Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయిన గుడ్ల ధరలు.. ట్రే ఎంతంటే?

Published : Mar 11, 2026, 04:34 PM IST

ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను షేక్ చేస్తున్నాయి. కానీ, ఈ యుద్ధం ప్రభావం.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పౌల్ట్రీ రైతులపై పడుతోంది. ఎలాగో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

PREV
15
యుద్ధం ఎఫెక్ట్.. పెరిగిన ఖర్చులు

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య టెన్షన్స్ పెరగడంతో మధ్య ప్రాచ్యంలో పరిస్థితి తీవ్రంగా మారింది. అమెరికా కూడా ఇందులోకి రావడంతో ఈ ప్రాంతం పూర్తిగా యుద్ధ వాతావరణంలోకి వెళ్లింది. దీంతో ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్మూజ్ జలసంధి ప్రమాదకర ప్రాంతంగా మారింది. ప్రపంచంలో దాదాపు 20% చమురు సరఫరా ఈ మార్గం ద్వారా జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పెరగడంతో ప్రపంచ మార్కెట్‌లో వెంటనే ప్రభావం పడింది. ఫలితంగా చమురు ధరలు పెరిగాయి, షిప్పింగ్ ఖర్చులు పెరిగాయి. అంతర్జాతీయ వ్యాపారం మందగించింది.

25
నిలిచిపోయిన ఎగుమతులు

యుద్ధం కారణంగా మన దేశ ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం పడింది. భారత్ నుంచి ఏటా కోట్లాది రూపాయల గుడ్లు, చికెన్ ఉత్పత్తులు మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి అవుతాయి. కానీ, ఇప్పుడు యుద్ధ పరిస్థితుల వల్ల చాలా షిప్పింగ్ కంపెనీలు ఆ ప్రాంతాలకు సరుకు పంపడానికి వెనుకడుగు వేస్తున్నాయి. ఫలితంగా, ఎగుమతి కావాల్సిన గుడ్లు, చికెన్ ఇప్పుడు దేశీయ మార్కెట్‌లోనే మిగిలిపోతున్నాయి. దీంతో ధరలు పడిపోయాయి.

35
తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్

ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశంలోనే పౌల్ట్రీ ఉత్పత్తిలో టాప్ రాష్ట్రాలు. ప్రత్యేకంగా ఏపీలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు, కృష్ణా జిల్లాలు పెద్ద పౌల్ట్రీ హబ్‌లుగా ఉన్నాయి. కానీ, యుద్ధ వాతావరణం కారణంగా ఇప్పుడు రైతులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్ని వారాల క్రితం వరకు 100 గుడ్ల ధర సుమారు రూ. 650–660 ఉండేది. కానీ ఇప్పుడు అదే ధర రూ400 వరకు పడిపోయింది. అంటే ఒక్క గుడ్డు రూ 4కు అమ్మాల్సిన పరిస్థితి. 30 గుడ్ల ట్రే రూ.120 నుంచి రూ.135 వరకు పలుకుతోంది. జిల్లాల వారీగా కాస్త అటు ఇటుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

45
పౌల్ట్రీ రైతుల ఆవేదన

ధరలు పడిపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదు అని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య అక్కడే ఆగిపోలేదు. పౌల్ట్రీ రైతులకు ఇంకో పెద్ద షాక్ ఎదురవుతోంది. పౌల్ట్రీలో పెద్ద ఖర్చు ఏమిటంటే.. ఫీడ్. మొక్కజొన్న, సోయాబీన్ మీల్, ఇతర ధాన్యాలు ఫీడ్ తయారీలో ఉపయోగిస్తారు. కానీ, యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో ఫీడ్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది రైతులకు డబుల్ ట్రబుల్ అనే చెప్పాలి. 

55
పరిస్థితి ఇలాగే కొనసాగితే..

మరోవైపు పౌల్ట్రీ ఫీడ్ కంపెనీలు, ట్రాన్స్‌పోర్ట్ రంగం, గుడ్ల వ్యాపారులు, చిన్న హోటళ్లు, ఫుడ్ ఇండస్ట్రీ.. ఈ మొత్తం ఎకోసిస్టమ్ ఇప్పుడు ప్రభావం ఎదుర్కుంటోంది. భారత్ నుంచి మధ్యప్రాచ్య దేశాలకు పెద్ద మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో దాదాపు 20% పైగా ఆ ప్రాంతానికే వెళ్తాయి. అందుకే ఈ యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే… భారత వ్యవసాయ రంగం కూడా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం, మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పౌల్ట్రీ రైతుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. ఇక ఈ యుద్ధం త్వరగా ముగుస్తుందా? లేక రైతుల సమస్యలు ఇంకా పెరుగుతాయా? అనేది వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories