మీ బండిపై చాలా కాలంగా ట్రాఫిక్ ఫైన్స్ పెండింగ్‌లో ఉన్నాయా? వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఈ సమాచారం తప్పకుండా తెలియాల్సిందే…
చాలా కాలంగా కట్టకుండా ఉన్న ట్రాఫిక్ ఫైన్లను క్లియర్ చేసుకోవాలనుకునే వారికి సెప్టెంబర్ 12, 2026 చాలా ముఖ్యమైన తేదీ. ఈ సంవత్సరానికి గాను జాతీయ లోక్ అదాలత్ ఈరోజు జరగనుంది… దేశవ్యాప్తంగా లీగల్ సర్వీసెస్ అథారిటీలు ఈ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తాయి. దీని ద్వారా అర్హత ఉన్న పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చు. ఇందులో మీ వెహికిల్ పై ఉన్న పెండింగ్ ఫైన్స్ చాలా తగ్గింపుతో కట్టవచ్చు.
24
ఏమిటీ లోక్ అదాలత్?
కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు లేదా కోర్టుకు వెళ్లకముందే ఉన్న వివాదాలను రాజీ పద్ధతిలో పరిష్కరించడమే లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం. చట్ట ప్రకారం రాజీకి వీలున్న కేసులను మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి మీ వాహనంపై ఫైన్ ఉందని ఆటోమేటిక్‌గా మాఫీ అవుతుందని అనుకోవద్దు. కేసు స్వభావాన్ని బట్టి, సంబంధిత అధికారులు దాని అర్హతను నిర్ణయిస్తారు.
లోక్ అదాలత్‌లో ఇరు పక్షాల అంగీకారంతో, రాజీ మార్గంలో కేసును పరిష్కరిస్తారు. ఒకసారి రాజీ కుదిరితే లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అంతిమమైనది… ఇరు పక్షాలూ దీనికి కట్టుబడి ఉండాలి. ఈ తీర్పుపై సాధారణంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని జాతీయ న్యాయ సేవల అథారిటీ (NALSA) స్పష్టం చేస్తోంది. అయితే రాజీకి అర్హత లేని కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించలేరు.
34
పెండింగ్ ఫైన్స్ క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలి?
మీ వాహనంపై పెండింగ్ ఫైన్స్ లోక్ అదాలత్ ద్వారా క్లియర్ చేసుకోవాలని అనుకునేవారు ముందుగా కేసు స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ఏ డాక్యుమెంట్లు కావాలి, ఏ కోర్టును సంప్రదించాలి అనేది కేసును బట్టి మారుతుంది. కాబట్టి సెప్టెంబర్ 12కి ముందే మీ స్థానిక జిల్లా న్యాయ సేవల అథారిటీ ప్రకటనలను చూసుకోవడం మంచిది.
చాలామంది లోక్ అదాలత్ ద్వారా 'ఫైన్ సగానికి తగ్గుతుంది' లేదా 'అన్ని ఫైన్లు మాఫీ' అవుతాయి అనుకుంటారు… కానీ ఇది నిజం కాదు. లోక్ అదాలత్ అనేది ఫైన్ల తగ్గింపు పథకం కాదు, అర్హత ఉన్న కేసులను రాజీ ద్వారా ముగించే ఒక చట్టపరమైన ప్రక్రియ.
తెలుగు రాష్ట్రాల న్యాయ సేవల అథారిటీలు కూడా సెప్టెంబర్ 12, 2026న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని అధికారికంగా ధృవీకరించాయి. కాబట్టి మీ పాత ఫైన్స్ విషయంలో అధికారిక ప్రకటనలు చూసి, సరైన పద్ధతిని పాటించడం ముఖ్యం.