
డిజిటల్ గోల్డ్ పెట్టుబడులకు సంబంధించి ఇటీవల SEBI (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కీలక సందేశం విడుదల చేసింది. కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు డిజిటల్ గోల్డ్ అనే పేరుతో పెట్టుబడులు విక్రయిస్తున్నట్టు తమ దృష్టికి రావడంతో ఈ ప్రకటన చేసింది. ఈ ఉత్పత్తులు తన నియంత్రణలోకి రావని స్పష్టంగా తెలిపింది. అంటే ఒకవేళ పెట్టుబడి దారుడు నష్టం చవిచూస్తే SEBI సహాయం అందించే అవకాశం ఉండదు. నిజానికి ఇది ఎక్కువ మంది వినియోగదారులకు తెలియని అత్యంత కీలక విషయం.
డిజిటల్ గోల్డ్ అనేది బంగారం కొనుగోలు పద్ధతిని డిజిటల్ రూపంలోకి మార్చిన మోడల్. ఈ విధానంలో యాప్‌లు, ఫిన్‌టెక్ కంపెనీలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు చిన్న మొత్తంతో బంగారం కొనుగోలు చేసే అవకాశం ఇస్తాయి. బంగారం నిల్వ వాల్ట్‌లో ఉంటుందని కంపెనీలు చెబుతాయి. ఇందులో యూజర్ల వద్ద ఫిజికల్ గోల్డ్ ఉండదు. కేవలం యాప్‌లో డిజిటల్ రికార్డ్ రూపంలోనే గోల్డ్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ చాలా మందిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం చిన్న మొత్తంలో కూడా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. నిల్వ భారం ఉండదు, అమ్మడం కూడా సులువు.
డిజిటల్ గోల్డ్ పనిచేసే పద్ధతి ఇలా ఉంటుంది.
* యూజర్ యాప్ ద్వారా డబ్బు చెల్లించి, గోల్డ్ కొనుగోలు చేయొచ్చు.
* కంపెనీ తన సిస్టమ్‌లో ఆ మొత్తానికి సరిపడే గ్రాముల బంగారం యూజర్ పేరుతో రికార్డు చేస్తుంది.
* వాల్ట్‌లో అదే పరిమాణంలో బంగారం ఉంచినట్టు చూపిస్తుంది.
* ఆ గోల్డ్‌ను ఎప్పుడైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది.
* కొన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో ఫిజికల్ డెలివరీ కూడా ఇస్తారు. అయితే ఇందుకు ప్రత్యేక ఛార్జీలు ఉంటాయి.
* అయితే ఈ ప్రక్రియ చూడడానికి సింపుల్‌గా ఉన్నా, సౌకర్యవంతంగా అనిపించినా. అసలు సమస్య ఇంటర్నల్‌గా ఉంటుంది. యూజర్‌కు ఎలాంటి హామీ పత్రం లేదా చట్టపర రక్షణ ఉండదు.
డిజిటల్ గోల్డ్ పాపులర్ కావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి:
* చిన్న మొత్తంతో బంగారం కొనుగోలు మొదలుపెట్టే అవకాశం
* పండగల సమయంలో ప్లాట్‌ఫామ్‌లు ఇచ్చే డిస్కౌంట్లు
* ఫిజికల్ స్టోరేజ్ అవసరం లేకపోవడం
* ఎప్పుడైనా అమ్ముకునే సౌకర్యం
* బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో పెట్టుబడి చేయాలనే ఆకర్షణ
* యువత, ఉద్యోగులు, హౌస్‌వైఫ్‌లు కూడా సులభంగా యాప్‌ల ద్వారా కొనగలగడం వల్ల ఈ ఉత్పత్తికి డిమాండ్ రికార్డు స్థాయికి వెళ్లింది.
డిజిటల్ గోల్డ్‌కి ప్రభుత్వం, SEBI, RBI లాంటి సంస్థలు ఎలాంటి పర్యవేక్షణ చేయడం లేదు. ఇది ఏ చట్టం పరిధిలోకీ రాదు. అంటే యూజర్ డబ్బు కంపెనీ వద్ద సురక్షితం అని నమ్మడానికి ఆధారం లేదు.
ఒకవేళ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ దివాళా తీస్తే? సర్వర్లు మూతపడితే? బంగారం నిల్వ చేసినట్టు చెప్పిన వాల్ట్ లేదు అన్న విషయం బయటపడితే? ఇలాంటి ఊహించని సమయాల్లో యూజర్ పెట్టిన డబ్బు తిరిగి పొందే మార్గం ఉండదు.
ఇది డిజిటల్ గోల్డ్‌లో పెద్ద ప్రమాదం. ప్లాట్‌ఫామ్ నమ్మకాన్ని ప్రశ్నించలేని పరిస్థితి ఉంటుంది. వారి చర్యలు, నిర్వహణ పద్ధతి, నిల్వ వాల్ట్ వివరాలు — ఇవన్నీ కంపెనీ చెప్పిందే యూజర్లు నమ్మాల్సి ఉంటుంది.
