పరిచయం లేని వ్యక్తి కి పొరపాటున ఫోన్ పే చేశారా? తిరిగి ఇలా పొందండి

First Published | Nov 7, 2024, 5:39 PM IST

డబ్బులు సెండ్ చేసే సమయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా తెలియని వ్యక్తి అకౌంట్ లోకి డబ్బులు వెళ్లిపోతాయి. మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా? ఫ్యూచర్ లో ఇలా జరిగినా ఈ విధంగా చేస్తే మీ డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి. 

ఇప్పుడు డబ్బులు నేరుగా చూడాల్సిన అవసరం లేదు. వాటిని పర్సుల్లోనూ పెట్టుకోవాల్సిన పని లేదు. అన్ని లావాదేవీలు ఫోన్ లోనే జరిగిపోతున్నాయి. అందువల్ల ప్రస్తుత కాలంలో ఫోన్లను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే విషయం అందరూ జాగ్రత్తగా ఉండాలి. వాటి ఆపరేషన్ సరిగా తెలుసుకోవాలి. ఒకటి క్లిక్ చేయబోయి మరోటి నొక్కితే ఎన్నో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా మనీ ట్రాన్సాక్షన్స్ సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వివరాలు నమోదు చేసే క్రమంలో ప్రతి వివరాన్ని రెండుసార్లు సరిచూసుకోవాలి. కానీ కొన్నిసార్లు తప్పులు జరగొచ్చు.

చిన్న పొరపాటు వల్ల డబ్బు వేరే వ్యక్తి ఖాతాకు వెళ్లిపోతుంది. డబ్బు పంపేటప్పుడు ఖాతా నెంబర్, IFSC కోడ్ జాగ్రత్తగా టైప్ చేయాలి. ఒక్క స్పెల్లింగ్ తప్పు చాలు, డబ్బు వేరే ఖాతాకు వెళ్లిపోతుంది. చిన్న తప్పుకు పెద్ద పరిష్కారం చేయాల్సి వస్తుంది. పొరపాటున గుర్తు తెలియని వ్యక్తికి డబ్బు పంపితే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. 

ముందస్తు జాగ్రత్తలు ఇవి..

ముందుగా డబ్బు పంపేటప్పుడు తొందర పడకూడదు. ఫోన్‌లో టైప్ చేసేటప్పుడు చిన్న తప్పు జరిగినా పెద్ద నష్టం జరుగుతుంది. నెమ్మదిగా ప్రతి వివరం రెండుసార్లు చూసుకోవాలి. కాస్త ఓపిక ఉంటే డబ్బు పోకుండా ఉంటుంది.

డబ్బు పంపేటప్పుడు వివరాలు తప్పుగా ఉంటే చెల్లింపు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖాతా నుంచి డబ్బు డెబిట్ కాకుండా ఉంటుంది.

టైప్ చేసిన వివరాలు తప్పుగా ఉన్నా, అది వేరే వ్యక్తి అకౌంట్ కు సరిపోతే డబ్బు ఆ గుర్తు తెలియని వ్యక్తి ఖాతాకు వెళ్లిపోతుంది. ముఖ్యంగా పెద్ద మొత్తం అయితే ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. 


పొరపాటు జరిగితే ఇలా చేయండి

తప్పుడు ఖాతాకు డబ్బు పంపితే వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయాలి. జరిగిన విషయం వివరంగా చెప్పాలి. వాళ్లు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. దాన్ని దాచుకోవాలి. మీ టోకెన్ నంబర్ వచ్చినప్పుడు వాళ్లు ఫాలోఅప్ చేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. 

ఫోన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత అన్ని వివరాలతో కస్టమర్ కేర్‌కు ఈ-మెయిల్ కూడా పంపాల్సి ఉంటుంది. బ్యాంక్‌కు వెళ్లి మేనేజర్‌ను కలిసి జరిగిన విషయాన్ని వివరంగా చెప్పి కంప్లయింట్ రాసి ఇవ్వాలి. 

టైప్ చేసిన తప్పుడు నెంబర్‌కు ఖాతా లేకపోతే మీకు ఎటువంటి సమస్య లేదు. డెబిట్ అయిన డబ్బు తిరిగి వచ్చేస్తుంది. అది వేరే వ్యక్తి ఖాతా అయితే మాత్రం మీరు కష్టపడాల్సి వస్తుంది. 

ఆ వ్యక్తి కి ఫోన్ చేసి జరిగిన పొరపాటును వివరించాలి. ఆయన పాజిటివ్ గా స్పందిస్తే మీ డబ్బులు మీకు వెనక్కు వేస్తారు. ఆ వ్యక్తి నుంచి సరైన స్పందన లేకపోతే మీరు మీ బ్యాంకును సంప్రదించక తప్పదు.

మీరు సెండ్ చేసిన అకౌంట్ మీ బ్యాంక్‌లోనే ఉంటే బ్యాంక్ వాళ్లు సంబంధిత వ్యక్తిని సంప్రదిస్తారు. బ్యాంకు రూల్స్ చెప్పి డబ్బు వెనక్కు తీసుకుని మీకు ఇస్తారు. 

ఒకవేళ వేరే బ్యాంక్ అయితే మీ బ్యాంక్ ఆ వ్యక్తి ఖాతా వివరాలు మీకు ఇస్తుంది. మీరు ఆ వ్యక్తిని సంప్రదించి డబ్బు తిరిగి తీసుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి స్పందించే తీరు, మీరు చూపించే ఆధారాలపై డబ్బులు ఎంత త్వరగా వస్తాయన్నది ఆధారపడి ఉంటుంది. 

తప్పు జరగకుండా డబ్బు పంపే ముందే వివరాలు సరిచూసుకోవడం మంచి పని. ముఖ్యంగా అకౌంట్ నెంబర్, IFSC కోడ్ సరిగా నమోదు చేయాలి. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ముందు 1 రూపాయి పంపి చెక్ చేసుకున్న తర్వాత మిగిలిన డబ్బు పంపడం సరైన మార్గం. ఆన్‌లైన్‌లో డబ్బు పంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులకు పెద్ద మొత్తంలో డబ్బు పంపినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.

Latest Videos

click me!