Gold from Trees: ఆ దేశంలో చెట్లకే కాస్తున్న బంగారం, భవిష్యత్తులో బంగారాన్ని పండించవచ్చా?

Published : Oct 22, 2025, 01:00 PM IST

బంగారం ధర పెరగడంతో అందరి దృష్టి గోల్డ్ (Gold) పైనే ఉంది. ముందే కొని పెట్టుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే కొత్త పరిశోధనలో చెట్లపైనే బంగారు కణాలను కనిపెట్టారు శాస్త్రవేత్తలు. 

PREV
15
చెట్లకే బంగారం?

చెట్లకు బంగారం కాస్తుందా? అంటే అక్షరాలా కాయదని చెప్పవచ్చు. కానీ ఫిన్లాండ్ నుంచి వచ్చిన ఒక కొత్త అధ్యయనం మాత్రం చెట్లకు, బంగారానికి ఉన్న అనుబంధాన్ని బయటపెట్టింది. భవిష్యత్తులో బంగారాన్ని చెట్లపైనే పండించే అవకాశం ఉందని చెబుతోంది. ఉత్తర ఫిన్లాండ్ దేశంలో ఉన్న ఒక రకమైన చెట్లను పరిశోధించిన పరిశోధకులకు చిన్న బంగారు నానోపార్టికల్స్ కనిపించాయి. ఆ చెట్లు పేరు ‘నార్వే స్ప్రూస్’. బంగారం ఈ చెట్లపైనే పరిశోధకులకు లభించింది. దీనిపై మరింత పరిశోధనలు చేస్తే భవిష్యత్తులో చెట్లపైనే బంగారాన్ని కాయించ వచ్చనేది పరిశోధకుల అభిప్రాయం.

25
ఆకులపైనే బంగారుపూత

నార్వే స్ప్రూస్ చెట్లకు చెందిన ఆకులు పదునుగా ఉంటాయి. సూదుల్లా పొడుచుకొచ్చినట్టు కనిపిస్తాయి. ఈ చెట్ల ఆకుల్లో ఒక రకమైన సూక్ష్మజీవులు జీవిస్తాయి. అవి తమ చర్యల ద్వారా బంగారు కణాలను ఉత్పత్తి చేసినట్టు ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేవలం ఈ చెట్ల ఆకుల్లోనే ఆ సూక్ష్మజీవులు చర్యలు జరిపి బంగారు కణాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇదంతా సహజ ప్రక్రియ. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఈ చెట్ల ఆకుల్లో నివసిస్తాయి. తమ రసాయనిక ప్రతి చర్యలను ప్రేరేపించడం ద్వారా బంగారు కణాలను సృష్టిస్తున్నాయి. అంటే ఈ చెట్లను తమ ప్రయోగశాలల్లాగా అవి ఉపయోగించుకుంటున్నాయి.

35
బ్యాక్టిరియాల వల్లే

కొన్ని రకాల బ్యాక్టీరియా సమూహాలు ఈ ఆకులపై పరిశోధకులకు కనిపించాయి. ఇవన్నీ కలిసి బంగారు నానో పార్టికల్స్ ను సృష్టిస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. నేలలో బంగారం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. నేలలోని బంగారమే నీటి రూపంలో చెట్టులోకి ప్రవేశించి ఆకుల వరకు చేరుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అలా ప్రవేశించిన బంగారాన్ని సూక్ష్మజీవులు ఘనకణాలుగా మారడానికి సహాయపడుతున్నాయని వివరిస్తున్నారు. అందుకే ప్రతి నార్వే స్ప్రూస్ చెట్టులో కూడా బంగారం కనిపించే అవకాశం ఉండదు. వాటికొచ్చే నీటి మార్గాలు, సూక్ష్మజీవుల ద్వారా ఆకుల్లో బంగారం ఉండే అవకాశం ఉందని వివరిస్తున్నారు.

45
ఇంకా లోతుగా పరిశోధన

ఇప్పుడు జరిగిన పరిశోధన నిజానికి ప్రాథమికమైనది. మరింత లోతుగా అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉంది. నేలలోని బంగారం అనేది చెట్లను ఆకులపై ఎలా పేరుకుపోతోందో మరింత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు అధ్యయనాలలో ఇవన్నీ బయటపడతాయన్నది పరిశోధకుల వివరణ. ఏదేమైనా చెట్లపై బంగారం దొరకడం అనేది మాత్రం ఇదే తొలిసారి. అవి నానోపార్టికల్స్ రూపంలో ఉన్నప్పటికీ ప్రపంచంలోనే విలువైన బంగారం చెట్ల ఆకుల్లో దాగి ఉందనడం మాత్రం ఎంతోమందికి ఆసక్తికరంగా మారింది.

55
బ్యాక్టిరియాలకు బంగారానికి అనుబంధం

సాధారణంగా బంగారాన్ని వెలికి తీసేందుకు భూమిని డ్రిల్లింగ్ చేయడం, జియో కెమికల్ సర్వేలు చేయడం వంటివి చేస్తారు. ఈ పరిశోధనలో మాత్రం సూక్ష్మజీవులకు బంగారంతో అనుబంధం ఉన్నట్టు బయటపడింది. ఆ అనుబంధాన్ని ఎలా కలిగి ఉన్నాయో అర్థం చేసుకోవడం వల్ల కూడా శాస్త్రవేత్తలు బంగారం ఉనికిని కనిపెట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories