కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా మలేషియాతో మంగళవారం జరిగిన బ్యాడ్మింటన్ మిక్స్డ్ ఈవెంట్ లో భారత బ్యాడ్మింటన్ జట్టు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫైనల్ లో పీవీ సింధు విజయం సాధించినప్పటికీ మిగిలినవారు విఫలమయ్యారు. దీంతో భారత్ మలేషియా చేతిలో 3-1 తేడాతో ఓడింది.
Image credit: Getty
మ్యాచ్ అనంతరం సింధు స్పందిస్తూ.. కొన్నికొన్నిసార్లు మనదికాని రోజున ఏదీ కలిసిరాదని తెలిపింది. తాను మ్యాచ్ గెలిచినప్పటికీ ఫైనల్ లో స్వర్ణం రాకపోవడం నిరాశగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అయిపోయిందేదో అయిపోయిందని.. ఇక తాము వ్యక్తిగత ఈవెంట్ల మీద దృష్టి పెడతామని తెలిపింది.
సింధు మాట్లాడుతూ.. ‘ఇక టీమ్ ఈవెంట్ ముగిసింది. ఇప్పట్నుంచి మేము వ్యక్తిగత పోటీల మీద దృష్టి పెట్టాలి. నేను స్వర్ణం కోసం ఆడుతున్నాను. ఆ మేరకు నా శాయశక్తులా కృషి చేస్తాను. జట్టుగా ఆడే ఆట కంటే వ్యక్తిగత పోటీలు భిన్నంగా ఉంటాయి. ఫైనల్లో మేము మలేషియాతో బాగానే ఆడాము. అయితే అదేమీ సులువైన జట్టు కాదు.
ఇప్పటివరకు కలిసికట్టుగా ఆడిన మేము ఇకనుంచి ఎవరికి వారు ఆడాల్సి ఉంది. అయితే ఫైనల్లో నేను గెలిచి పాయింట్ ఇవ్వడం ఆనందంగానే ఉన్నా స్వర్ణం నెగ్గనందుకు బాధగా ఉంది. ఇంత కష్టపడ్డా స్వర్ణం నెగ్గలేకపోయామన్న లోటు ఉంది..’ అని తెలిపింది.
మలేషియాతో ఫైనల్లో భారత్.. మహిళల సింగిల్స్ లో పీవీ సింధు 22-20, 21-17తో జిన్ వీ పై గెలిచింది. కానీ పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్.. 19-21, 21-6, 16-21 తేడాతో జి యాంగ్ చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ జోడీ 18-21, 15-21 తేడాతో ఫాంగ్-వూయి ల చేతిలో ఓటమి పాలైంది.
మహిళల డబుల్స్ లో కూడా పుల్లెల గాయత్రి గోపీచంద్-ట్రెసా జాలీ జోడీ 18-21, 17-21 తో తిన్నయ -పియర్లీ చేతిలో ఓడటంతో భారత్ స్వర్ణ పతక ఆశలు గల్లంతయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.