ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ ల్లో ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని మీకు తెలుసా?

First Published | Nov 9, 2024, 3:40 PM IST

ప్లాస్టిక్ బాక్సుల్లో మీ పిల్లలకు టిఫిన్, లంచ్ పెట్టి పంపిస్తున్నారా? మీరు ఫుడ్ తో పాటు ప్లాస్టిక్ పార్టికల్స్ ను కూడా ఫుడ్ గా పెడుతున్నారని మీకు తెలుసా? ఇది మీ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలకు దారి తీస్తుంది. ప్లాస్టిక్ ప్రభావం పిల్లలపై పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. 

ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలను చాలా ప్రేమగా, జాగ్రత్తగా పెంచుతారు. కానీ కొన్నిసార్లు వారు చేసే కొన్ని తప్పుల వల్ల వారి పిల్లలే నష్టపోతారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్‌లలో మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌లను ప్యాక్ చేసి పాఠశాలకు పంపుతారు. పిల్లలు తాగే నీటి బాటిల్ కూడా ప్లాస్టిక్‌తో తయారు చేసిందే ఉంటుంది. కానీ ఈ విధంగా ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్‌లను ఉపయోగించడం వల్ల పిల్లల ఆరోగ్యానికి ఎంత హానికరమో చాలా మందికి తెలియదు. అందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఫుడ్ పెడుతున్నామని మాత్రమే ఆలోచిస్తున్నారు. అయితే అందులో ప్లాస్టిక్ కూడా ఉంటోందని గుర్తించలేకపోతున్నారు. 

ప్రస్తుతం వివిధ రకాల ప్లాస్టిక్ బాక్స్‌లు దుకాణాలలో అమ్ముడవుతున్నాయి. అవి చూడటానికి అందంగా ఉండటమే కాకుండా ధర కూడా తక్కువ. దీంతో తల్లిదండ్రులు వాటిని కొని వేడి వేడి ఆహారాన్ని వాటిలో పెట్టి తమ పిల్లలకు ఇస్తున్నారు. 

కానీ ప్లాస్టిక్ బాక్స్‌లలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. అవి పిల్లల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. దీని వల్ల పిల్లలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. ప్లాస్టిక్ బాక్సుల్లో టిఫిన్ పెట్టడం వల్ల అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. 


మీకు తెలుసా.. కొన్నిసార్లు ప్లాస్టిక్ విరిగి చిన్న రేణువులుగా మారుతుందని.. దీనిని మైక్రోప్లాస్టిక్ అంటారు. ఇలాంటి టిఫిన్ బాక్స్‌లలో పిల్లలకు ఆహారం పెట్టి ఇస్తే అది పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీంతో వారు తరచూ అనారోగ్యానికి గురవుతారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి అంటువ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. 

ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్‌ల్లో బాక్టీరియా కూడా సులభంగా పెరుగుతుంది. ఇందులో పెట్టిన ఆహారాన్ని పిల్లలు తింటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కొంతమంది తల్లిదండ్రులు ఒకే టిఫిన్ బాక్స్‌ను చాలా రోజులు ఉపయోగిస్తారు. సరిగ్గా శుభ్రం చేయకపోతే అందులో బాక్టీరియా పేరుకుపోతుంది. దీని వల్ల పిల్లలు తీవ్రంగా ప్రభావితం అవుతారు.

ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్‌ను ఎక్కువగా ఉపయోగించినప్పుడు దాని పై పొర ఊడిపోయి ఆహారంలో కలిసిపోతుంది. దీని వల్ల పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి ఇలాాంటి సమస్యల నుంచి బయటపడటానికి పిల్లలకు ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్‌లకు బదులుగా ఇవి ఉపయోగిస్తే మంచిది. 

స్టెయిన్‌లెస్ స్టీల్ టిఫిన్ బాక్సులు: ఇవి వేడి ఆహారాన్ని ఉంచడానికి సురక్షితంగా ఉంటాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ బాక్సులు ప్లాస్టిక్ రసాయనాలను విడుదల చేయవు. వేడి, గాలి ప్రతిస్పందనలకు మన్నికగా ఉంటాయి.

గాజు టిఫిన్ బాక్సులు: ఇవి మైక్రోవేవ్‌, డిష్‌వాషర్‌కు అనుకూలంగా ఉంటాయి. అయితే వీటిని జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే అవి తేలికగా పగిలే అవకాశం ఉంది.

సిరామిక్ టిఫిన్ బాక్సులు: గాజు మాదిరిగా సిరామిక్ కూడా వేడి ఆహారానికి సురక్షితం. ఇవి రసాయన రహితంగా ఉంటాయి. ఆహార రుచి లేదా నాణ్యతపై ప్రభావం చూపవు.

సిలికాన్ టిఫిన్ బాక్సులు: సిలికాన్ టిఫిన్ బాక్సులు కూడా సురక్షితమైనవే. స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి. కానీ ఎల్లప్పుడూ ఫుడ్ గ్రేడ్ సిలికాన్ ఎంపిక చేసుకోవడం అవసరం. ముఖ్యంగా స్టెయిన్‌లెస్ స్టీల్, గాజు టిఫిన్ బాక్సులు రోజువారీ వాడకానికి మంచివి.

మీరు ఇప్పటివరకు మీ పిల్లలకు ప్లాస్టిక్ బాక్స్‌లలో ఆహారం పెట్టి ఇస్తుంటే వెంటనే ఆపేయండి. ఒకవేళ ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ ఇవ్వాలనుకుంటే ఒక నెల వరకు మాత్రమే ఉపయోగించండి. అలాగే బాగా శుభ్రం చేసి ఉపయోగించండి. మీ పిల్లలకు స్టీల్ బాటిల్‌లో నీరు ఇవ్వండి.

Latest Videos

click me!