ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వజ్రాల తయారీ సంస్థ మన దేశంలోని గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో ఉంది. ఆ కంపెనీయే కిరణ్ జెమ్స్ కంపెనీ. అతిపెద్ద పాలిష్డ్ డైమండ్ ఎగుమతిదారు ఈ సంస్థ. కిరణ్ గ్రూప్ నకు ముంబై, సూరత్, UAE, USAలో వ్యాపార కార్యాలయాలు, తయారీ యూనిట్లు ఉన్నాయి. వజ్రాల పరిశ్రమలో అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ అతిపెద్ద వినియోగదారుగా ఈ సంస్థ పేరుపొందింది. భారీ మొత్తంలో వజ్రాలను పాలిష్ చేసి అందించే సామర్థ్యం వీరికి ఉంది.
50 వేల మంది ఉద్యోగులకు సెలవులు..
కిరణ్ జెమ్స్ కంపెనీ ప్రెసిడెంట్ వల్లభాయ్ లఖానీ ఏమన్నారంటే..
'ప్రస్తుతం, వజ్రాల పరిశ్రమ గడ్డు పరిస్థితిలో ఉంది. డైమండ్ పరిశ్రమకు పెద్దగా డిమాండ్ లేదు. వజ్రాల ఉత్పత్తిని తగ్గించేందుకు ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నాం. కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. మా కంపెనీ సంవత్సరానికి రూ.17,000 కోట్లు టర్నోవర్‌తో నడుస్తోంది. మా కంపెనీలో పనిచేస్తున్న 50,000 మంది ఉద్యోగులకు 10 రోజుల సెలవు ప్రకటించించాం. వజ్రాల పరిశ్రమకు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.'
ఆగస్టు 17 నుంచి..
అతిపెద్ద పాలిష్డ్ డైమండ్ ఎగుమతిదారుగా ఉన్న కిరణ్ జెమ్స్ కంపెనీ తన ఉద్యోగులకు 10 రోజుల సెలవు ప్రకటించింది. ఆగస్టు 17 నుండి ఆగస్టు 27 వరకు సెలవు ప్రకటించింది. కంపెనీ నిర్వహణ ఖర్చును తగ్గించుకొనే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిరణ్ జెమ్స్ కంపెనీ ప్రెసిడెంట్ వల్లభాయ్ లఖానీ తెలిపారు.