Gold Silver Price: బంగారం ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఒకప్పుడు తులం బంగారం దాదాపు రూ.2లక్షల దాకా ఖర్చు అయ్యేది. ఇప్పుడు చూస్తుండగానే రూ.3వేలు పతనమైపోయింది. డాలర్ దెబ్బకు పసిడి విలవిల్లాడుతోంది.
పసిడి దాదాపు రూ.లక్షకు పడిపోయింది. దీంతో పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. బంగారం ధరలు మరోసారి భారీగా దిగొచ్చాయి. ఇప్పటికే దాదాపు రెండు వారాలుగా తగ్గుముఖం పడుతున్న పసిడి రేట్లు.. ఇప్పుడు 14 నెలల కనిష్ఠ స్థాయికి చేరువలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాలు పసిడిపై ఒత్తిడి పెంచుతున్నాయి.
25
తులం బంగారంపై వేల రూపాయల తగ్గుదల
ముందుగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,780 తగ్గి రూ.1,33,260 వద్దకు చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,550 మేర తగ్గి రూ.1,22,150 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం రూ.99,940 కు చేరుకుంది.
వరుసగా ధరలు తగ్గుతుండటంతో బంగారం కొనాలనుకునేవారు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం నగలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. అయితే గతంలో ధరలు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు బంగారం కొనుగోలు చేసినవారు మాత్రం ఇప్పుడు మార్కెట్ పతనంతో ఆందోళన చెందుతున్నారు.
35
వెండి ధరల్లో మాత్రం మార్పు లేదు
బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ వెండి మార్కెట్లో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,85,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై నగరాల్లోనూ కిలో వెండి ధర ఇదే స్థాయిలో ఉంది. అయితే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మార్కెట్లలో మాత్రం కిలో వెండి ధర రూ.1,76,000 వద్ద కొనసాగుతోంది.
ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే.. బంగారం ధరలు ఇంత భారీగా తగ్గడానికి ప్రధాన కారణాల్లో అమెరికా డాలర్ బలపడటం ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలు కలిగిన పెట్టుబడిదారులకు బంగారం కొనుగోలు ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. దీంతో పసిడికి డిమాండ్ తగ్గి ధరలపై ఒత్తిడి ఏర్పడుతుంది.
మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించి వెలువడుతున్న అంచనాలు కూడా బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయని లేదా ఎక్కువకాలం అధిక స్థాయిలోనే కొనసాగుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తే.. పెట్టుబడిదారులు బంగారం కంటే వడ్డీ ఆదాయం అందించే ఆస్తుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే బంగారంపై పెట్టుబడి పెడితే సాధారణంగా వడ్డీ రూపంలో ఆదాయం రాదు. అదే బాండ్లు వంటి పెట్టుబడులపై వడ్డీ లభిస్తుంది. దీంతో వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు వచ్చినప్పుడు బంగారంపై పెట్టుబడుల ఆకర్షణ తగ్గుతుంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం కూడా పసిడి ధరలపై ప్రభావం చూపిస్తోంది. ఈ పరిణామాలన్నీ కలిసిరావడంతో బంగారం ధరలు వరుసగా దిగొస్తున్నాయి.
55
ఇంకా తగ్గుతాయా? కొనడానికి ఇదే సరైన సమయమా?
ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే ధరలు మరింత తగ్గుతాయని కచ్చితంగా చెప్పలేం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ కదలికలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొనే భౌగోళిక ఉద్రిక్తతలు రానున్న రోజుల్లో పసిడి ధరలను ప్రభావితం చేయవచ్చు.
అందుకే బంగారం కొనాలనుకునేవారు ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టకుండా తమ అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. ఆభరణాలు కొనేవారు మార్కెట్ ధరతో పాటు 3 శాతం జీఎస్టీ, తరుగు, మేకింగ్ ఛార్జీలను కూడా లెక్కలోకి తీసుకోవాలి.