ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డ్యూయల్ సిమ్స్ ఉపయోగిస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరికి రెండు ఫోన్ నంబర్లు ఉంటున్నాయి. కొంతమంది వివిధ అవసరాల కోసం మూడు, నాలుగు సిమ్‌లను కూడా ఉపయోగిస్తారు. అవి కూడా వేరే వేరే నెట్వర్క్ లకు చెందినవి అయి ఉంటాయి. ఎందుకంటే ఒక సిమ్ కి సిగ్నల్ లేకపోయినా మరో సిమ్ నంబరుకు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్ నెట్ సౌకర్యం కూడా మీ ప్రాంతంలో ఎక్కువ సిగ్నల్ వచ్చే సిమ్ కే యాక్టివేట్ అయి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు రెండేసి సిమ్ లు ఉపయోగిస్తుంటారు.
అయితే సిగ్నల్స్ సరిగా లేవని, రీఛార్జ్ ధరలు పెంచారని కొందరు సిమ్ కార్డులు రీఛార్జ్ చేయడం మానేస్తుంటారు. రీఛార్జ్ చేయకుండా సిమ్ నిలిపివేస్తే ఆ నంబర్ ను టెలికాం సంస్థ తర్వాత వేరొకరికి కేటాయిస్తుంది. అందుకే మీ ఫోన్ చేస్తే వేరే ఎవరో మాట్లాడుతున్నారని అప్పుడప్పుడు మన సన్నిహితులు చెబుతుంటారు. సిమ్ కార్డు ఉపయోగాలు, ఎక్స్‌పైరీ డేట్ తదితర విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం.
సిమ్ కార్డు ను ఎలా ఉపయోగించాలన్న విషయం చాలా మందికి తెలియదు. రెగ్యులర్ గా కాల్ చేసే నంబరుకు మాత్రం రీఛార్జ్ చేస్తుంటారు. మిగతా నంబర్ల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇన్ కమింగ్ కాల్స్ వస్తున్నాయి కదా అని అవుట్ గోయింగ్ సేవలు అవసరం లేదని రీఛార్జ్ చేయడం మానేస్తుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సిమ్ కార్డుకు బేసిక్ ప్లాన్ రీచార్జ్ చేయకపోతే 30 రోజుల తర్వాత అవుట్‌గోయింగ్ కాల్స్, డేటా సేవలు నిలిపివేస్తారు. ఈ నిర్ణయం ఆయా టెలికాం కంపెనీలపై ఆధారపడి ఉంటుంది. ఎయిర్ టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్-ఐడియా తదితర టెలికాం సంస్థలన్నీ సాధారణంగా నెల రోజుల తర్వాత అవుట్ గోయింగ్ సేవలు నిలిపివేస్తాయి. 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు రీచార్జ్ చేయకపోతే పూర్తిగా డి-యాక్టివేట్ అవుతుంది.
అయితే సిమ్ కార్డు వాడకపోయినా ఆ నంబర్ మిస్ అవ్వకూడదని చాలా మంది కోరుకుంటారు. ఎందుకంటే ఆ నంబర్ కలిసొచ్చిందనో, ఫ్యాన్సీ నంబర్ కావడం వల్లనో, ఎక్కువ మందికి ఈ నంబర్ కాంటాక్ట్ లో ఉందనో పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అలాంటి సిమ్ వివిధ కారణాల వల్ల డీ యాక్టివేట్ అయితే సేవను పునరుద్ధరించడానికి సాధారణంగా 6 నుండి 9 నెలల వరకు సమయం పడుతుంది. ఆ తర్వాత నంబర్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా అది మళ్లీ యాక్టివేట్ అవుతుంది.
డి-యాక్టివేట్ అయిన సిమ్ కార్డ్ మళ్ళీ యాక్టివేట్ చేయడానికి మీరు మీ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ కేర్ ని సంప్రదించడం అవసరం. నెట్‌వర్క్ సంస్థకు వెళ్లి కొత్త KYC డాక్యుమెంట్లతో కూడిన వేరియఫికేషన్ చేయించాలి. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత సిమ్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. సాధారణంగా ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి సుమారుగా ఒక సంవత్సరం పడుతుంది. ఇంత ప్రయాస పడటం కంటే మీకు అవసరమైన ఫోన్ నంబరును ఎప్పటికప్పుడు బేసిక్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవడం ముఖ్యం.