ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీలు అనేక కారణాల వల్ల బ్లాస్ట్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువ శాతం బ్యాటరీ నిర్వహణ సరిగా చేయకపోవడమే కారణం. ఛార్జింగ్ పెట్టడంలో తప్పుడు పద్ధతులు ఫాలో అవడం వల్ల బ్యాటరీలు పేలతాయి. నాణ్యత లేని బ్యాటరీలు వాడటం వల్ల కూడా అవి బ్లాస్ట్ అవుతాయి. అందువల్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలా మెయిన్‌టెయిన్ చేయాలో తెలుసుకుంటే తప్పులు చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలుళ్లకు ప్రధాన కారణాలలో ఒకటి ఓవర్ ఛార్జింగ్. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఎక్కువసేపు ప్లగ్‌లో ఉంచినప్పుడు ఓవర్ ఛార్జింగ్ జరుగుతుంది.
ఇది బ్యాటరీ లోపల వేడి పెరగడానికి దారితీస్తుంది. ఇది పేలుడు ప్రమాదాన్ని పెంచుతుంది. బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఎక్కుతోందో తరచూ చెక్ చేస్తూ ఉండాలి. అది 100% పూర్తయిన తర్వాత దాన్ని అన్‌ప్లగ్ చేయండి. రాత్రిపూట లేదా అవసరం లేనప్పుడు స్కూటర్‌ను ఎక్కువసేపు ఛార్జ్ చేయకండి.
బ్యాటరీ పేలుడుకు మరొక సాధారణ కారణం వేడికి గురికావడం. మీరు మీ స్కూటర్‌ను ఎండలో ఎక్కువ సేపు పెట్టడం ఒకరకంగా మంచిది కాదు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే బ్యాటరీ వేడెక్కవచ్చు. తీవ్రమైన వేడి బ్యాటరీలోని కెమికల్స్ ను ఇంబ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల ఫైర్ యాక్సిడెంట్ కు దారి తీస్తుంది.
ఈ ప్రమాదాలు నివారించడానికి మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎల్లప్పుడూ నీడలో, చల్లని ప్రదేశాలలో ఉంచండి. ఎక్కువసేపు ఎండలో ఉంచకుండా చూడండి.
నకిలీ, నాణ్యత లేని బ్యాటరీలను ఉపయోగించడం కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ ల బ్లాస్ట్ కు మరో కారణం. మీరు మీ స్కూటర్ బ్యాటరీ మార్చాల్సి వస్తే స్కూటర్ కంపెనీ సిఫార్సు చేసిన బ్రాండెడ్ బ్యాటరీలనే ఉపయోగించాలి. తక్కువకు దొరుకుతున్నాయని చౌకైన, రక్షణ లేని వాటిని కొనవద్దు.
తప్పుడు ఛార్జర్ కూడా మీ బ్యాటరీకి ముప్పు కలిగిస్తుంది. వోల్టేజ్ లేదా కరెంట్ పరంగా, బ్యాటరీ స్పెసిఫికేషన్‌లకు సరిపోని ఛార్జర్‌ని ఉపయోగించడం వల్ల బ్యాటరీ అంతర్గత భాగాలు దెబ్బతింటాయి. దీంతో దాని జీవితకాలం తగ్గుతుంది.
ఛార్జర్ స్పెసిఫికేషన్‌లలో అన్ఈక్వాలిటీ బ్యాటరీ వేడెక్కడానికి దారితీస్తుంది. ఇది పేలుడుకు కారణం కావచ్చు. స్కూటర్‌తో వచ్చే ఛార్జర్ లేదా తయారీదారుతో ధృవీకరించబడిన అనుకూల ఛార్జర్‌ని ఎల్లప్పుడూ ఉపయోగించండి.
ప్రమాదంలో బ్యాటరీ దెబ్బతిన్నా లేదా బ్యాటరీకి బలమైన షాక్ తగిలినా అది అంతర్గత షార్ట్ సర్క్యూట్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది బ్యాటరీ పేలుడు ప్రమాదాన్ని పెంచుతుంది. ఏ చిన్న అనుమానం వచ్చినా బ్యాటరీని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. మీకు తేడాగా అనిపిస్తే ఆలస్యం చేయకుండా సర్వీస్ సెంటర్ ను సంప్రదించండి.
మరొక ప్రధాన తప్పు ఏమిటంటే బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయ్యే దాకా రీఛార్జ్ చేయకపోవడం. అంటే చాలా మంది తమ స్కూటర్ 0% డిశ్చార్జ్ అయ్యేదాకా వాహనాన్ని నడుపుతారు. బండి ఆగిపోయాక అవస్థలు పడుతుంటారు. ఇది బ్యాటరీ సెల్‌లకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇది పేలుళ్లకు ఛాన్స్ ఇస్తుంది. బ్యాటరీ జీవితకాలం, భద్రతను కాపాడుకోవడానికి బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయ్యే వరకు వేచి ఉండకుండా 20 నుంచి 30% ఉన్నప్పుడే రీఛార్జ్ చేయడానికి ప్రయత్నించండి.
పాత, దెబ్బతిన్న బ్యాటరీలను ఉపయోగించడం కూడా ప్రమాదమే. ఎక్కువ కాలం ఉపయోగించిన బ్యాటరీలు అంతర్గత నష్టాన్ని కలిగిస్తాయి. బ్యాటరీ పనితీరు తగ్గిందని మీరు గమనించినట్లయితే వెంటనే కొత్త బ్యాటరీ వేయించండి. ఈ కారకాలను దృష్టిలో ఉంచుకుని మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను సరిగా మెయిన్‌టెయిన్ చేయండి. స్కూటర్ తో పాటు బ్యాటరీ రక్షణకు చర్యలు తీసుకోండి. పేలుళ్లు, ఇతర ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండండి.