ట్రైన్ జర్నీ ఎంత బాగుంటుందో చిన్న పొరపాటు చేసినా అంత ఇబ్బందిగా మారుతుంది. రైలులో ప్రయాణించేటప్పుడు తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఇవి చెకింగ్ అధికారులు వచ్చినప్పుడు మాత్రమే బయటపడతాయి. ప్రయాణికులు తమ భద్రతను మాత్రమే కాకుండా తమ తోటి ప్రయాణికుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. తెలిసీ తెలియక నిషేధిత వస్తువులను తీసుకెళ్లడం వల్ల తీవ్రమైన లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సురక్షితమైన, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని మీరు కోరుకుంటే రైల్వే నిర్దేశించిన నియమాలను ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా పాటించాలి. రైళ్లలో పేలుడు పదార్థాలు, తేలికగా మండే వస్తువులు తీసుకెళ్లరాదు. స్మోకింగ్(ధూమపానం) చేయరాదు.
ఈ రూల్స్ ప్రమాదాలను నివారించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా మీ తోటి ప్రయాణికుల భద్రతకు మీరు సహాయ పడినట్లు అవుతుంది. మీరు మనశ్శాంతిగా ప్రయాణించవచ్చు. రైలు ప్రయాణంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా తేలికగా మండే వస్తువులను తీసుకెళ్లవద్దని భారతీయ రైల్వే ఇటీవల కఠినమైన సూచనలు జారీ చేసింది. ఇటువంటి ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం వల్ల వాటిని తీసుకెళ్లే వ్యక్తికే కాకుండా రైలులోని అందరి ప్రాణాలకు ముప్పు ఉంటుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఈ భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైల్వే స్పష్టం చేసింది.
రైళ్లలో పటాసులు, గ్యాస్ సిలిండర్లు, తుపాకీ గుండ్లు వంటి పేలుడు పదార్థాలను తీసుకెళ్లే వారిపై రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా రైలు ప్రయాణంలో మండే స్వభావం ఉన్న కిరోసిన్, పెట్రోల్ వంటి వాటిని తీసుకెళ్లడం నిషేధం. ప్రయాణికులందరి భద్రతే తమ ప్రాధాన్యత అని, భద్రతా నియమాలను పాటించకపోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటివి తీసుకెళ్లడం వల్ల రైలులో పేలుడు లేదా అగ్ని ప్రమాదం జరిగితే వందలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలను రక్షించడానికి రైల్వే కఠినమైన చర్యలు తీసుకుంటోంది.
ఈ రూల్స్ పాటించని వారికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. 1989 రైల్వే చట్టంలోని సెక్షన్ 164, 165 ప్రకారం పేలుడు పదార్థాలు లేదా తేలికగా మండే వస్తువులను తీసుకెళ్లే వారికి రూ.1000 వరకు జరిమానా విధిస్తారు. లేదా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి ఈ రెండు శిక్షలు పడే అవకాశం కూడా ఉంటుంది.
గ్యాస్ సిలెండర్, కిరోసిన్, పెట్రోల్ వంటివి తీసుకెళ్లకూడదన్న విషయం తమకు తెలియదని ఎవరైనా చెబితే అది సరైన సమాధానం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఒకరి అజాగ్రత్త వల్ల వందల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే అది కచ్చితంగా తప్పేనని శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. బోగీలు, రైల్వే స్టేషన్లలో కూడా ధూమపానం చేయడం నేరమే.
రైళ్లలో కొందరు టాయిలెట్లలో సిగరెట్ తాగుతుంటారు. దీని వల్ల కూడా తీవ్రమైన అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ వల్ల కలిగే ప్రమాదాలు వేగంగా వ్యాపించి, కదులుతున్న రైలులో నియంత్రించడం కష్టం. ఈ భద్రతా చర్యలకు అందరూ పూర్తిగా సహకరించాలని, ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లవద్దని రైల్వే విజ్ఞప్తి చేసింది. ఈ నిబంధనలు కఠినంగా అనిపించినప్పటికీ అవి ప్రయాణికులందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్లు, రైళ్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం ద్వారా ఈ మార్గదర్శకాలను రైల్వే అమలు చేస్తోంది. ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లే ప్రయాణికులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.