పొద్దుపొద్దునే వాహనంలో పెట్రోల్ కొట్టించేవారు చాలామందే ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో పెట్రోల్ కొట్టించుకుంటేనే బండి ఎక్కువ మైలేజ్ ఇస్తుందని… మధ్యాహ్నం కొట్టిస్తే మైలేజ్ తగ్గుతుందని నమ్ముతారు. మరి ఇందులో నిజమెంత?
చాలామంది వాహనదారులకు ఉదయాన్నే పెట్రోల్ బంకులకు వెళ్లి ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం అలవాటు. పొద్దున వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి పెట్రోల్ సాంద్రత (డెన్సిటీ) ఎక్కువగా ఉంటుందని… దీనివల్ల ఎక్కువ ఇంధనం వచ్చి మైలేజ్ పెరుగుతుందని నమ్ముతారు. ఈ అభిప్రాయం పల్లెల్లో చదువుకోని వారినుంచి నగరాల్లో బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేసేవారి వరకు అందరిలోనూ ఉంది. కానీ ఈ నమ్మకంలో ఎంత నిజం ఉంది? దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? లేక ఇది కేవలం పుకారా? చాలామందికి తెలియని ఈ నిజాలేంటో వివరంగా చూద్దాం.
25
ఉదయం పెట్రోల్ కొట్టించుకుంటే మైలేజ్ పెరుగుతుంది అనడంవేనక దాగున్న సైన్స్ ఏంటి?
సాధారణంగా వేడి ద్రవాల కంటే చల్లని ద్రవాలు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటాయి. పెట్రోల్ కూడా ఒక ద్రవమే. కాబట్టి ఉదయం పూట ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు అంటే చల్లని వాతావరణం ఉన్నప్పుడు పెట్రోల్ సాంద్రత పెరిగి కాస్త చిక్కగా ఉంటుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. అందుకే ఈ సమయంలో పెట్రోల్ కొట్టించుకుంటే కాస్త ఎక్కువ వస్తుందని చాలామంది నమ్మకం.
అయితే నేడు ఆధునిక పద్దతుల్లో పెట్రోల్ బంకులను నిర్మిస్తున్నారు… ఇలాంటి పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని భూమి కింద ఉన్న పెద్ద ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ భూగర్భ ట్యాంకులు ఉదయం, పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల నుంచి పెట్రోల్‌ను కాపాడతాయి. అందువల్ల పెట్రోల్ బంకుల్లోని ట్యాంకుల్లో పెద్దగా ఉష్ణోగ్రత మార్పులు ఉండవు... ఉన్నా చాలా తక్కువ వ్యత్యాసం ఉంటుంది.
35
నిజంగా ఉదయం పెట్రోల్ కొడితే ఎక్కువ పెట్రోల్ వస్తుందా?
పైన చెప్పినట్లుగా పెట్రోల్‌ను భూగర్భ ట్యాంకుల్లో నిల్వ చేయడం వల్ల దాని ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండదు… రోజు మొత్తం ఒకే రకమైన టెంపరేచర్ మెయింటేన్ అవుతుంది. అంటే పెట్రోల్ సాంద్రతలో ఎలాంటి మార్పు ఉండదు… కాబట్టి ఉదయం ఎక్కువ సాంధ్రత, మధ్యాహ్నం తక్కువ సాంద్రత ఉంటుందనేది అపోహ మాత్రమే. కాబట్టి బండిలో ఉదయం పెట్రోల్ కొట్టించినా, మధ్యాహ్నం పెట్రోల్ కొట్టించినా మైలేజ్ లో ఏమాత్రం తేడా ఉండదు.
ఓ అధ్యయనం ప్రకారం… ఉష్ణోగ్రత వల్ల వచ్చే ఈ సాంద్రత తేడా మైలేజ్‌పై చాలా స్వల్ప శాతంలోనే మార్పును చూపిస్తుంది. దీనివల్ల వినియోగదారుడికి ఆచరణలో ఎలాంటి పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి ఉదయాన్నే పెట్రోల్ నింపడం వల్ల మైలేజ్ భారీగా పెరుగుతుందనే నమ్మకం ఆచరణలో పనికిరాదని శాస్త్రీయ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
వాహనం మైలేజ్ అనేది పెట్రోల్ నింపే సమయం మీద ఆధారపడి ఉండదు. అది అనేక ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది. మంచి మైలేజ్ కోసం వాహనం టైర్లలో సరైన ప్రెజర్ మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. అలాగే వాహనాన్ని కరెక్ట్ టైమ్‌కి సర్వీసింగ్ చేయిస్తే ఇంజిన్ స్మూత్‌గా పనిచేస్తుంది… తద్వారా మైలేజ్ పెరుగుతుంది.
ఇక కొన్ని డ్రైవింగ్ టిప్స్ కూడా వెహికిల్ మైలేజ్ పెంచుతాయి. అనవసరమైన సడెన్ బ్రేకులు వేయకుండా, ఒకే వేగంతో బండిని నడపడం వల్ల మైలేజ్ పెరుగుతుంది. సిగ్నల్స్ వద్ద ఎక్కువసేపు ఇంజిన్‌ను ఆన్ చేసి ఉంచడం వల్ల మైలేజ్ తగ్గుతుంది… 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేయడం ఉత్తమం.
సరైన గేర్ వాడకం, రోడ్డు, ట్రాఫిక్ పరిస్థితులు, వాహనం వయస్సు, దాని సాధారణ నిర్వహణ వంటివి మైలేజ్‌పై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఈ విషయాలపై దృష్టి పెడితే మీరు ఎక్కువ మైలేజ్ పొందవచ్చు. వెహికల్ ఇంజిన్ పనితీరుపై మైలేజ్ ఆదారపడి ఉంటుంది.
55
ఉదయం పెట్రోల్ కొట్టడం అవసరమా? చివరిగా ఏం తేలింది?
ఉదయాన్నే పెట్రోల్ నింపడం వల్ల వచ్చే సాంద్రత ప్రయోజనం, ఆధునిక పెట్రోల్ బంకుల్లో చాలా తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఫలానా టైమ్‌లోనే పెట్రోల్ కొట్టించాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్రోల్ నింపుకోవచ్చు.
పెట్రోల్ కొట్టించుకునే టైమ్ పై దృష్టి పెట్టేకంటే మీ వాహనం మైలేజ్ పెంచుకోవాలనుకుంటే టైర్లలో సరైన గాలి ఉండేలా చూసుకోండి. మీ వాహనాన్ని సరైన సమయానికి సర్వీస్ చేయించడంతో పాటు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ స్మూత్‌గా నడపడమే చాలా ముఖ్యం. ఈ ప్రాక్టికల్ సలహాల ద్వారా మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి పెట్రోల్‌కు ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.