EPFO New Rule: కేంద్ర ప్రభుత్వం కొత్త ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2026ను అమల్లోకి తీసుకొచ్చింది. 70 ఏళ్లుగా అమల్లో ఉన్న ఈపీఎఫ్ స్కీమ్-1952 స్థానంలో ఈ కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. ఇందులో ప్రధానంగా జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త నిబంధనల్లో ప్రధానంగా స్పష్టం చేసిన అంశం ఏమిటంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.15,000 బేసిక్ వేతన పరిమితి వరకు మాత్రమే పీఎఫ్ కంట్రిబ్యూషన్ తప్పనిసరి. ఈ మొత్తంపై 12 శాతం లెక్కిస్తే ఉద్యోగి నుంచి నెలకు రూ.1,800 పీఎఫ్‌గా కట్ అవుతుంది. యజమాని కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. అంటే బేసిక్ జీతం రూ.50 వేలు లేదా రూ.1 లక్ష ఉన్నా, చట్టపరంగా తప్పనిసరిగా చెల్లించాల్సిన పీఎఫ్ మొత్తం మాత్రం రూ.1,800 మాత్రమే.
25
అదనంగా పీఎఫ్ చెల్లించాలా? నిర్ణయం ఉద్యోగిదే
ఇప్పటి వరకు చాలా సంస్థలు ఉద్యోగి పూర్తి బేసిక్ జీతంపై కూడా పీఎఫ్ కట్ చేసేవి. అయితే కొత్త స్కీమ్‌లో రూ.1,800 కంటే ఎక్కువ మొత్తాన్ని పీఎఫ్‌గా చెల్లించడం పూర్తిగా స్వచ్ఛందం అని స్పష్టం చేశారు. ఉద్యోగి భవిష్యత్తు కోసం ఎక్కువ పొదుపు చేయాలని భావిస్తే అదనపు పీఎఫ్ కంట్రిబ్యూషన్ కొనసాగించవచ్చు. లేదంటే చట్టపరంగా తప్పనిసరి అయిన మొత్తానికే పరిమితం కావచ్చు. అయితే ఉద్యోగి అదనంగా జమ చేసే మొత్తానికి కంపెనీ కూడా అదే స్థాయిలో కంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉండదు. కంపెనీ పాలసీ లేదా ఉద్యోగ ఒప్పందంలో ప్రత్యేకంగా ఉంటే మాత్రమే అదనపు మొత్తం జమ చేసే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఒకవేళ ఉద్యోగి అదనపు పీఎఫ్ కంట్రిబ్యూషన్ వద్దనుకుంటే అతని టేక్ హోం శాలరీ పెరగనుంది.
35
పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు కూడా సులభతరం
కొత్త EPF Scheme-2026లో పీఎఫ్ డబ్బు ఉపసంహరణ నిబంధనలను కూడా సులభతరం చేశారు. గతంలో అనేక రకాల కేటగిరీలు ఉండగా, ఇప్పుడు వాటిని ప్రధానంగా మూడు విభాగాలుగా మార్చారు. అనారోగ్యం, పిల్లల విద్య, వివాహం వంటి వ్యక్తిగత అవసరాలు, ఇంటి నిర్మాణం లేదా గృహ అవసరాలు, అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం పీఎఫ్ నుంచి డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన అర్హతలు, కనీస నిల్వ నిబంధనలు మాత్రం కొనసాగుతాయి.
కొత్త స్కీమ్‌లో డిజిటల్ సేవలకు మరింత ప్రాధాన్యం ఇచ్చారు. ఇకపై ఎక్కువ ప్రాసెస్ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయగలిగేలా మార్పులు తీసుకొచ్చారు. ఎలక్ట్రానిక్ ఫైలింగ్, ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రాసెసింగ్, ఈ-పాస్‌బుక్ సౌకర్యం, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనుసంధానం వంటి సేవలను మరింత బలోపేతం చేశారు. దీంతో ఉద్యోగులు ఎక్కువ పేపర్‌వర్క్ లేకుండానే పీఎఫ్‌కు సంబంధించిన సేవలను వేగంగా పొందే అవకాశం ఉంటుంది.
55
ఉద్యోగులపై ఈ మార్పుల ప్రభావం ఏమిటి?
కొత్త స్కీమ్ వల్ల ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల్లో ఎలాంటి కోత ఉండదు. పీఎఫ్ కంట్రిబ్యూషన్ రేటు కూడా గతంలాగే కొనసాగుతుంది. అయితే తప్పనిసరి కంట్రిబ్యూషన్ ఎంత? స్వచ్ఛంద కంట్రిబ్యూషన్ ఎంత? అనే విషయంలో స్పష్టత రావడం ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తు కోసం ఎక్కువగా పొదుపు చేయాలనుకునే వారు అదనపు పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేయవచ్చు. మరోవైపు, ప్రతి నెల చేతికి ఎక్కువ జీతం రావాలని భావించే వారు చట్టపరంగా తప్పనిసరి అయిన మొత్తానికే పరిమితం కావచ్చు. మొత్తంగా చూస్తే, EPF Scheme-2026 పీఎఫ్ వ్యవస్థను మరింత ఆధునికంగా, పారదర్శకంగా, ఉద్యోగులకు అనుకూలంగా మార్చే దిశగా తీసుకొచ్చిన కీలక సంస్కరణగా చెప్పవచ్చు.