కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రాయితీలు అందుతాయి. బోనస్, ఇంక్రిమెంట్, తదితర సదుపాయాలు కల్పిస్తారు. ఇలాంటి ఒక ఫెసిలిటీ ఎల్టీసీ(Leave Travel Concession). LTC ద్వారా సెంట్రల్ గవర్నెమెంట్ ఎంప్లాయిస్ టూర్ ప్యాకేజీని పొందవచ్చు. సాధారణంగా 5 రోజులు ఎల్టీసీ స్కీమ్ ద్వారా ఉద్యోగి తన కుటుంబంతో సహా ఇండియాలో ఎక్కడికైనా తిరిగి రావొచ్చు.
ఈ సెలవు ప్రయాణ రాయితీ పథకాన్ని ఉపయోగించుకొని లాంగ్ జర్నీ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వందే భారత్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించొచ్చు. సెంట్రల్ గవర్నెమెంట్ ఎంప్లాయిస్ ఇప్పటి నుంచి వందే భారత్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చని సంబంధించి సిబ్బంది, శిక్షణా విభాగం (DoPT) ప్రకటన విడుదల చేసింది.
DoPT విడుదల చేసిన ప్రకటనలో ''కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సెలవు ప్రయాణ రాయితీ పథకం (LTC) కింద ఇప్పటి వరకు రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఉచితంగా ప్రయాణించే వారు. ఇక నుండి తేజస్ ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు.
LTC అంటే ఏమిటి?
సెలవు ప్రయాణ రాయితీ (LTC) అనేది ఉద్యోగులకు అందించే టూరిజం రాయితీ. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ప్రైవేటు కంపెనీలు కూడా అమలు చేస్తూ ఉంటాయి. అయితే కంపెనీల నిబంధనలకు అనుగుణంగా డిస్కౌంట్లు ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో పనిచేసే ఉద్యోగులు నాలుగు సంవత్సరాల వ్యవధిలో తమ సొంతూళ్లకు లేదా భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా కుటుంబంతో పర్యటించడానికి వీలుగా LTC ఫెసిలిటీ అందిస్తోంది.
ఇకపై రాజధాని, శతాబ్ది, దురంతో, తేజస్ ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఎల్టీసీ స్కీమ్ ను ఉపయోగించుకొని ప్రయాణించే ఉద్యోగుల ఛార్జీలను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పర్యటనకు వారికి జీతంతో కూడిన సెలవు(EL) కూడా లభిస్తుంది. ఎల్టీసీ పథకం నిబంధనల ప్రకారం పర్యటనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు అవకాశాలు ఉన్నాయి.
అంటే వారు నాలుగు సంవత్సరాల వ్యవధిలో రెండుసార్లు స్వస్థలానికి వెళ్లవచ్చు. లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి స్వస్థలానికి వెళ్లి, మిగిలిన రెండు సంవత్సరాలలో భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు పర్యటించవచ్చు.
రాజధాని, శతాబ్ది
ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. భారతదేశంలో ఎక్కడికైనా ఎల్టీసీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబంతో పర్యటించవచ్చు.
ఎల్టీసీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించే జాబితాలో ఇదివరకు రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ప్రీమియం రైళ్లు కూడా జాబితాలోకి వచ్చాయి.