WhatsApp చాలా ప్రజాదరణ పొందిన యాప్. మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలు, వీడియో కాల్స్, వాయిస్ మెసేజ్‌లు వంటి అనేక సౌకర్యాలను అందిస్తుంది. భారతదేశంలో WhatsApp వినియోగదారుల సంఖ్య చాలా ఎక్కువ. వినియోగదారులు ప్రతిరోజూ సమాచారం, వీడియోలు, ఫోటోలు, అనేక ఇతర విషయాలను WhatsApp ద్వారా షేర్ చేస్తుంటారు. కానీ నిషేధం చేసిన ఈ నాలుగు విషయాల గురించి వచ్చిన మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలను పొరపాటునైనా షేర్ చేశారనుకోండి. వాటిని ఎవరైనా చూసి కంప్లైంట్ చేస్తే మీరు ఇబ్బందులు పడతారు.
మీకు తెలుసా.. 4 బిలియన్ల మంది వినియోగదారులు WhatsAppని ఉపయోగిస్తున్నారు. అయితే చాలా మందకి WhatsApp ద్వారా ఏమి షేర్ చేయవచ్చు? ఏమి ఫార్వర్డ్ చేయకూడదు అనే విషయాలు తెలియవు. తెలియక పోయినా చట్ట విరుద్ధమైన ఆ పనులు చేస్తే ఇబ్బందులు తప్పవు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. మీరు పొరపాటున నియమాలను ఉల్లంఘిస్తే ఆటోమెటిక్ గానే ఫిర్యాదు నమోదవుతుంది. వెంటనే మీ WhatsApp అకౌంట్ బ్లాక్ అవుతుంది. అందుకే గుర్తుంచుకోవలసిన నాలుగు ముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
అశ్లీల ఫోటోలు, వీడియోలను షేర్ చేయవద్దు
WhatsApp ద్వారా ఎలాంటి అశ్లీల వీడియోలు లేదా ఫోటోలను షేర్ చేయవద్దు. అలా చేస్తే మీ WhatsApp అకౌంట్ బ్లాక్ అవుతుంది. ఏదైనా ఫార్వర్డ్ చేసిన ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేసే ముందు వాటి గురించి ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. మీకు సరైనవి అనిపిస్తేనే మీ మిత్రులకు, బంధువులకు సెండ్ చేయండి. సమాజాన్ని నాశనం చేసేవి, తప్పు దారి పట్టించేవి ఏవైనా పొరపాటున కూడా షేర్ చేయకూడదు.
దేశ వ్యతిరేక సందేశాలను షేర్ చేయవద్దు
దేశ ఐక్యతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించే దేశ వ్యతిరేక సందేశాలు, ఫోటోలు, వీడియోలు, అలాంటి ఏ సమాచారాన్ని కూడా షేర్ చేయవద్దు. ఇది చట్ట విరుద్ధమైన పని. రాజ్యాంగ నియమాలకు విరుద్ధం. మీరు కనుక ఇలా చేస్తే మీ WhatsApp ఖాతా నిషేధించడమే కాకుండా కంప్లయింట్ కూడా నమోదు అవుతుంది. దేశ వ్యతిరేక కార్యకలాపాల ఫిర్యాదు కారణంగా మీరు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు. పోలీస్ స్టేషన్, కోర్టుల్లో మీరు సంజాయిషీ చెప్పుకోవాల్సి ఉంటుంది.
పిల్లలపై వేధింపులు
పిల్లలపై వేధింపులు లేదా దాడుల సంఘటనలను మీ WhatsApp అకౌంట్ కి వస్తే పొరపాటున కూడా షేర్ చేయవద్దు. పిల్లల మనసులు చాలా సున్నితంగా ఉంటాయి. కనుక వారిని బాధ పెట్టినట్లు అవుతుంది. అంతేకాకుండా మరికొందరు పిల్లలు ఇలాంటి వాటిని ఫాలో చేసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివి షేర్ చేయడం సమాజాన్ని తప్పుదారి పట్టించే చర్యగా అధికారులు పరిగణిస్తారు. ఏమర పాటుగానైనా ఈ విషయాలను షేర్ చేస్తే మీరు జైలు శిక్షను ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలపై వేధింపులకు సంబంధించిన ఫార్వర్డ్ చేసిన వీడియోలు, ఫోటోలు లేదా సందేశాలను షేర్ చేయవద్దు.
ఇతరుల ఫోటోలు, వీడియోలను షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
ఇతరుల ఫోటోలు, వీడియోలను WhatsApp ద్వారా షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు షేర్ చేసే సమాచారం, ఫోటోలు, వీడియోలు వారి గౌరవానికి భంగం కలిగించకూడదు. ఎవరికైనా గౌరవానికి భంగం కలిగించినట్లు భావిస్తే మీపై కేసు నమోదు చేస్తారు. పరువు నష్టం దావా వేసి కోర్టకు హాజరయ్యేలా చేస్తారు. ఆరోపణలు రుజువైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది.