
ఇప్పటికే ప్రపంచలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సరసన చేరిన భారత్.... ఉత్పాదక రంగం నుంచి అంతరిక్షయానం వరకు అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. మేడిన్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారతీయ తయారీ ఉత్పత్తుల (మేడ్ ఇన్ ఇండియా) ద్వారా అసాధారణ విజయాన్ని ప్రదర్శిస్తోంది.
భారతీయ సైకిళ్ల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు భారత్ తన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. యూకే, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలకు ఎగుమతులు పెరగడంతో భారతీయ సైకిళ్లు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ఈ వృద్ధి అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.
ఆరోగ్యం, పర్యావరణంపై అవగాహన పెరుగుతుండటంతో సైకిళ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రత్యేకించి భారత్‌లో తయారైన సైకిళ్లకు స్వదేశంలోనే కాకుండా యూకే, జర్మనీతో పాటు ప్రపంచ సైకిల్ రాజధానిగా పేరొందిన నెదర్లాండ్స్‌లో కూడా డిమాండ్ పెరిగింది. మొజాంబిక్, చాద్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి కూడా భారత్‌కు సైకిళ్ల ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.
భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం... 2023లో మొజాంబిక్ దేశానికి సైకిళ్ల ఎగుమతిలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 8.84 మిలియన్ డాలర్లుగా ఉన్న గతేడాది సైకిళ్ల ఎగుమతుల విలువ... ఈ ఏడాది 17.82 శాత్తం వృద్ధి చెంది 10.41 మిలియన్ డాలర్లకు పెరిగింది. యూకేకి రెండో అతిపెద్ద సైకిళ్ల ఎగుమతిదారుగా ఉన్న భారత్ FY2023లో $3.85 మిలియన్ల విలువైన సైకిళ్లను ఎగుమతి చేసింది. FY2024లో 130% వృద్ధితో $8.85 మిలియన్లకు ఎగుమతులు చేరాయి. ఇక, నెదర్లాండ్స్‌కు ఎగుమతులు 169.38 శాతం పెరిగాయి. గత ఏడాది $1.29 మిలియన్ల ఉండగా.. ప్రస్తుతం $3.47 మిలియన్లకు చేరుకున్నాయి. మొత్తంగా భారత్ సైకిల్ ఎగుమతులు గత ఏడాది $46.5 మిలియన్లు ఉండగా.. ఈ ఏడాది 16.95% వృద్ధితో $54.38 మిలియన్లకు పెరిగాయి.
'మేడ్ ఇన్ బిహార్' బూట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ రష్యన్ ఆర్మీ గేర్‌లో భారతీయ బూట్లు భాగమయ్యాయి. ఇది భారతీయ ఉత్పత్తుల ఊహించని ప్రపంచ వ్యాప్త పరిధిని ప్రదర్శిస్తుంది. ఈ మైలురాయి అంతర్జాతీయ రక్షణ మార్కెట్లలో భారత్ ఆధిపత్యాన్ని, ప్రభావాన్ని, తయారీ సామర్థ్యాల నాణ్యతను ప్రతిబింబిస్తుంది. కాగా, గత ఏడాది 100 కోట్ల రూపాయల విలువైన 15 లక్షల జతలను బిహార్ నుంచి రష్యాకు ఎగుమతి చేశారు. వచ్చే ఏడాది దీన్ని 50 శాతం పెంచాలన్నది లక్షం.
ప్రపంచ కప్ సమీపిస్తుండటంతో కశ్మీర్ బ్యాట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ బ్యాట్లు భారతదేశ అత్యుత్తమ కళా నైపుణ్యానికి, అంతర్జాతీయ క్రికెట్ తెరపై గణనీయమైన ప్రభావానికి అద్దంపడుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. కాశ్మీర్‌లో శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారిపై 400కి పైగా క్రికెట్ బ్యాట్ల తయారీ యూనిట్లు పనిచేస్తున్నాయి. కాశ్మీర్ విల్లో బ్యాట్లకు భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కాగా, కాశ్మీర్ విల్లో బ్యాట్ ఖరీదు సుమారు రూ.3,500 వరకు ఉంటుంది. అదే అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒక్కో బ్యాట్ విలువ సుమారు 220 డాలర్ల నుంచి 450 డాలర్టు పలుకుతోంది. అంటే సుమారు రూ.16వేల నుంచి రూ.33 వేలు.
అమూల్ భారతదేశ ప్రత్యేక రుచులను ప్రపంచానికి తీసుకెళ్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ తన ఉత్పత్తులను అందిస్తోంది. ఈ అంతర్జాతీయ విస్తరణ భారతీయ పాల ఉత్పత్తుల ప్రపంచ వ్యాప్త ఆకర్షణను, భారతదేశ రుచిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో అమూల్ నిబద్ధతను సూచిస్తుంది. 1950, 60లలో పాల ఉత్పత్తి లోటు ఎదుర్కొన్న భారత్.. దిగుమతులపై ఆధారపడేది. ఇప్పుడు ప్రపంచ పాల ఉత్పత్తిలో దాదాపు 21 శాతం వాటా అందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ డెయిరీ బ్రాండ్ అమూల్ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా 50 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 18,000 పాల సహకార కమిటీలు, 36వేల రైతుల నెట్‌వర్క్ కలిగిన అమూల్.. రోజుకు 3.5 కోట్ల లీటర్లకు పైగా పాలను ప్రాసెస్ చేస్తోంది.
భారతీయ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వ్యవస్థ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమైంది. భారతీయ యూపీఐ సిస్టమ్ ద్వారా ఇప్పుడు అనేక దేశాల్లో అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. భూటాన్, ఒమన్, మారిషస్, శ్రీలంక, నేపాల్, ఫ్రాన్స్, యూఏఈ దేశాల్లో యూపీఐ విధానంలో చెల్లింపులు చేయవచ్చు. అలాగే, ఆగ్నేయాసియా దేశాలైన మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం, సింగపూర్, కంబోడియా, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్, హాంకాంగ్‌లలో QR-ఆధారిత UPI చెల్లింపులను ప్రారంభించేందుకు NIPL లిక్విడ్ గ్రూప్‌తో ఒక ఒప్పందం చేసుకుంది. ఈ సాంకేతిక పురోగతి ఫిన్‌టెక్ ఆవిష్కరణలో భారత్ నాయకత్వాన్ని, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను విప్లవాత్మకంగా మార్చడంలో భారత్ నిబద్ధతను చాటుతుంది.
రక్షణ రంగంలోనూ భారత్ కొన్నేళ్లుగా ఎంతో పురోగతి సాధిస్తోంది. యుద్ధ విమానాలు, క్షిపణులు, రక్షణ రంగానికి సంబంధించిన సామగ్రిని భారత్ స్వయంగా తయారు చేస్తోంది. తాజాగా ఇండియా మేడ్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైళ్లు ఫిలిప్పీన్స్‌కు చేరాయి. భారత్- రష్యా సంయుక్త భాగస్వామ్య సంస్థ బ్రహ్మోస్ క్షిపణులు ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో పనిచేస్తున్నాయి. ఈ పరిణామం భారత దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను, ప్రపంచ భద్రతను పెంచడంలో మన ముఖ్యమైన పాత్రను నొక్కి చెబుతుంది.
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే అమ్మకాల్లో భారతీయ ఉత్పత్తులు ఆధిపత్యం చెలాయించాయి. మిలియన్ల కొద్దీ 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను వరుసలో ఉంచారు. STEM బొమ్మలు, ఆభరణాలు, కార్యాలయ ఉత్పత్తులు, దుస్తులు... ఇలా 50వేలకు పైగా భారత్‌లో తయారైన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో సేల్ అవుతున్నాయి. ఈ విజయగాథ మేడ్ ఇన్ ఇండియా (#MadeInIndia) వస్తువులకు అంతర్జాతీయ డిమాండ్, ప్రపంచ ఇ-కామర్స్ మార్కెట్లలో పెరుగుతున్న భారతదేశ ఉనికిని వివరిస్తుంది.