Gold Price: అంతర్జాతీయంగా ఎక్కడ ఏం జరిగినా మొదటగా ప్రభావం చూపించేది బంగారం, వెండిపైనే. అందుకే మొన్నటివరకు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో రేట్లు పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు కంగారు పడ్డారు. కానీ ఊహించని స్థాయిలో పసిడి రేట్లు దిగొస్తున్నాయి.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, వాటిపై ఇరాన్ ప్రతిదాడులు, దీంతో ప్రపంచ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్తతలు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం, వెండివైపు మొగ్గు చూపుతారు. అందుకే ప్రారంభంలో పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అయితే పరిస్థితులు కొంత స్థిరపడుతున్న సంకేతాలు కనిపించడంతో పాటు డాలర్ బలపడటంతో ఇప్పుడు ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి.
25
రెండు రోజుల్లో రూ.5వేలు పతనం
దేశీయ మార్కెట్ విషయానికి వస్తే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 2,650 తగ్గి రూ. 1,54,650 వద్దకు చేరింది. కిందటి రోజు రూ.2,350 మేర పతనమైంది. అంటే రెండు రోజుల్లో కలిపి పసిడి ధర దాదాపు రూ.5,000 వరకు తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,890 తగ్గి ప్రస్తుతం రూ. 1,67,620 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు రోజు కూడా ఇది రూ. 2,580 మేర పడిపోయింది. ఇప్పుడు శుభకార్యాలు జరిగే సమయం కావడంతో ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది.
35
స్థిరంగా వెండి
ఇక సిల్వర్ రూట్ చూస్తే పెద్ద మార్పేం లేదు. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3.15 లక్షల వద్దే ఉంది. అయితే మార్చి 2న సిల్వర్ రేటు రూ. 10,000 మేర తగ్గింది. అంతకు ముందు వారం మాత్రం వెండి ధర దాదాపు రూ. 35,000 వరకు పెరిగింది. అంటే వెండి కూడా కొద్ది రోజులుగా ఊగిసలాడుతోంది.
బంగారం భారీగా తగ్గడానికి ప్రధాన కారణం యూఎస్ డాలర్ బలపడటమే. డాలర్ ఇండెక్స్ ఒక నెల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ పెరిగింది. డాలర్ బలపడితే బంగారం, వెండి వంటి కమోడిటీల కొనుగోలు విదేశీ ఇన్వెస్టర్లకు ఖరీదవుతుంది. ఫలితంగా డిమాండ్ తగ్గి ధరలు క్షీణించే అవకాశం ఉంటుంది.
55
యుద్ధ భయాల మధ్య దిగొచ్చిన పసిడి
మొత్తానికి యుద్ధభయాలు ఒకవైపు కొనసాగుతున్నా, డాలర్ బలం , లాభాల స్వీకరణ కారణంగా ప్రస్తుతం పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. వచ్చే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ కదలికలపై ఆధారపడి మార్కెట్ దిశ నిర్ణయమవుతుంది.