ATM: షాపింగ్, హోటల్ బిల్లులు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, ట్రావెల్ బుకింగ్‌లు వంటి అనేక చెల్లింపులు కార్డుల ద్వారానే జరుగుతున్నాయి. అయితే కార్డు పోయినా, వేరే వారి చేతిలో పడ్డ ఇబ్బందులు తప్పవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే.?
డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పోయిన వెంటనే దాన్ని బ్లాక్ చేయడం అత్యంత ముఖ్యమైన పని. ఎందుకంటే కార్డు వివరాలు, CVV నంబర్ వంటి సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ లావాదేవీల కోసం కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది, అలాంటి సందర్భంలో మోసగాళ్లు మీ ఖాతాలోని డబ్బులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ATM పిన్ కూడా తెలిసిపోయినట్లయితే నేరుగా నగదు విత్‌డ్రా చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కార్డు పోయిందని గుర్తించిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వడం లేదా స్వయంగా కార్డును బ్లాక్ చేయడం తప్పనిసరి.
25
కార్డు దుర్వినియోగం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి?
కార్డు తప్పు వ్యక్తుల చేతికి వెళ్తే ఆన్‌లైన్ షాపింగ్, సర్వీసుల కొనుగోలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు కూడా కార్డును ఉపయోగించే ప్రమాదం ఉంది. ఇలాంటి లావాదేవీలు మీ పేరుతో నమోదవుతాయి కాబట్టి తర్వాత వాటిని నిరూపించుకోవడం ఇబ్బందిగా మారవచ్చు. అందువల్ల కార్డు పోయిన వెంటనే చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక నష్టంతో పాటు ఇతర సమస్యలను కూడా నివారించవచ్చు.
35
మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కార్డును ఎలా బ్లాక్ చేయాలి?
ప్రస్తుతం దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా కార్డు బ్లాక్ చేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి. ముందుగా మీ బ్యాంక్ యాప్‌లో లాగిన్ కావాలి. తర్వాత "Cards" లేదా "Card Services" విభాగంలోకి వెళ్లాలి. అక్కడ మీ ఖాతాకు లింక్ అయిన అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులు కనిపిస్తాయి. చివరి నాలుగు అంకెల ఆధారంగా సంబంధిత కార్డును ఎంపిక చేసుకోవాలి. అనంతరం "Manage Card", "Block Card" లేదా "Support" వంటి ఆప్షన్లలోకి వెళ్లి "Permanent Block" ఎంపికను ఎంచుకోవాలి. అభ్యర్థనను ధృవీకరించిన వెంటనే కార్డు బ్లాక్ అవుతుంది. ఆ తర్వాత కొత్త కార్డు కోసం కూడా అదే యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కార్డు బ్లాక్ అయినట్లు SMS లేదా ఈ-మెయిల్ ద్వారా బ్యాంకు నుంచి నిర్ధారణ సందేశం వస్తుంది.
స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా SMS ద్వారా కార్డును బ్లాక్ చేసే అవకాశం చాలా బ్యాంకులు కల్పిస్తున్నాయి. అయితే ప్రతి బ్యాంకుకు వేర్వేరు SMS ఫార్మాట్, ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ముందుగా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ ద్వారా సరైన ఫార్మాట్ తెలుసుకోవాలి. తర్వాత మీ కార్డు చివరి నాలుగు అంకెలతో కూడిన సందేశాన్ని నిర్దేశిత నంబర్‌కు పంపాలి. బ్యాంకు నుంచి కార్డు విజయవంతంగా బ్లాక్ అయినట్లు కన్ఫామ్ మెసేజ్ వస్తుంది.
55
కార్డు పోయినప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
కార్డు పోయిన వెంటనే సమయం వృథా చేయకుండా బ్లాక్ చేయాలి. అలాగే బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఘటనను నమోదు చేయడం మంచిది. కార్డు బ్లాక్ అయిన తర్వాత ఇటీవల జరిగిన లావాదేవీలను పరిశీలించి ఏవైనా అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అవసరమైతే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. డిజిటల్ యుగంలో కార్డులు సౌకర్యవంతమైన చెల్లింపు సాధనాలే అయినప్పటికీ, వాటి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు.