జపాన్ ఓపెన్ లో భారత్ పోరాటం ముగిసింది. కోట్లాది భారత అభిమానులు ఆశలు పెట్టుకున్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఈ మెగా టోర్నీలో క్వార్టర్స్ లోనే ఇంటి బాట పట్టాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రణయ్.. 17-21, 21-15, 20-22 తేడాతో చైనీస్ తైఫీకి చెందిన చౌ టియెన్ చెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
తొలి సెట్ లో ఓడినా రెండో రౌండ్ లో పుంజుకున్న ప్రణయ్.. అదే జోరును చివరి రౌండ్ లో కొనసాగించలేకపోయాడు. హోరాహోరిగా ముగిసిన పోరులో చౌ టియెన్ నే విజయం వరించింది.
ఈ మెగా టోర్నీలో ప్రణయ్ తొలి రౌండ్ లో మలేషియాకు చెందిన అంగుస్ ను ఓడించిన ప్రణయ్.. ప్రిక్వార్టర్స్ లో 22-20, 21-19 తోమాజీ వరల్డ్ ఛాంపియన్ లో కీన్ యూ (సింగపూర్) ను మట్టి కరిపించి క్వార్టర్స్ కు చేరాడు.
ప్రణయ్ నిష్క్రమించడంతో ఈ టోర్నీలో భారత పోరాటం కూడా ముగిసింది. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారులు తొలి రౌండ్ లోనే ఇంటి బాట పట్టారు.
ఇక కిదాంబి శ్రీకాంత్.. తొలి రౌండ్ లో జపాన్ కు చెందిన లి జి జియా ను 22-20, 23-21 తేడాతో ఓడించాడు. కానీ రెండో రౌండ్ లో మాత్రం ఆ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. కంట త్సునెయమ చేతిలో 21-10, 21-16 తేడాతో దారుణ ఓటమి చవిచూశాడు. కనీసం పోటీ కూడా ఇవ్వకుండా ప్రత్యర్థికి విజయాన్ని అందించి ఇంటిబాట పట్టాడు.
అంతకుముందు పురుషుల డబుల్స్ లో అర్జున్-కపిల ల ద్వయం, మహిళల డబుల్స్ లో జాలీ-గాయత్రి గోపీచంద్ ల జోడీ, మిక్స్డ్ డబుల్స్ లో ప్రసాద్ - దేవాంగన్ ల జంట తొలి రౌండ్ లోనే ఓడి నిరాశపరిచింది.