌లు లేదా ఫోటోలను ఆధారాలుగా కోర్టుకు సమర్పించవచ్చు. సెక్యూరిటీ కింద ఇల్లు లేదా భూమి పత్రాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా అగ్రిమెంట్‌లో ఆ విషయం రాసుకోవాలని న్యాయవాది సూచించారు.