SBI flags Reliance: రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఫ్రాడ్ లోన్.. అంబానీకి ఎస్‌బీఐ, RBI షాక్.. ఏం జరిగింది?

Published : Jul 04, 2025, 09:01 PM IST

SBI flags Reliance: ఎస్బీఐ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లోన్ ఖాతాను ఫ్రాడ్ గా గుర్తించి, అనిల్ అంబానీపై ఆర్బీఐకి నివేదించింది. దీనివెనుక నిధుల మళ్లింపు, రుణ నిబంధనల ఉల్లంఘన ప్రధాన కారణాలుగా గుర్తించారు.

PREV
15
అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లోన్ ఫ్రాడ్..కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు

Anil Ambani Named SBI Declares RCOM Loan as Fraud: భారత కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు రేపుతూ ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.  దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM) లోన్ ఖాతాను ఫ్రాడ్ గా గుర్తించింది. అలాగే, అనిల్ అంబానీ పేరును కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి పంపింది. ఇంతకీ ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? దీని వెనుక ఉన్న వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రిలయన్స్ కమ్యూనికేషన్స్.. ఆర్ కామ్ (RCOM)గా ప్రసిద్ధి చెందిన ఈ టెలికాం సంస్థకు ఒకప్పుడు వ్యాపారవేత్త అనిల్ అంబానీ నాయకత్వం వహించారు. ఈ ఏడాది జూన్ 23న, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆర్ కామ్ రుణ ఖాతాను అధికారికంగా ఫ్రాడ్ గా వర్గీకరించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు దాఖలు చేసిన నివేదికలో వెల్లడించింది.

జూన్ 30న ఆర్ కామ్ కు అందిన ఎస్బీఐ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. వాటిలో ముఖ్యమైన వాటిని గమనిస్తే.. 

• నిధుల మళ్లింపు: రిలయన్స్ టెలికాం లిమిటెడ్ వంటి అనుబంధ కంపెనీలకు నిధుల మళ్లింపును ఎస్బీఐ పేర్కొంది.

• రుణ నిబంధనల ఉల్లంఘన: రుణానికి సంబంధించిన నిబంధనలు, షరతులు ఉల్లంఘించారనే ఆరోపణలు.

• ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలు: ఫోరెన్సిక్ ఆడిట్‌లలో వెల్లడైన విషయాలు, అనేక షోకాజ్ నోటీసులు కూడా ఈ నిర్ణయానికి కారణమయ్యాయి.

ఈ ఆరోపణలు ఆర్ కామ్ ఆర్థిక కార్యకలాపాల పారదర్శకతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఎస్బీఐ వంటి పెద్ద బ్యాంక్ ఒక రుణ ఖాతాను ఫ్రాడ్ గా గుర్తించడం అనేది చాలా అరుదైన, తీవ్రమైన చర్య. ఇది కంపెనీ ఆర్థిక స్థితిపై, దాని నిర్వహణపై తీవ్రమైన సందేహాలను సృష్టిస్తుంది.

25
అనిల్ అంబానీపై ఆర్బీఐకి ఎస్బీఐ ఫిర్యాదు

ఆర్ కామ్ లోన్ ను ఫ్రాడ్ గా గుర్తించిన తర్వాత, ఎస్బీఐ ఇప్పుడు కేవలం ఖాతాను మాత్రమే కాకుండా, అనిల్ అంబానీ పేరును కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (RBI) నివేదించింది. ఆర్బీఐ మాస్టర్ డైరెక్షన్స్, సర్క్యులర్‌లుగా పిలువబడే నియమాలు, మార్గదర్శకాల ప్రకారం ఎస్బీఐ ఈ చర్య తీసుకుంది.

గతంలో 2024 నవంబర్‌లో కెనరా బ్యాంక్ ఇప్పటికే ఆర్ కామ్ ఖాతాను ఫ్రాడ్ గా ప్రకటించింది. అయితే, బాంబే హైకోర్టు ఆ తర్వాత ఆ చర్యలపై స్టే విధించింది. అంతకుముందు విషయాలు, ప్రస్తుతం ఎస్బీఐ నిర్ణయంతో ఆర్ కామ్ ఆర్థిక వ్యవహారాలపై మరింత ఆందోళనను పెంచుతోంది. ఒకే ఖాతాపై వివిధ బ్యాంకుల నుండి వేర్వేరు సమయాల్లో ఇలాంటి చర్యలు రావడం కంపెనీ ఆర్థిక నిర్వహణలో లోపాలు ఉన్నాయనే అనుమానాలను బలపరుస్తుంది.

