Business Model: ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, వేలాది ఆస్తులు, లక్షల ఎకరాల భూమి ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ డిజిటల్ యుగంలో ఈ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. చాలా కంపెనీలు టెక్నాలజీతో రాజ్యాలను ఏలుతున్నాయి.
ఈ రోజుల్లో విజయవంతమైన కంపెనీలు ఉత్పత్తులను తయారు చేయడం లేదా సేవలను నేరుగా అందించడం కంటే, వినియోగదారులు, సేవలందించే వారిని ఒకే వేదికపైకి తీసుకురావడంపై దృష్టి పెడుతున్నాయి. ఉదాహరణకు, జొమాటోకు ఒక్క రెస్టారెంట్ కూడా లేదు. కానీ దేశవ్యాప్తంగా వేలాది రెస్టారెంట్లను వినియోగదారులతో అనుసంధానిస్తోంది. ఉబర్‌కు సొంతంగా కార్లు లేవు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులకు క్యాబ్ సేవలను అందిస్తోంది. ఇదే విధంగా Airbnbకు సొంతంగా హోటళ్లు లేదా ఇళ్లు లేవు. అయినా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తమ ఇళ్లు, గదులను అద్దెకు ఇచ్చేలా ఒక వేదికను ఏర్పాటు చేసింది. ఈ కంపెనీలు సేవలను సొంతంగా అందించడం కాదు.. సేవలను అందించే వారిని, వాటిని ఉపయోగించే వారిని కలిపే డిజిటల్ వ్యవస్థను నిర్మించాయి.
24
ఫ్లిప్‌కార్ట్ నుంచి బుక్‌మైషో వరకు.. ఒకే సూత్రంతో విజయం
ఈ వ్యాపార విధానం ఒక్క రంగానికే పరిమితం కాలేదు. అనేక రంగాల్లో ఇదే మోడల్ విజయవంతంగా పనిచేస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌కు సొంతంగా ఉత్పత్తులు లేవు. కానీ లక్షలాది మంది విక్రేతలను వినియోగదారులతో కలిపే మార్కెట్‌ప్లేస్‌గా పనిచేస్తోంది. బుక్‌మైషోకు సొంతంగా సినిమా థియేటర్లు లేవు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా సినిమా టికెట్లు, ఈవెంట్ల బుకింగ్‌కు ప్రధాన వేదికగా మారింది. బుకింగ్.కామ్‌కు సొంతంగా హోటళ్లు లేవు. అయినా ప్రపంచంలోని లక్షలాది హోటళ్లను ప్రయాణికులతో అనుసంధానిస్తోంది. ఈ సంస్థలన్నీ వస్తువులను లేదా సేవలను కలిగి ఉండడం కంటే, వాటిని సులభంగా అందించే సాంకేతిక వ్యవస్థను రూపొందించడంపైనే దృష్టి పెట్టాయి.
34
రవాణా నుంచి ఇంటి సేవల వరకు.. ప్లాట్‌ఫామ్ మోడల్ సత్తా
ఈ మోడల్ రవాణా, ఇంటి సేవల రంగాల్లో కూడా భారీ విజయాన్ని సాధించింది. రెడ్‌బస్‌కు సొంతంగా బస్సులు లేవు. కానీ అనేక బస్సు ఆపరేటర్ల టికెట్లను ఒకే వేదికలో అందిస్తోంది. ర్యాపిడోకు సొంతంగా బైకులు లేవు. అయినప్పటికీ బైక్ టాక్సీ సేవలను లక్షలాది మంది వినియోగిస్తున్నారు. అర్బన్ కంపెనీకి సొంతంగా సెలూన్లు లేదా బ్యూటీ పార్లర్లు లేవు. కానీ నిపుణులైన బ్యూటీషియన్లు, టెక్నీషియన్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లను వినియోగదారులకు అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. ఈ సంస్థలు సేవలను అందించే వారిని ఒకచోట చేర్చి, వినియోగదారులకు నమ్మకమైన సేవలను అందించే వ్యవస్థను నిర్మించాయి.
అసలు విలువ ఆస్తుల్లో కాదు.. నమ్మకమైన వ్యవస్థలో ఉంది
గతంలో వ్యాపారం అంటే ఎక్కువ ఆస్తులు ఉంటేనే పెద్ద కంపెనీగా ఎదగొచ్చని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సాంకేతికత, డేటా, వినియోగదారుల నమ్మకం, వేగవంతమైన సేవలే కంపెనీల అసలు బలంగా మారాయి. ఈ కంపెనీలు ఒక విషయం నిరూపించాయి. వ్యాపార విజయం అనేది సొంతంగా ఎంత కలిగి ఉన్నామనే దానిపై కాదు.. ఎంత మందిని ఒకే వ్యవస్థలో కలిపి, వారికి సులభమైన అనుభవాన్ని అందిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రపంచంలో అతిపెద్ద వ్యాపార సంస్థలు అన్నీ ఒకే సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. అతిపెద్ద వ్యాపారాలు అన్నీ వస్తువులను సొంతంగా కలిగి ఉండవు. కానీ వాటిని అందించే వ్యవస్థను మాత్రం తమ ఆధీనంలో ఉంచుకుంటాయి. అదే నేటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో విజయానికి అసలైన సూత్రంగా మారింది.