ప్లాట్‌ఫామ్‌లు వాల్ట్‌లో ఎంత గోల్డ్ ఉంది, యూజర్ల కొనుగోళ్లకు సరిపడేలా నిల్వ ఉందా అనే విషయాలను బయటపెట్టవు. కొన్ని సంస్థలు ఆడిట్ చేస్తున్నట్టు చెబుతున్నా, అవి స్వతంత్ర ఆడిట్‌లు అన్న హామీ లేదు.
డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసేప్పుడు:
3% GST
2–3% స్ప్రెడ్
పెట్టుబడి ప్రారంభ ఏ రోజునే 6% వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇలా డిజిటల్ గోల్డ్‌లో ఎన్నో హిడెన్ ఛార్జీలు ఉంటాయి.
గత ఏడాది కాలంలో గోల్డ్ ధరలు గణనీయంగా పెరిగాయి. రూ. 76,000 నుంచి రూ. 1.22 లక్షల వరకు చేరడంతో, ప్రజలు బంగారంలో పెట్టుబడి పెట్టాలన్న ఆసక్తి పెరిగింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఈ అవకాశం చూసి డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లను బాగా ప్రమోట్ చేశాయి.
డిజిటల్ గోల్డ్
* డిజిటల్ గోల్డ్‌కు ఎలాంటి నియంత్రణ లేదు.
* ప్రభుత్వ పర్యవేక్షణ లేదు
* చట్టపర రక్షణ లేదు
* కంపెనీదే పూర్తి నియంత్రణ ఉంటుంది.
* యూజర్లకు పారదర్శక సమాచారం ఉండదు.
* రెగ్యులేటెడ్ గోల్డ్ ఉత్పత్తులు సురక్షిత మార్గంగా చెప్పొచ్చు. మీరు కొనుగోలు చేసిన గోల్డ్ ఫిజికల్ రూపంలో ఉంటుంది.
* SEBI, RBI పర్యవేక్షణలో పనిచేసే ఉత్పత్తులు:
* Gold ETFs - డీమాట్ అకౌంట్‌లో లభ్యం
* Electronic Gold Receipts - స్టాక్ ఎక్స్చేంజ్‌లో ట్రేడ్ అవుతాయి
* Sovereign Gold Bonds - ప్రభుత్వ హామీ ఉంటుంది.
ఇవి పెట్టుబడిదారులకు క్లియర్ రూల్స్, పారదర్శకత, చట్టపర రక్షణ ఇస్తాయి.
Paytm, PhonePe, Jar, Gullak వంటి పెద్ద యాప్‌లు డిజిటల్ గోల్డ్ విక్రయిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ప్రభుత్వ సంస్థ MMTC ద్వారా గోల్డ్ నిల్వ చేస్తున్నట్టు చెబుతుంటాయి. కానీ SEBI రక్షణ అందించదనే అంశం మాత్రం మారదు. సెబీ తీసుకున్న నిర్ణయంతో కొన్ని ఫేక్ కంపెనీల బారిన పడకుండా యూజర్ల జాగ్రత్త పడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం. సెబీ నిర్ణయంతో భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు. విశ్వసనీయ సంస్థల వద్ద నిల్వ ఉన్న డిజిటల్ గోల్డ్‌లో సమస్యలు ఉండవని అంటున్నారు. కానీ నియంత్రణ ఉండనంత వరకు రిస్క్ ఉంటూనే ఉంటుందని అంటున్నారు. మరి కొంతమంది నిపుణులు మాత్రం పెట్టుబడులను వెంటనే రెగ్యులేటెడ్ గోల్డ్ ETFలకు మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
భయం అవసరం లేదు కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రస్తుతం పెట్టుబడి పెట్టి ఉంటే, వెంటనే అమ్మేయాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని విషయాలను మాత్రం గమనించాలి. వీటిలో ప్రధానమైనవి ఇవే..
* మీరు కొనుగోలు చేసిన ప్లాట్‌ఫామ్ విశ్వసనీయమైనదా?
* వాల్ట్‌లో గోల్డ్ నిల్వ ఎవరి చేతుల్లో ఉంది?
* కంపెనీ ఆడిట్ రిపోర్టులు అందుబాటులో ఉన్నాయా?
కొంతమంది ఫైనాన్షియల్ అడ్వైజర్లు డిజిటల్ గోల్డ్‌ను అమ్మి అదే రోజు Gold ETF లేదా Gold Fundsలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. కొత్తగా డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టాలనుకునే వారు.. Gold ETFs, Gold Fund of Funds, Sovereign Gold Bonds వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఇవి చట్టపర రక్షణను ఇస్తాయి. విలువ కూడా పారదర్శకంగా ఉంటుంది.
డిజిటల్ గోల్డ్‌పై జెరోధా సీఈఓ నితిన్ కమత్ కీలక హెచ్చరిక చేశారు. “డిజిటల్ గోల్డ్‌ను ఎవరూ నియంత్రించడం లేదు. ప్లాట్‌ఫామ్ మూతపడితే యూజర్ ఏమీ చేయలేడు.” అని చెప్పుకొచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసిన వెంటనే ఛార్జీలు పడతాయని అంటున్నారు. అందుకే Gold ETFs ఉత్తమ మార్గమని చెబుతున్నారు.
సెబీ విడుదల చేసిన ప్రకటనను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.