
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సభ్యులకు గుడ్ న్యూస్. ఇకపై మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా మీ ఫోన్‌లోని వాట్సాప్ ద్వారానే పీఎఫ్ బ్యాలెన్స్, చివరి 5 ట్రాన్సాక్షన్లు చూసుకోవచ్చు. అంతేకాకుండా పీఎఫ్ పాస్‌బుక్‌ను కూడా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు.
ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ వాట్సాప్ సేవలను తీసుకొచ్చారు. నవంబర్ 1, 2026న ఈపీఎఫ్ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కొత్త సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ సేవలను పొందాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచే ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
ఈపీఎఫ్ఓ కేటాయించిన ప్రత్యేక వాట్సాప్ నంబర్ +91 87964 41800 కు మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవలను వాడుకోవచ్చు. దానికోసం కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. నంబర్ సేవ్ చేసుకోండి: ముందుగా మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో +91 87964 41800 నంబర్‌ను సేవ్ చేసుకోండి. లేదా ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటనలో షేర్ చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా చాట్ ప్రారంభించవచ్చు.
2. మెసేజ్ పంపండి: వాట్సాప్ ఓపెన్ చేసి, సేవ్ చేసుకున్న నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపండి.
3. భాషను ఎంచుకోండి: చాట్‌బాట్ మీకు వెల్‌కమ్ మెసేజ్ పంపి, మీకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది.
4. బ్యాలెన్స్ ఆప్షన్: చాట్‌లో కనిపించే మెనూ నుంచి మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి.
5. ఓటీపీ వెరిఫికేషన్: మీ గుర్తింపును నిర్ధారించుకోవడానికి స్క్రీన్‌పై వచ్చే సూచనలను పాటించండి. మీ యూఏఎన్ తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి.
6. పీఎఫ్ అకౌంట్ ఎంపిక: వెరిఫికేషన్ పూర్తయ్యాక, మీ యూఏఎన్‌కు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు లింక్ అయి ఉంటే, మీకు కావాల్సిన పీఎఫ్ అకౌంట్ లేదా మెంబర్ ఐడీని ఎంచుకోండి.
7. బ్యాలెన్స్ వివరాలు: వెంటనే చాట్‌బాట్ మీరు ఎంచుకున్న ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలను చూపిస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఆప్షన్ల ద్వారా పాస్‌బుక్ చూడవచ్చు లేదా మెయిన్ మెనూకు తిరిగి వెళ్లవచ్చు.
మీ ఖాతాలో జమ అయిన నగదు, ట్రాన్సాక్షన్ల రికార్డులను తెలుసుకోవడానికి పాస్‌బుక్ ఎంతో ఉపయోగపడుతుంది. పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా ఇదే వాట్సాప్ సేవను ఉపయోగించవచ్చు. ముందుగా ఈపీఎఫ్ఓ వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి ‘Hi’ అని పంపాలి. ఆ తర్వాత మెనూలో పాస్‌బుక్ డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి, అడిగితే సంబంధిత పీఎఫ్ అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే చాట్‌బాట్ మీకు పాస్‌బుక్‌ను అందిస్తుంది. దీని ద్వారా ఉద్యోగి, కంపెనీ వాటా సక్రమంగా జమ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. అలాగే విత్‌డ్రాయల్స్, ఇతర ఎంట్రీలను కూడా ట్రాక్ చేయవచ్చు.
ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోకి వెళ్లకుండానే మీ ఖాతాలో జరిగిన చివరి 5 లావాదేవీలను కూడా వాట్సాప్‌లోనే చూసుకోవచ్చు. అధికారిక ఈపీఎఫ్ఓ నంబర్‌తో చాట్ ప్రారంభించాక, మెనూలో ఉండే ‘Last 5 Transactions’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి, సంబంధిత పీఎఫ్ ఖాతాను ఎంచుకుంటే మీ రీసెంట్ ట్రాన్సాక్షన్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఈ సేవను ఇటీవలే ప్రారంభించినందున, చాట్‌బాట్ వాడేటప్పుడు లేదా ఓటీపీ రావడంలో కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు ఎదురుకావచ్చు. అలాంటప్పుడు మీరు సరైన ఈపీఎఫ్ఓ నంబర్‌కే మెసేజ్ చేస్తున్నారో లేదో, మీ మొబైల్ నంబర్ యూఏఎన్‌తో రిజిస్టర్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
వెరిఫికేషన్ ఫెయిల్ అయితే కాసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. ఒకవేళ వాట్సాప్ సదుపాయం అందుబాటులో లేకపోతే, సభ్యులు ఎప్పటిలాగే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా తమ పాస్‌బుక్, ఇతర వివరాలను పొందవచ్చు.
ఈ వాట్సాప్ సేవను ఉపయోగించేటప్పుడు సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సాప్ నంబర్‌తో మాత్రమే చాట్ చేయాలి. సంస్థ ప్రతినిధులమని చెప్పి ఎవరైనా అడిగినా సరే.. మీ యూఏఎన్ పాస్‌వర్డ్, బ్యాంక్ వివరాలు, ఏటీఎం పిన్ లేదా ఇతర సున్నితమైన వివరాలను అస్సలు షేర్ చేయవద్దు.
అధికారిక వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా మాత్రమే ఓటీపీలను ఎంటర్ చేయాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ వాట్సాప్ సదుపాయం కేవలం పీఎఫ్ అకౌంట్ వివరాలను సులభంగా తెలుసుకోవడానికి మాత్రమే. దీని ద్వారా పీఎఫ్ విత్‌డ్రాయల్ క్లెయిమ్స్ చేయడం గానీ, పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం గానీ సాధ్యం కాదు.