రాకెట్‌లా దూసుకుపోతున్న డీమార్ట్‌.. దెబ్బకు బిలియనీరైన సీఈవో..

First Published Oct 18, 2021, 9:37 PM IST

ముంబై : డిమార్ట్ (dmart)రిటైల్ స్టోర్స్ నిర్వహిస్తున్న ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ (avenue supermart)లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇగ్నేషియస్ నావిల్ నోరోన్హా  సంపద కంపెనీ షేర్లు ఈ ఏడాదిలో 113% ఆశ్చర్యకరంగా పెరగడంతో బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. సంస్థ షేర్లు సోమవారం రోజున 10 శాతం పైగా పుంజుకోవడంతో నోరోన్హా బిలియనీర్‌గా అవతారమెత్తారు. 
 


 బి‌ఎస్‌ఈలో కంపెనీ స్టాక్ తాజాగా గరిష్టంగా రికార్డు స్థాయికి రూ.5,899ను తాకింది అలాగే ఇంట్రాడేలో 10.7% వరకు లాభపడి మార్కెట్ క్యాప్ రూ.3.54 ట్రిలియన్లు దాటింది. ఉదయం 10 గంటలకు షేర్లు 2% పెరిగి రూ .5,431 కి చేరుకుంది. ఈ స్టాక్ విలువ వరుస ఏడు రోజులుగా లాభాల్లో ట్రేడవుతోంది, దీంతో సుమారు 40% లాభపడింది.


47 ఏళ్ల నోరోన్హా ఇప్పుడు రూ .7,744 కోట్ల నికర విలువను అధిగమించి, భారతదేశంలో అత్యంత ధనిక ప్రొఫెషనల్ మేనేజర్‌గా నిలిచారు. నోరోన్హా ప్రస్తుతం 13.13 మిలియన్ షేర్లు లేదా సంస్థలో 2.03 శాతం వాటా  కలిగి ఉన్నారు.


అవెన్యూ సూపర్మార్ట్స్ స్టాక్ విలువ 19 రెట్లు పెరిగినందుకు నరోన్హా ఈ సంపదను కూడబెట్టుకున్నాడు. స్టాక్ మొదటగా స్టాక్ ఎక్స్ఛేంజీలో మార్చి 21, 2017న ఒక్కో షేరుకు రూ .299 ఇష్యూ ధర వద్ద  లాంచ్ అయ్యింది. అప్పటి నుండి స్క్రిప్ ప్రారంభ ధర నుండి దాదాపు 1,800% పెరిగింది.

నావిల్ నోరోన్హా ముంబైలో పుట్టి , నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి మేనేజ్‌మెంట్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు.

నోరోన్హా గతంలో హిందుస్థాన్ యూనిలీవర్ లో పనిచేశారు. 2004లో అవెన్యూ సూపర్‌మార్ట్స్ వ్యవస్థాపకుడు రాధాకిష్ణన్ దమాని ద్వారా బిజినెస్ హెడ్ గా నియమీతుడయ్యాడు . 2007లో అతను కంపెనీ సి‌ఈ‌ఓ అయ్యాడు.

డిమార్ట్ చాలా కేటగిరీల్లో అత్యుత్తమ డిస్కౌంట్‌లను అందిస్తుంది. జియోమార్ట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీ పోటీగా నిలిచినప్పటికి  విశ్లేషకులు డిమార్ట్ సామర్థ్యాలు, తక్కువ ధరలు, తక్కువ నిర్వహణ వ్యయం,  డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కారణంగా దేశీయ రిటైల్ పరిశ్రమలో మంచి స్థానం పొందిందని భావిస్తున్నారు. 

click me!