ఒకప్పుడు రుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఇల్లు కదలకుండా చేతిలో స్మార్ట్ ఫోన్‌తో రుణాలు పొందుతున్నారు. కేవలం ఒక క్లిక్‌తో అకౌంట్‌లోకి డబ్బులు పడిపోతున్నాయి. అంతలా బ్యాంకింగ్ రంగం సులభతరమైంది. ఇక క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత కూడా రుణం పొందడం మరింత సులువైంది. తక్కువ మొత్తంలో కూడా ఈఎమ్‌ఐ కన్వర్ట్ చేసుకునే అవకాశం లభిస్తోంది.
దీంతో చాలా మంది అసలు తమ పేరుపై మొత్తం ఎన్ని లోన్స్ ఉన్నాయి.? ఎప్పుడైనా ఈఎమ్‌ఐ చెల్లించడం ఆలస్యమైందా? అన్న విషయాలను తెలుసుకోలేకపోతున్నారు. అంతేకాకుండా పెరుగుతోన్న సైబర్ నేరాల నేపథ్యంలో కొందరు మోసగాళ్లు మన పేరు మీద రుణాలు తీసుకుంటున్నారు. అయితే మన పేరుపై ఎన్ని యాక్టివ్ లోన్స్ ఉన్నాయి.? అప్పటికే ఉన్న లోన్ వాయిదాలు ఇంకా ఎన్ని ఉన్నాయి లాంటి వివరాలు తెలుసుకునేందుకు కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు.
ఈ వివరాలు తెలుసుకోవడానికి మన సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం ముందుగా www.cibil.com వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అనంతరం అందులో కనిపించే 'గెట్ యువర్ సిబిల్ స్కోర్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ పుట్టిన రోజు తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇలా ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయగానే పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అనంతరం పాన్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీ ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే మీ సిబిల్ స్కోర్ వస్తుంది. మీ సిబిల్ స్కోర్‌తో పాటు అక్కడే మీకు ఏయే బ్యాంకులో ఎంత రుణం ఉందన్న వివరాలు వెల్లడవుతాయి. అంతేకాకుండా మీరు ఏవైనా ఈఎమ్‌ఐలు చెల్లించడంలో విఫలమయ్యారా.? ప్రస్తుత లోన్‌లో ఇంకెన్ని ఈఎమ్‌ఐలు చెల్లించాల్సి ఉంది లాంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
మీకు తెలియకుండా ఏవైనా ఉంటే..
ఒకవేళ మీ పేరుపై మీకు తెలియకుండా ఏదైనా లోన్ ఉన్నట్లు సిబిల్ స్కోర్‌లో కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. సంబంధిత బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి విషయాన్ని వెల్లడించాలి. ఇలా చేస్తే బ్యాంక్ లోన్‌కు లింక్ చేసిన పాన్ నెంబర్‌ను డీయాక్టీవ్ చేస్తారు. ప్రస్తుతం పెరుగుతోన్న ఆర్థిక నేరాల నేపథ్యంలో కనీసం నెలకొకసారైనా సిబిల్ స్కోర్‌తో పాటు, యాక్టివ్ లోన్స్ చెక్ చేస్తుండాలని నిపుణులు సూచిస్తున్నారు.