వాట్సాప్‌లో లింక్స్ క్లిక్ చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మరో కొత్త స్కామ్ వచ్చేసింది

First Published | Jul 17, 2024, 7:27 PM IST

టెక్నాలజీని ఆసరా చేసిన కేటుగాళ్లు ఆటలాడుతున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫేక్‌ మెసెజ్‌లు, నకిలీ యాప్‌లతో జనాన్ని బుట్టలో వేసుకొని రూ.లక్షల్లో దోచుకుంటున్నారు.

whatsapp

సైబర్‌ మోసగాళ్లు గతంలో బ్యాంకు ఆఫీసర్లమంటూ కాల్‌ చేసి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల అప్‌డేట్‌ కోసం ఓటీపీలు చెప్పమని అడిగేవారు. కేవైసీ చేయకపోతే అధిక మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వస్తుందని బెదిరించేవారు. జీ పే, ఫోన్‌ పేలకు మెసేజ్‌లు పంపి పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయమని అడిగేవారు. ఇప్పుడవన్నీ పాతవై పోయాయి. ఇప్పుడు ప్రతి స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుడు వాడుతున్న వాట్సాప్‌లోకి ఎంటర్‌ అయిపోయారు సైబర్‌ నేరగాళ్లు. ఆఫర్ల పేరిట వాట్సాప్‌లో సందేశాలు పంపి.. లింక్‌పై క్లిక్‌ చేయగానే ఫోన్‌ హ్యాక్‌ చేసేస్తున్నారు. మన ఫోన్‌ని పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకొని చేయాల్సిందంతా చేసేస్తున్నారు. 

తాజాగా వాట్సాప్ ద్వారా చేస్తున్న మోసాలకు సంబంధించి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ- చలాన్‌ పేరిట వాట్సాప్‌కి మెసేజ్‌లు పంపిస్తున్నారు. అలా మెసేజ్‌ల ద్వారా మొబైల్‌లోకి మాల్వేర్‌ ఎక్కించేసి హ్యాక్ చేసేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 4వేల 400 మొబైల్‌, పరికరాలకు ఈ మాల్వేర్ ఎక్కించి దాదాపు రూ.16 లక్షలు కాజేసినట్లు తెలుస్తోంది. ఇలా నేరాలకు పాల్పడేందుకు సైబర్‌ నేరగాళ్లు Wromba అనే మాల్వేర్‌ను వాట్సాప్‌ ద్వారా మొబైల్‌ డివైజెస్‌లోకి చొప్పిస్తున్నట్లు  సైబర్ నేరాలను అరికట్టే ‘క్లౌడ్‌సెట్’ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. 

Latest Videos


ఈ Wromba మాల్వేర్‌ను వియత్నాంకు చెందిన హ్యాకర్లు  సృష్టించినట్లు ‘క్లౌడ్‌సెట్’ కనుగొంది. దీని ద్వారా భారీ మొత్తం డబ్బు కాజేసినట్లు తెలిస్తోంది. 

ముందుగా ఈ హ్యాకర్లు ఈ-చలాన్ పేరుతో ఫేక్ సందేశాలు వాట్సాప్‌కు పంపిస్తారు. కర్ణాటక పోలీసులు లేదా పరివాహన్ సేవ నుంచి ఈ-చలాన్ పంపినట్లు నమ్మిస్తారు. అలా సందేశాలు పంపి వ్రోంబా మాల్వేర్‌ను స్మార్ట్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయిస్తారు. ఇక వారు చెప్పిన మాల్వేర్ యాప్ ఇన్‌స్టాల్‌ చేస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే. మన ఫోన్‌లోని డేటా అంతా చోరీ చేసేస్తారు. 

ఎలా హ్యాక్‌ చేస్తారంటే..?

ముందుగా ఎంపిక చేసిన కొన్ని నంబర్లకు వాట్సాప్‌ ద్వారా హ్యాకర్లు ఓ లింక్‌ పంపిస్తారు. దాన్ని క్లిక్‌ చేసి పెండింగ్‌లో ఉన్న చలాన్‌ చెల్లించాలని సందేశం కూడా కలిపి పంపిస్తారు. సదరు లింక్‌ను క్లిక్‌ చేయగానే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పర్మిషన్‌ అడుగుతుంది. అప్పుడు ఇన్‌స్టాల్ బటన్ నొక్కేస్తే డేటా మొత్తం హ్యాకర్స్‌ వశమైపోతుంది. మన ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ మొదలు ఫొటోలు, ఇతర సమాచారమంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇక హ్యాకర్లు తమకు నచ్చినట్లు మన సమాచారాన్ని వినియోగించుకుంటారు. ఇప్పటివరకు గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఈ స్కామ్ పొరుగు రాష్ట్రాలకు మెల్లగా పాకుతున్నట్లు సమాచారం.

ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? 

మనకు నిత్యం వచ్చే మెసేజ్‌ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చే సందేశాలు, లింక్‌తో కలిపి ఉండే మెసేజ్‌లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాంటి లింక్‌లపై క్లిక్‌ చేయకపోవడం చాలా ఉత్తమం. గుర్తు తెలియని, అన్‌-ఆథరైజ్‌డ్‌ యాప్‌లను అస్సలే ఇన్‌స్టాల్‌ చేయొద్దు. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఫోన్‌ వినియోగదారులు యాపిల్‌ స్టోర్‌ల నుంచి మాత్రమే సెక్యూర్డ్‌ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అలాగే, యాప్‌లకు ఫోన్‌ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు చూసుకోవాలి. దేనికి అనుమతిస్తున్నామో తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ బ్యాంకింగ్, ఆర్థికపరమైన, ఇతర వ్యక్తిగత యాప్‌ల విషయంలో తరచూ చెక్‌ చేసుకోవడం చాలా అవసరం...

click me!