భారతదేశంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రం. సిమ్ కార్డ్ కొనడం నుండి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడం వరకు అనేక సేవలకు ఇది ఉపయోగపడుతుంది. ఆర్థిక, ప్రభుత్వ, వ్యక్తిగత ప్రయోజనాలకు ఇది చాలా అవసరం. అయితే ఇప్పుడంతా ఆన్ లైన్ సేవలే కాబట్టి ఎవరి ఆధార్ వివరాలైనా మిస్ యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఆధార్ కార్డు వివరాలతో ఆన్‌లైన్ మోసాలు చేసే మోసగాళ్లు చాలా మంది ఉంటారు.
మీకెప్పుడైనా మీ ఆధార్ కార్డు మిస్ యూజ్ అవుతోందని డౌట్ వచ్చిందా? ఎందుకంటే ఈ సమాజంలో చాలా మంది స్కామర్లు ఉన్నారు. ఆధార్ కార్డు లేకుండా ఏ ఒక్క ప్రభుత్వ స్కీమ్ పొందలేని పరిస్థితి ఇప్పుడు మన దేశంలో ఉంది. ప్రైవేటు సంస్థల సేవలు పొందాలన్నా, వారు కూడా ఆధార్ డీటైల్స్ అడుగుతున్నారు. ఇలా మనం ఇచ్చిన ఆధార్ జిరాక్స్ కాపీలు మోసగాళ్ల చేతుల్లోకి వెళితే మన పేరు నేరాలు చేసి వారు తప్పించుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక నేరాలు ఇదే విధంగా జరుగుతాయి. ఇప్పటికే ఇలాంటి నేరాలు ఎన్నో జరిగాయి.
అనధికారిక యాక్సెస్, ఆర్థిక మోసాలకు దొంగిలించిన ఆధార్ వివరాలను మోసగాళ్ళు ఉపయోగించారు. మీ ఆధార్ కార్డు కూడా ఇలా మిస్ యూజ్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి UIDAI సహాయం చేస్తోంది. ప్రయాణం, బ్యాంకింగ్ వంటి సేవలకు మీ ఆధార్ ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించారో తెలుసుకోవడానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది.
మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ఆధార్‌ని ఉపయోగిస్తున్నారని మీరు డౌట్ ఉంటే, ఇలా చెక్ చేయండి.
MyAadhaar వెబ్‌సైట్‌కి వెళ్లండి.
లాగిన్ అవ్వడానికి మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేయాలి.
మీ ఆధార్ ఉపయోగించిన అన్ని సందర్భాలను చూడటానికి "Authentication History"కి వెళ్లి తేదీల వారీగా చెక్ చేయండి.
ఎక్కడైనా అనధికారిక వినియోగం కనిపిస్తే UIDAIకి వెంటనే తెలియజేయండి.
మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ని ఇలా లాక్ చేసుకోండి.
అధికారిక UIDAI వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
"ఆధార్ లాక్/అన్‌లాక్" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
అన్ లాక్ చేసిన తర్వాత మీ వర్చువల్ ID (VID), పేరు, పిన్ కోడ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి OTPని పొందడానికి "OTP సెండ్" పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ని లాక్ చేయడానికి OTPని ఉపయోగించి సేఫ్ గా ఉండండి.