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, ఒక ఖాతాను ఫ్రాడ్ గా గుర్తించినప్పుడు, ఆ ఖాతాకు బాధ్యులైన వ్యక్తుల పేర్లను కూడా నివేదించాల్సి ఉంటుంది. అనిల్ అంబానీ ఆర్ కామ్ కు నాయకత్వం వహించినందున, అతని పేరును ఎస్బీఐ  రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు నివేదించింది. ఇది అనిల్ అంబానీ భవిష్యత్తు వ్యాపార కార్యకలాపాలపై, అతని ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

35
రిలయన్స్ కమ్యూనికేషన్స్ సమస్య ఎక్కడ ప్రారంభమైంది?

కొన్ని సంవత్సరాల క్రితమే రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. జూన్ 2019లో దాని కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (CIRP)ను ప్రారంభించింది. అప్పటి నుండి, కంపెనీ ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) పర్యవేక్షణలో ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ చే నడుస్తోంది. దాని రుణాలను పరిష్కరించడానికి ఒక రిజల్యూషన్ ప్లాన్ ఇప్పటికే దాని రుణదాతలచే ఆమోదించారు. ఇప్పుడు NCLT తుది ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇన్సాల్వెన్సీ ప్రక్రియ అనేది ఒక కంపెనీ తన రుణాలను చెల్లించలేకపోయినప్పుడు దాని ఆస్తులను విక్రయించడం ద్వారా లేదా పునర్నిర్మాణం చేయడం ద్వారా రుణదాతలకు తిరిగి చెల్లించడానికి ఉద్దేశించిన ఒక చట్టపరమైన ప్రక్రియ. 

ఆర్ కామ్ విషయంలో CIRP ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి, కంపెనీ వ్యవహారాలను ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ పర్యవేక్షిస్తున్నారు, ఇది కంపెనీ కార్యకలాపాలను సాధారణంగా నడిపించకుండా, రుణ పరిష్కారానికి సంబంధించిన చర్యలను మాత్రమే అనుమతిస్తుంది. 

రుణదాతలు ఆమోదించిన ప్రణాళిక, ఇప్పుడు NCLT ఆమోదం కోసం వేచి ఉంది, ఇదే ఇప్పుడు ఆర్ కామ్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. NCLT ఆమోదం పొందిన తర్వాత, కంపెనీ ఆస్తులను అప్పగించడం లేదా రుణదాతలకు తిరిగి చెల్లించడం వంటి ప్రక్రియలు ప్రారంభమవుతాయి.

45
పాత లోన్లు, ఇన్సాల్వెన్సీ ప్రక్రియపై ఆర్ కామ్ స్పందనలు ఏమిటి?

ఎస్బీఐ ప్రస్తావిస్తున్న రుణాలు జూన్ 2019కి ముందు, CIRP ప్రారంభం కావడానికి ముందే తీసుకున్నవని ఆర్ కామ్ పేర్కొంటోంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ ప్రకారం, ఒకసారి రిజల్యూషన్ ప్లాన్ ఆమోదించిన తర్వాత, కంపెనీ పాత కేసుల నుండి లేదా కార్యకలాపాల నుండి రక్షణ పొందాలి. అంటే అప్పటి వరకూ జరిగిన నేరాలకు సంబంధించి సంస్థపై చర్యలు తీసుకోవడానికి వీలు ఉండదు.

ఇందుకు సంబంధించి సెక్షన్ 32Aలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇది NCLT ఆమోదం తర్వాత, ఇన్సాల్వెన్సీ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు జరిగిన నేరాలకు కంపెనీ బాధ్యత వహించరాదని పేర్కొంటుంది. దీని కారణంగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇప్పుడు తన తదుపరి చర్యను నిర్ణయించడానికి న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలిపింది.

55
మరింత లోతుగా ఆర్బీఐ న్యాయ విచారణ

సెక్షన్ 32A, ఒక కంపెనీ ఇన్సాల్వెన్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, గత నేరాలకు బాధ్యత వహించకుండా, "క్లీన్ స్లేట్"తో కొత్తగా ప్రారంభించడానికి అనుమతిస్తుంది. 

ఆర్ కామ్ ఇప్పుడు ఈ సెక్షన్‌ను ఆశ్రయిస్తూ ఎస్బీఐ ఫ్రాడ్ ఆరోపణలు ఇన్సాల్వెన్సీ ప్రక్రియకు ముందు జరిగినవి కాబట్టి, తమకు రక్షణ లభిస్తుందని వాదిస్తోంది. ఈ వాదన చట్టపరంగా ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలి. 

ఎందుకంటే, ఫ్రాడ్ వంటి తీవ్రమైన ఆరోపణలు, కంపెనీని పూర్తిగా బాధ్యత నుండి మినహాయించవని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఇదే సమయంలో ఆర్బీఐ, న్యాయ వ్యవస్థలు ఈ అంశంపై మరింత లోతైన విచారణ జరిపే అవకాశముంది.

Read more Photos on
click me!

Recommended Stories